close

మంగళవారం, జులై 16, 2019

ప్రధానాంశాలు

వన్యప్రాణం పోతోంది..!

● దాహార్తితో విలవిలలాడుతున్న అడవి జంతువులు

● నెలకు రూ.1.25 లక్షలు చెల్లిస్తున్నా తప్పని తిప్పలు

నంద్యాల డివిజన్‌ అటవీ శాఖ కార్యాలయం

అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయం నల్లమల అడవులు. సుసంపన్నమైన ఔషధ జాతులతోపాటు అరుదైన మొక్కలు, రకరకాల జీవరాశులు ఈ అడవుల సొంతం. సువాసన వెదజల్లే పుష్పాలకు పుట్టినిల్లు. ఇన్ని విశిష్టతలకు నెలవైన అడవుల్లో ప్రస్తుతం వన్యప్రాణులు ప్రమాదం అంచున కాలం వెళ్లదీస్తున్నాయి. ఒకవైపు వేటగాళ్ల ఉచ్చుకు కొన్ని బలవుతుంటే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో దాహం తీరే మార్గం లేక గొంతెండి ప్రాణాలు వదులుతున్నాయి.- న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం, రుద్రవరం

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పరిష్కరించే వాటిల్లోనే అధికారులు కాసులు నొక్కేస్తున్నారు. ఇక మాటరాని అడవి జంతువులకు కోసం వచ్చిన నిధుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్ఛు జంతువుల దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.వేలు విడుదల చేస్తోంది. కానీ ఆ నిధులు పక్కదారి పడుతున్నాయని వాటి కోసం ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లను చూస్తే తెలిసిపోతుంది. వాటికి నీరందించి ఉంటే గ్రామాల్లోకి, పొలాల్లోకి వచ్చి వన్యప్రాణులు ప్రాణాలు ఎందుకు కోల్పోతాయి. అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జంతువైన పెద్ద పులులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నాయి. వీటికి కారణాలు ఏమైనా మూగ జీవాలకు మాత్రం విలువ లేకుండా పోయింది.

గుంతల్లో కనీసం తడి కూడా లేదు

నంద్యాల అటవీ డివిజన్‌ పరిధిలో ఐదు రేంజ్‌లున్నాయి. మొత్తం డివిజన్‌ విస్తీర్ణం 350.23 చదరపు కి.మీ. ఉంటుంది. 5 రేంజ్‌ల్లో జంతువుల కోసం గతంలో 68 గుంతలను (సాసర్‌పిట్స్‌), నూతనంగా మరో 60 గుంతలను ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు రేంజ్‌లల్లో 128 గుంతలు ఉన్నాయి. కానీ రుద్రవరం రేంజ్‌లో పరిశీలిస్తే పాత గుంతతోపాటు నూతనంగా ఏర్పాటు చేసిన గుంతలో కూడా కనీసం నీరు కాదు కదా, నీటి తడి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల వల్లనే జంతువులు దాహంతో పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి.

రుద్రవరం నల్లమల అటవీ ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఎండిపోయిన సాసర్‌పిట్‌

నెలకు రూ.1.25 లక్షలు కేటాయింపు

వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి ప్రత్యేకంగా నీటి గుంతలు (సాసర్‌పిట్స్‌) ఏర్పాటు చేశారు. ఆ గుంతల్లో నీటిని నింపేందుకు నెలకు ఒక్కో రేంజ్‌కు రూ.25 వేలను కూడా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ లెక్కన నంద్యాల డివిజన్‌ పరిధిలోని ఐదు రేంజ్‌లకు కలిపి నెలకు రూ.1.25 లక్షలు వస్తున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆ నీటి గుంతలను పరిశీలించి నీరు ఉందా లేదా అని తనిఖీ చేసి నీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఎక్కడా గుంతల్లో నీరు లేక ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేసవిలో చర్యలు ఇలా...

● డివిజన్‌ పరిధిలోని అటవీ శాఖ పరిధిలో ప్రతి 5 చదరపు కి.మీ.కు ఒక సాసర్‌ పిట్‌ను ఏర్పాటు చేయాలి.

● 5 సోలార్‌ పంపుల ద్వారా ప్రతిరోజూ గుంతల్లో పుష్కలంగా నీరు ఉండేలా చూడాలి.

● ప్రతి మూడు రోజులకు ఒకసారి సిబ్బంది గుంతలను పరిశీలిస్తూ నీరు లేని గుంతల్లో వెంటనే నింపాలి.

నిర్లక్ష్యం ఇలా...

● నంద్యాల డివిజన్‌ పరిధిలోని రుద్రవరం, బండిఆత్మకూరు, జీబీఎం రేంజ్‌ పరిధిలో కొన్ని నీటి గుంతల్లో నీరు లేక ఎండిపోయాయి.

● సోలార్‌ పంపుల ద్వారా నీటిని ఇంకా అందించడం లేదు.

● నీటి గుంతలు అదనంగా ఏర్పాటు చేసినా, ఇంకా నీరు నింపడం లేదు.

దాహాన్ని తీర్చేందుకు నీరు పోస్తున్నాం

- పల్లె శివశంకర్‌రెడ్డి, డీఎఫ్‌వో, నంద్యాల

వన్య ప్రాణులకు వేసవిలో దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తొట్టి, గుంతల్లో నీరు పోస్తున్నాం. ఎండ వేడికి నీరు ఆవిరై పోతోంది. 5 సోలార్‌ పంపులతో నిరంతరం నీరు పారుతోంది. అంతేకాకుండా నంద్యాల డివిజన్‌ పరిధిలో బ్రిటీష్‌ కాలం నుంచి ప్రతి 10 కి.మీ.కు ఒక బావి ఉంది. వాటిలో నీరు పుష్కలంగా ఉంది. ఆ బావుల్లోంచి నీటిని బయటకు తోడి పోసేందుకు ప్రతిపాదనలు పంపించాం. ఆ బావులు ఎప్పుడూ నీటితోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీరు నిరంతరం పారుతూనే ఉంటుంది. దీంతో వన్యప్రాణులకు నీటి కష్టాలు ఉండవు. గుంతల్లో నీటిని నింపని సిబ్బంది, రేంజ్‌ అధికారులపై చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.