బరిలోకి దిగితే ప్రత్యర్థులు చిత్తే..
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

బరిలోకి దిగితే ప్రత్యర్థులు చిత్తే..

రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి

గోవాలో జరిగిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ ఛాంపియన్‌ షిప్‌తో శివాజీ

సూర్యాపేట (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: తాను క్రీజ్‌లో అడుగు పెడితే ప్రత్యర్థులను చిత్తుచేస్తారు. ఎత్తుకు పైఎత్తు వేసి ప్రత్యర్థి జట్టును ఓడిస్తారు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్నా క్రీడా పోటీల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెట్‌, వాలీబాల్‌ పోటీల్లో రాణిస్తున్నారు. ఈ నెల 23 నుంచి నేపాల్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ వాలీబాల్‌ ఛాంఫియన్‌షిప్‌(అమేచ్యూర్‌ రూరల్‌ గేమ్స్‌)కు ఎంపికైన కప్పల శివాజీపై ‘న్యూస్‌టుడే’ కథనం.

కేతేపల్లి మండలం కొప్పోలుకు చెందిన యువకుడు కప్పల శివాజీ బీటెక్‌ ఈఈఈ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులు సుమీల, సైదులు. పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో క్రికెట్‌, వాలీబాల్‌ ఆటల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. పదో తరగతి తరువాత నిరంతరం సాధన చేస్తూ క్రీడాపోటీల్లో రాణిస్తున్నారు. క్రికెట్‌లో బ్యాటింగ్‌లో, వాలీబాల్‌లో కట్టర్‌గా ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ ముందంజలో ఉంటున్నారు. మూడు బంగారు, ఒక వెండి పతకాలు కైవసం చేసుకొని రాష్ట్రానికే ప్రత్యేక గుర్తింపును తెచ్చారు. క్రికెట్‌, వాలీబాల్‌ రాష్ట్ర జట్లకు సారథ్యం(కెప్టెన్‌)గా వ్యవహరిస్తూ వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్ల్లో ఆడి పతకాలు కైవసం చేసుకుంటున్నాడు. జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌- 2021 ఏప్రిల్‌లో (జైపూర్‌)లో ఆడి అక్కడి ఎమ్మెల్యే, సౌత్‌ ఇండియా సెక్రటరీ లక్ష్మణ్‌నాయక్‌ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈయన చూపుతున్న ప్రతిభకు ఈ నెల 23 నుంచి నేపాల్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ వాలీబాల్‌ ఛాంఫియన్‌షిప్‌(అమేచ్యూర్‌ రూరల్‌ గేమ్స్‌)కు ఎంపికయ్యారు.

జైపూర్‌లోని జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా

ఛాంపియన్‌షిప్‌ కప్పు అందుకుంటున్న శివాజీ జట్టు

సాధించిన విజయాలు ఇలా..

* జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌- 2021 ఏప్రిల్‌లో (జైపూర్‌) ఆడి బంగారు పతకం కైవసం చేసుకున్నారు.

* రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌-2021 నవంబరు (వరంగల్‌)లో ఆడి వెండి పతకం సాధించారు.

* జాతీయ స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌- 2021 జులై, ఆగష్టు (గోవా)లో రెండుసార్లు ఆడి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం: శివాజీ

చిన్నప్పటి నుంచి క్రికెట్‌, వాలీబాల్‌ ఆటలంటే ప్రాణం. నాకు ఇష్టమైన ఆటల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఈ క్రీడల్లో క్రీడాకారుడిగా మరింత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నా. రాష్ట్రానికి మంచి గుర్తింపుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని