యువత గుండెల్లో గుబులు!
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

యువత గుండెల్లో గుబులు!

30-45 ఏళ్ల వయస్సులో హృద్రోగ సమస్యలు
మారుతున్న జీవన శైలి ప్రధాన కారణమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌

మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి గత ఆరు నెలల్లో హృద్రోగ సమస్యతో 16731 మంది వచ్చారు. వీరిలో 30-45 వయస్సు వారు 22 శాతం, 46-60 ఏళ్లు వారు 48 శాతం, మరో 30 శాతం 60 ఏళ్లు దాటిన వారు ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. గతంలో పోలిస్తే యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో సడన్‌ కార్డియాక్‌ అరెస్టు సమస్య ఎక్కువవుతోంది. ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. కొవిడ్‌ తర్వాత ఈ సమస్య మరింత పెరిగిందని చెబుతున్నారు. బుధవారం ప్రపంచ హృదయ దినం(వరల్డ్‌ హర్ట్‌ డే) సందర్భంగా ప్రత్యేక కథనం.
దెబ్బకొడుతున్న జీవన శైలి
ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఒకప్పుడు 65-70 వయస్సు వారిలో గుండె జబ్బులు ఎక్కువ ఉండేవి. ప్రస్తుతం యువత ఎక్కువ మంది హృద్రోగాల బారిన పడుతున్నారు. అస్తవ్యస్త జీవన శైలికి తోడు వృత్తి వ్యక్తిగత ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకుండా.. కూర్చొని చేసే పనులు.. పొగ తాగడం, జంక్‌ ఫుడ్స్‌కు అలవాటు పడటం తదితర కారణాలు ఇందుకు కారణమవుతున్నాయి. కరోనాతో రెండేళ్లుగా చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఎలాంటి వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలకు దారి తీస్తున్నాయని, అంతిమంగా గుండెపై ఆ ప్రభావం పడుతోంది. ఉదయం లేచించి మొదలు ఉరుకుల పరుగుల జీవనం.. చాలామంది వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. హృద్రోగుల్లో ఎక్కువ శాతం మంది పొగతాగే అలవాటు ఉన్నవారే. చివరికి అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. కొందరైతే చిన్న వయస్సులోనే బైపాస్‌ సర్జరీల వరకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.


యువతలో పెరుగుతున్న సమస్య
-డాక్టర్‌ అనిల్‌ కృష్ణ, సీనియర్‌ కార్డియాలజిస్టు, ఛైర్మన్‌, మెడికవర్‌

యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడినవారిలో రక్తం గడ్డ కట్టడంతో చాలా మంది గుండె జబ్బుల బారిన పడ్డారు.  ఆయాసం, గుండెనొప్పి, ఎక్కువ చెమట పట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ధూమ పానం మానివేయాలి. అధిక మద్య పానం మంచిది కాదు. క్రమశిక్షణతో కూడిన క్రియాశీలకమైన జీవన శైలి ముఖ్యం. ఇంట్లో తల్లిదండ్రులకు గుండె జబ్బుల చరిత్ర ఉంటే వారి పిల్లలు కూడా క్రమం తప్పకుండా హృద్రోగ పరీక్షలు చేసుకోవడం అవసరం.కరోనా బారిన పడితే.. జాగ్రత్త

-డాక్టర్‌ నిసర్గ, సీనియర్‌ కార్డియోథొరాసిక్‌ సర్జన్‌, కిమ్స్‌
హృద్రోగ సమస్యలు ఉన్నవారు కొవిడ్‌ బారిన పడితే.. కోలుకున్న తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. వైరస్‌ ఇన్‌ఫ్లమెటరీ ప్రభావాలతో కరోనరీ ధమనుల్లో ఇబ్బందులు తలెత్తి తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్‌(గుండెపోటు)కు దారి తీస్తుంది. కరోనా లక్షణాలు కనిపించిన సమయంలో తీవ్రమైన ఛాతి నొప్పి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మిగతా వారితో పోలిస్తే మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారిలో గుండె సమస్యలు ఎక్కువ. 30 ఏళ్లకే చాలామంది యువత బీపీ, షుగర్‌ బారిన పడుతున్నారు. ఇలాంటి వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని