close

బుధవారం, జులై 24, 2019

ప్రధానాంశాలు

పీల్చి(తే) పిప్పిచేస్తుంది! 

ప్రమాదకర మార్కును దాటిన పీఎం 2.5 
నగర పరిస్థితి ఆందోళనకరం 
సీపీసీబీ తాజా లెక్కల్లో వెల్లడి 
ఈనాడు, హైదరాబాద్‌

గాలి పీల్చడమే ఆలస్యం నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) అక్కడే తిష్ఠ వేస్తాయి.. అత్యంత ప్రమాదకరమైన ఈ కాలుష్య ఉద్గారం.. లేనిపోని అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వీటి తీవ్రత నగరంలో నిర్దేశిత పరిమితుల కంటే 15 మైక్రోగ్రాములు ఎక్కువగా నమోదైనట్లు తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) లెక్క తేల్చింది. మూడేళ్లలో ఆందోళనకరంగా పెరిగినట్లు గుర్తించింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలోని నగరాలతో పోలిస్తే మన దగ్గరే అధికంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
ఎందుకు ప్రమాదకరం? 
నగరంపై విరుచుకుపడుతున్న సూక్ష్మ ధూళి కణాలతో(పీఎం 10) పోలిస్తే పీఎం 2.5 చాలా ప్రమాదకరం. గాలి పీల్చినప్పుడు ముక్కులోని వెంట్రుకలు పీఎం 10ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అదే పీఎం 2.5 తల వెంట్రుక మందంలో 20వ వంతు ఉంటుంది. కంటికి కనిపించదు. నేరుగా ఊపిరితిత్తుల్లోకి దూసుకెళ్లి అక్కడే స్థిరపడిపోతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు పలురకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. వృద్ధులు, చిన్నారులు, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. 

మన దగ్గర ఎలా ఉందంటే... 
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశిత పరిమితుల ప్రకారం వార్షిక సగటు ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములను మించరాదు. ఆ మార్కు దాటిన చోట అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది. ఘనపు మీటరు గాలిలో 40 మైక్రోగ్రాములను దాటకూడదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) చెబుతోంది. పీఎం 2.5 రోజురోజుకూ పెరుగుతుండటంతో సీపీసీబీ అప్రమత్తమై దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉందో తాజాగా అధ్యయనం చేపట్టింది. మూడేళ్ల వ్యవధిలో పెరిగిందా.. తగ్గిందా అంటూ ఆరా తీసింది. ఏ నగరాలు, పట్టణాల్లో నిర్దేశిత మార్కును దాటి నమోదవుతున్నాయో గుర్తించారు. హైదరాబాద్‌లో 55 ఎంజీలు నమోదైనట్లు తేల్చారు. బాలానగర్‌, ఉప్పల్‌, జూబ్లీహిల్స్‌, ప్యారడైజ్‌, చార్మినార్‌, జీడిమెట్ల, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, హెచ్‌సీయూ తదితర కీలక ప్రాంతాల్లో పీఎం 2.5 తీవ్రత ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

పెరుగుతూనే ఉంది.. 
కొన్నేళ్ల నుంచి పీఎం 2.5 తీవ్రత నగరంలో పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. 2016లో 49 ఎంజీలుండగా.. 2018కి వచ్చేసరికి 55కు చేరింది. అంటే మూడేళ్లలోనే 6 ఎంజీలు పెరిగిందన్న మాట. దక్షిణ భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడే పరిస్థితి ఆందోళనకరం. విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, విజయవాడ తదితర నగరాల్లో కంటే మన దగ్గరే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇప్పటికీ అప్రమత్తం కాకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.