మంగళవారం, డిసెంబర్ 10, 2019
ఫ్రీక్వెన్సీ సర్దుబాటుతోనే జాప్యం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మెట్రో రైళ్లలో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి... తరచూ ఆగిపోతున్న సర్వీసులు.... అంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం సాంకేతికలోపం కాదని తెలుస్తోంది. ట్విన్ సింగిల్ లేన్ విధానాన్ని వినియోగిస్తున్నందున రైళ్లు నెమ్మదిగా వెళ్తున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు కమ్యూనికేషన్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థ ద్వారా నడుస్తున్నాయి. నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు వేర్వేరు ఫ్రీక్వెన్సీల్లో రైళ్లను తిప్పుతున్నారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మార్గంలో ప్రస్తుతం ట్విన్సింగిల్ లేన్ విధానం ద్వారా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ సమయాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుత రైళ్లకు అదనంగా మరోదాన్ని నడిపేందుకు మెట్రో యాజమాన్యం అనుమతి ఇచ్చింది. ఈ మార్గంలో రివర్స్ ట్రాక్ లేదు. సింగిల్ లేన్ విధానం ద్వారా రైలు ట్రాక్ మారేందుకు కాస్త ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చే రైలును ఆపాల్సి వస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.5 దగ్గరే ఎక్కువగా రైలును ఆపుతుండటంతో ఈ తరహా వార్తలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు అత్యవసర మీటను నొక్కి రైలును నిలిపేస్తున్నారు..
ఎలాంటి సమస్యలూ లేవు: ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైలు ఎండీ
సమస్య గురించి తెలుసుకోకుండానే రైళ్లు ఆగిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సమస్యల గురించి పూర్తి స్థాయిలో విశ్లేషించాం. సాంకేతిక కారణాల వల్ల రైళ్లు ఆగుతున్నాయడంలో వాస్తవం లేదు. హైటెక్‌సిటీ-అమీర్‌పేట మార్గంలో రద్దీగా ఉండే సమయాల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అదనపు సర్వీసును నడుపుతున్నాం. హైటెక్‌సిటీలో రివర్స్ ట్రాక్ లేకపోవడమే రైళ్ల నిలుపుదలకు కారణం. రద్దీ సమయాల్లోనే ఆపాల్సి వస్తోంది.
తాజా వార్తలు
జిల్లా వార్తలు