విశాఖలో బెదిరించి భూములు లాక్కుంటున్నారు!
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

విశాఖలో బెదిరించి భూములు లాక్కుంటున్నారు!

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న

మాట్లాడుతున్న తెదేపా నేత బుద్ధా వెంకన్న, చిత్రంలో ఎమ్మెల్యే గణబాబు, నేతలు రాజప్ప,

అయ్యన్నపాత్రుడు, నాగజగదీశ్వరరావు, పప్పల చలపతిరావు, పల్లా శ్రీనివాసరావు, తదితరులు

విశాఖపట్నం, అనకాపల్లి - న్యూస్‌టుడే: అనకాపల్లిలో ఈనెల 20న జరగనున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని తెదేపా నేతలు నిర్ణయించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తొలుత అనకాపల్లిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ బాధ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నగర, గ్రామీణ జిల్లాల అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రులు సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పప్పల చలపతిరావు, వంగలపూడి అనిత, పీలా గోవింద సత్యనారాయణ, అప్పల నర్సింహరాజు, గండి బాబ్జీ, కోళ్ల లలితకుమారి, రామానాయుడు మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని నేతలు సూచించారు. 20న ఉదయం 8గంటలకు ప్రత్యేక విమానంలో లోకేష్‌ విశాఖకు చేరుకుంటారని చినరాజప్ప తెలిపారు. విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా అనకాపల్లి వెళతారని చెప్పారు. విద్యుత్తు సమస్యలపై ఈనెల 26న నియోజకవర్గాల వారీ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు సాగించడంతోపాటు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ బాధ్యులు పి.వి.జి.కుమార్‌, కోరాడ రాజబాబు, ప్రగడ నాగేశ్వరరావు, నాయకులు లాలం భాస్కరరావు, డాక్టరు కె.నారాయణరావు, నీలిబాబు, జోగినాయుడు, కాయల మురళి, కొణతాల వెంకటరావు, ఉగ్గిన రమణమూర్తి, బొద్దపు ప్రసాద్‌, కోట్ని బాలాజీ, శంకర్ల పద్మలత తదితరులు పాల్గొన్నారు.

‘బెదిరించి భూములు లాక్కుంటున్నారు..’
విశాఖలో బెదిరించి భూములు లాక్కొంటున్నట్లు కొంత మంది బాధితులు తనకు చెప్పారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో విజయసాయి బెదిరించి భూములు, విలువైన ఆస్తులను లాక్కొంటున్నారని ఆరోపించారు. 2024లో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని, విజయసాయిరెడ్డి బాధితుల కోసం పార్టీ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులు ఒక్క ఫోన్‌కాల్‌ చేస్తే అవసరమైన సహాయం అందుతుందన్నారు. పోలీసుస్టేషన్‌కు సైతం వెళ్లవల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు గురించి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని వెంకన్న హెచ్చరించారు. అమర్‌ తండ్రి గురునాథరావు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చేరదీసి ఆయన తల్లికి ఎమ్మెల్యే టికెట్‌, ఈయనకు కార్పొరేటర్‌ టికెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చని, అంతేకానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన జవాబు చెబుతామని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు.
* మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్‌ చేసిన వాగ్ధానాలకు ఇప్పుడు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు. కాగ్‌ నివేదికలో రాష్ట్ర ఆదాయం పెరిగినట్లు చూపుతున్నారని, మరి ఆ సొమ్ము ఎక్కడికి వెళ్లిందని నిలదీశారు. పర్యాటకశాఖ మంత్రికి తెలియకుండానే ఆ శాఖ రిసార్టును కూల్చేశారని, అనకాపల్లిలో 240 ఎకరాల కొండను తవ్వేశారన్నారు. హెటిరో ఔషధ సంస్థపై ఆదాయపన్ను శాఖ జరిపిన దాడుల్లో రూ.4వేల కోట్ల మేర నగదు పట్టుబడిందని, అదంతా జగన్‌ దోచిన సొమ్మేనని అయ్యన్న ఆరోపించారు.

విద్యుత్తు కోతలు మొదలయ్యాయి: చినరాజప్ప
చినరాజప్ప విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా పార్లమెంటు పార్టీ కార్యాలయాన్ని అనకాపల్లిలోనే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. లోకేష్‌ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రోడ్లపై అడుగుకో గొయ్యి ఉంటోందని, ప్రజలు రోడ్డుమీదకు రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో విద్యుత్తు కోతలంటే తెలియదని, 24 గంటలు విద్యుత్తు సరఫరా చేశామని గుర్తు చేశారు. ఇప్పడు వేసవి రాకముందే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు విద్యుత్తు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని