క్షీరారామలింగేశ్వరుడి ఆలయ భూమికి ఎసరు!
logo
Published : 19/06/2021 02:38 IST

క్షీరారామలింగేశ్వరుడి ఆలయ భూమికి ఎసరు!

ఆక్రమణలకు యత్నం

ఆస్తుల పరిరక్షణలో అధికారుల ఉదాసీనత

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే


దేవాలయ స్థలంలో నిర్మించిన పక్కా ఇల్లు

పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ చూసీచూడనట్టు వ్యవహరించడంతో కోట్లాది రూపాయల విలువైన భూములు నివాసాలుగా మారుతున్నాయి.

క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానానికి పాలకొల్లు సూర్యతేజనగర్‌ సమీపంలో సుమారు 4.5 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ గజం రూ.20 వేల ధర పలుకుతోంది. ఈ లెక్కన ఎకరా సుమారు రూ.9.6 కోట్ల విలువ చేస్తుంది. అంటే 4.5 ఎకరాలు రూ.43 కోట్లు పైమాటే. అప్పట్లో ఆలయంలో ఉత్సవాలు, కల్యాణాలకు బాజాభజింత్రీలు వాయించే వారికి ఈ భూములను ఈనాముగా ఇచ్చారు. పంట పండించుకునే హక్కు మాత్రమే వారికి కల్పించారు. అలా వారసత్వంగా వస్తున్న వారు వంతుల వారీగా దేవుడికి సేవ చేస్తూ పంటను అనుభవించే వారు. అయితే చుట్టూ ఆవాసాలు ఏర్పడటంతో సాగునీరు అందక బీడుగా మారింది. 16 మంది వరకు వారసత్వం కలిగిన వారు ఉన్నారు. వీరంతా పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఒక్కరు కూడా ఆలయంలో సేవ చేయడం లేదు. అయినా భూమిపై పూర్తి హక్కు తమకే ఉందంటూ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.

బీడు భూమి సబ్‌ లీజు

ఏదైనా ఆదాయం వస్తుందంటే దాన్ని లీజుకు తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ బీడు భూమిని వేరొక వ్యక్తి వారి వద్ద సబ్‌లీజుకు తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బాజాభజింత్రీకులు ఆ వ్యక్తిని కాపలాదారుడిగా ఉంచినట్టే. సదరు వ్యక్తి గతంలో దీన్ని చేపల చెరువుగా మార్చేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో దేవస్థాన సిబ్బంది అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా సిమెంట్‌ ఇటుకలతో పక్కా ఇంటి నిర్మాణం పూర్తిచేసి కాపురం కూడా పెట్టేశాడు. విలువైన స్థలాన్ని కాపాడుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మరికొందరు నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి యాళ్ల సూర్యనారాయణ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇంటిని తొలగించడానికి కూలీలు దొరకడం లేదని సంబంధిత వ్యక్తి చెబుతున్నాడని ఆయన తెలిపారు.

ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని