రూ.600 కోట్ల పనులపై తర్జనభర్జన
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

రూ.600 కోట్ల పనులపై తర్జనభర్జన

‘నాడు..నేడు’పై పడని ముందడుగు

కేజీహెచ్‌లో భవనాల తొలగింపుపై అనిశ్చితి

కార్డియాలజీ విభాగం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో ‘నాడు-నేడు’ పథకం కింద రూ.600కోట్లతో తలపెట్టిన పనులను ఏ రకంగా ప్రారంభించాలనే విషయమై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ఆయా పనులకు గుత్తేదారు ఎంపిక పూర్తి అయింది. ఇప్పటికే ఒకసారి గుత్తేదారు ప్రతినిధులు కేజీహెచ్‌కు వచ్చి పరిశీలన చేసి వెళ్లారు. సాధ్యమైనంత త్వరగా ‘నాడు-నేడు’ కింద నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిపాదిత భవనాలను ఖాళీ చేసి అప్పగించాలని వైద్యాధికారులకు ప్రభుత్వ పరంగా ఆదేశాలు వచ్చాయి.

నాలుగు బ్లాకులకు ప్రతిపాదన: ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత నెలలో జేసీ అరుణ్‌బాబు కేజీహెచ్‌లో పర్యటించారు. ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ పి.మైథిలి, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ నాయుడు, ఇతర అధికారులతో కలిసి కేజీహెచ్‌లో పలు భవనాలను పరిశీలించారు. ప్రసూతి విభాగం, ఆర్థోపెడిక్స్‌, కార్డియాలజీ, సర్జికల్‌, ఆంకాలజీ భవనాలు, ఏఎంసీ పరిధిలో ప్రిన్సిపల్‌ కార్యాలయంతో పాటు ఎస్‌పీఎం, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, అనాటమీ, ఫిజియాలజీ తదితర భవనాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు బ్లాకులు నిర్మించాలి. పీజీ, యూజీ వసతిగృహాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఆయా వసతిగృహాలకు ప్రత్యామ్నాయ స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

మూడోదశ కొవిడ్‌ వస్తే ఎలా

కేజీహెచ్‌కు వచ్చే సరికి ప్రసూతి, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, ఆర్థోపెడిక్‌, సర్జరీ విభాగాలను ఎక్కడికి తరలించాలనే విషయమై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కేజీహెచ్‌లో దాదాపు 800 పడకలను సిద్ధం చేశారు. వీటిలో సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 450 పడకలు, మిగిలినవి మెడికల్‌, సర్జికల్‌ వార్డుల్లో ఉన్నాయి. వాటికి ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ కేసులు అధికంగా రాకున్నప్పటికీ.. ఒక వేళ వస్తే ఎలా ముందుకెళ్లాలనే విషయమై చర్చ నడుస్తోంది.

రెండు రకాల ప్రణాళికలు

* కేజీహెచ్‌లోని వార్డులు, పడకలను విమ్స్‌కు తరలిస్తే.. అక్కడ కొవిడ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఒక వైపు కొవిడ్‌ బాధితులతో పాటు సాధారణ రోగులకు చికిత్స అందించే స్థాయిలో విమ్స్‌లో వసతులు లేవు. దీంతో రెండు రకాల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండు ప్రతిపాదనలు కలెక్టర్‌ వద్దకు వెళ్లాయి. ఆయా అంశాలపై వైద్యాధికారులతో చర్చిస్తున్నారు.

* ఒకటో ప్రణాళిక: కొవిడ్‌ చికిత్సను కేజీహెచ్‌కు పరిమితం చేసి, ఇక్కడి విభాగాలను విమ్స్‌కు తరలించడం.

రెండో ప్రణాళిక: విమ్స్‌ను కొవిడ్‌ చికిత్సకు పరిమితం చేసి, కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ను ఆసుపత్రి ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించడం.

* జీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో రేడియాలజీ సేవలు అందించేందుకు బార్క్‌ అనుమతులు మంజూరు చేసింది. ఆయా అంశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ త్వరలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు విభాగాల తరలింపు, భవనాల నిర్మాణ పనులు ప్రారంభంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. విమ్స్‌ ప్రాంగణంలో ఖాళీ స్థలం ఉన్నందున అక్కడ ‘నాడు-నేడు’ నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని