close

బుధవారం, జూన్ 19, 2019

ప్రధానాంశాలు

వణికించిన వరుణుడు!

 ఉరుములు, మెరుపులు, గాలులతో అదిరిపడిన నగరవాసులు
 కరెంట్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం

ఈనాడు, హైదరాబాద్‌: నగరాన్ని గాలివాన వణికించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భయపెట్టింది. కొన్నిచోట్ల వడగళ్లవాన కురిసింది. పగలంతా ఎండలతో భగభగ మండగా.. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో గాలివాన మొదలైంది. వానకంటే ఉరుములు, మెరుపులతో నగరం అదిరిపడింది. గాలులకు ఇళ్ల కిటికీలు దడదడ కొట్టుకోవడంతో ఆయా ఇళ్లలో ఉండేవారు భయపడిపోయారు. గంటకు 32 కి.మీ.పైగా వేగంతో గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు తీగలకు తగిలి పలుచోట్ల విద్యుత్తులైన్లు ట్రిప్పయ్యాయి. ముందుజాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో సరఫరాను నిలిపేశారు.
* కాప్రా సర్కిల్‌ పరిధిలో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో బస్తీల్లో అంధకారం నెలకొంది.
* కొత్తపేట, హిమాయత్‌నగర్‌లో గాలిదూమారంతో కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
* మేడ్చల్‌, బోయిన్‌పల్లిలో బలమైన గాలులతో కూడిన వర్షం పడింది.
* నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కార్వాన్‌, విజయనగర్‌ కాలనీల్లో వానతో కరెంట్‌ సరఫరాలో అంతరాయం తలెత్తింది.
* ఖైరతాబాద్‌, షేక్‌పేట, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
* హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో గాలిదుమారానికి జనం వణికిపోయారు. కరెంట్‌ సరఫరా ఆగిపోయింది. ః సికింద్రాబాద్‌, నాచారం, మల్లాపూర్‌ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.ః మేడ్చల్‌ గౌడవెల్లిలో వడగళ్లవాన పడింది.

ఫీడర్ల పరిధిలో..  ఐడీపీఎల్‌, కుషాయిగూడ, మియాపూర్‌-1, జీడిమెట్ల-4, దూలపల్లి, కొంపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలోని అన్ని ఫీడర్లలో కరెంట్‌ సరఫరా నిల్చిపోయింది. ఇతర సబ్‌స్టేషన్లలో కొన్ని ఫీడర్ల పరిధిలో సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. బయటవాన, ఇంట్లో ఉక్కపోతకు కరెంట్‌ లేకపోవడంతో జనం అల్లాడిపోయారు.

ఉపరితల ఆవర్తనంతో.. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి : మేయర్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఈదురు గాలులు, వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని... ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదేశించారు. రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.