ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - Kamareddy - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

నేడు నమూనా నిర్వహించనున్నాం
విలేకరుల సమావేశంలో ఉన్నతాధికారులు

ఈనాడు, సంగారెడ్డి: ‘ప్రశాంత వాతావరణంలో సజావుగా లోక్‌సభ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నామని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రౌండ్‌ పూర్తికాగానే ఫలితాన్ని నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. దీంతో ఎవరైనా సరే ‘ఓటర్‌హెల్ప్‌లైన్‌ యాప్‌’ ద్వారా ఎప్పటికప్పుడు ఫలితాల తీరును తెలుసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈనెల 23న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావుతో పాటు కామారెడ్డి జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సంయుక్త పాలనాధికారి నిఖిల హాజరై లెక్కింపు సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు.

ఇవీ అత్యంత కీలకం
* కేవలం పాసులున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు.
* కౌంటింగ్‌ కేంద్రంలోనికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. మీడియా పాయింట్‌ వరకు మాత్రమే తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
* ఒకరి పాసు తీసుకొని మరొకరు వస్తే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
* ఓట్ల లెక్కింపు చేపట్టనున్న గీతం విశ్వవిద్యాలం ప్రాంగణంలో మొత్తం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్రం లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ వీరు నిశితంగా పరిశీలిస్తారు.
* లెక్కింపు తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల పర్యవేక్షణ కోసం తరలిస్తారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలవి కామారెడ్డి జిల్లాకు, బాన్సువాడ నియోజకవర్గం యంత్రాలను నిజామాబాద్‌కు తీసుకెళతారు. జహీరాబాద్‌, అందోలు, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సంగారెడ్డి జిల్లాలోనే భద్రపరుస్తారు.
* ఎన్నికల పిటిషన్‌ గడువు 45 రోజులు ఉంటుంది. అప్పటి వరకు యంత్రాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు.
* కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు చెందిన 300 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఇలా...
నాలుగు సందర్భాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు తర్వాతనే వీటిని మొదలుపెడతారు. వాటి ప్రాధాన్యత క్రమం ఇలా ఉంటుంది.
* కంట్రోల్‌ యూనిట్‌ డిస్‌ప్లే పనిచేయని పక్షంలో బ్యాటరీ సరిగా ఉందో లేదో పరీక్షిస్తారు. అయినా సమస్య ఉంటే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు.
* ఏదైనా సమస్య వచ్చిందని ఈసీ దృష్టికి వస్తే... వారి ఆదేశాలకు మేరకు వీటిని లెక్కించాల్సి ఉంటుంది.
* అభ్యర్థి లేదా ఏజెంటు అనుమానం వ్యక్తం చేస్తే రిటర్నింగ్‌ అధికారి మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికి అనుమతిస్తారు.
1. పోలైన ఓట్లలో తేడాలు వచ్చినట్లు గుర్తిస్తే
2. ఈవీఎంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు
3. ఓటు ఒక గుర్తుకు వేస్తే మరో గుర్తుకు వేసినట్లు స్లిప్పు కనిపించిందని పోలింగ్‌ వేళ ఫిర్యాదులు ఉంటే ఈ మూడింటిని పరిశీలించి వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడానికి ఆర్‌వో నిర్ణయం తీసుకోవచ్చు.
* ప్రతి నియోజకవర్గంలోనూ లాటరీ తీసి అయిదు పోలింగ్‌ కేంద్రాల్లో ఒకదాని తర్వాత మరోటి తప్పనిసరిగా స్లిప్పులను లెక్కిస్తారు.

నేడు రియల్‌ రిహార్సల్స్‌
లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులకు ఇప్పటికే శిక్షణ అందించారు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా పనిచేసిన అనుభవం ఉండటంతో మరింత కలిసొస్తుందనేది అధికారుల భావన. ఈ క్రమంలో నేడు (ఈనెల 22న) ఈవీఎంలను భద్రపర్చిన గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘రియల్‌ రిహార్సల్స్‌’ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈవీఎంలను తెప్పించిన అధికారులు పూర్తిగా లెక్కింపు రోజున ఎలా ఉంటుందో అదే విధంగా కార్యక్రమాన్ని నడిపించనున్నారు. ఈ సందర్భంగా ఎవైనా సమస్యలు వస్తే వాటిని అధిగమించి పూర్తిస్థాయిలో సిబ్బందిని లెక్కింపు కోసం సిద్ధం చేసే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

తొలి రెండు రౌండ్లే కాస్త ఆలస్యం
ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆతర్వాత ఈవీఎంలను టేబుళ్ల మీదకు తెచ్చి లెక్కించడం ప్రారంభిస్తారు. తొలి రెండు రౌండ్లు ఒక్కోటి పూర్తికావడానికి 25 నిమిషాల మేర సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మూడో రౌండ్‌ నుంచి ఒక్కో రౌండు 15 నిమిషాల్లో పూర్తవుతుంది. చివరన వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. ఒకవేళ ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పులకు మధ్య తేడా వస్తే వీవీప్యాట్‌ స్లిప్పులనే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకు ఇలా తేడా ఎక్కడా రాలేదని వారు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.