పండక్కి వచ్చి అనంత లోకాలకు...
eenadu telugu news
Updated : 18/10/2021 05:28 IST

పండక్కి వచ్చి అనంత లోకాలకు...

ఖమ్మంలో జరిగిన ప్రమాదంలో బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలి మృతి

ముదిగొండ, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్‌ బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. వారిలో ముల్కలపల్లి ఉమ(38) ఉన్నారు. నవరాత్రులు అమ్మవారి విగ్రహాన్ని పూజించి నిమజ్జనం చేసేందుకు రెండు ట్రాక్టర్లలో వెళ్తుండగా ఒక ట్రాక్టర్‌ బోల్తాపడి ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త కోటేశ్వరరావు జీహెచ్‌ఎంసీఏలో శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఎఫ్‌ఏ). కుమారుడు సాయి శ్రీశాంత్‌ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతుండగా కుమార్తె కుసుమాంజలి నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. వీరి స్వస్థలం కమలాపురం. వీరి కుటుంబం 2001 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఏటా దసరాకు కుటుంబం అంతా కమలాపురం వచ్చి దుర్గా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరి కుటుంబం ఈనెల 13న హైదరాబాద్‌ నుంచి కమలాపురం వచ్చింది. గ్రామంలో సద్దుల బతుకమ్మ ఘనంగా చేశారు. రూ.50 వేలు వెచ్చించి బతుకమ్మ ఆడటంతో పాటు బతుకమ్మ విజేతలకు బహుమతులు అందజేశారు.. కోటేశ్వరరావు, ఉమ ఒకే ట్రాక్టర్‌లో ఉండగా కుమారుడు మరో ట్రాక్టర్‌లో ఉన్నాడు. ట్రాక్టర్‌ బోల్తా పడిన సంఘటనలో భార్య కళ్లెదుటే చనిపోవటంతో కోటేశ్వరరావు కన్నీరుమున్నీరయ్యారు. ట్రక్‌ బోల్తా పడిన సమయంలో ఇంజన్‌ ఉమ ఛాతిమీద పడటంతో అక్కడికక్కడే మరణించింది. తల్లి మృతదేహం పక్కన పడుకొని కుమారుడు సాయి శ్రీశాంత్‌ రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆదివారం ఉమ అంత్యక్రియలు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని