close

ఆదివారం, జులై 21, 2019

ప్రధానాంశాలు

ఐటీ కారిడార్‌లో కొత్త కూడళ్లు 

మాదాపూర్‌ సీవోడీ...  మైండ్‌స్పేస్‌ సాఫ్ట్‌ సోల్‌ 
ట్రాఫిక్‌ జాంల విరుగుడుకు సరికొత్త ప్రణాళిక 
ఈనాడు, హైదరాబాద్‌

సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ జాంల విరుగుడుకు అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది. సాధారణ సమయాల్లోనే ఈ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం విపరీతంగా రద్దీ ఉంటోంది. దీనికితోడు మరో నాలుగు నెలలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ ఇక్కట్లు తీవ్రతరం కానున్నాయి. మూడు రోజుల్లో కురిసిన చిన్నపాటి వర్షాలకు ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రెండు రోజులపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ రహదారులపైనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షించాల్సి వచ్చింది. ఆదివారం గంట సేపు కురిసిన వర్షానికే ప్రధాన రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆరోజు ఐటీ సంస్థలకు సెలవు అయినా పరిస్థితి అధ్వానంగా మారింది. ఐటీ సంస్థల పని దినాల్లో వాన పడితే ట్రాఫిక్‌ ఇక్కట్లు చెప్పనలవి కావనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ జాంలకు చికిత్స చేసేలా ఉన్నతాధికారులు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే ఐటీ కారిడార్‌లో ప్రధాన రహదారులపై కొత్త కూడళ్లను తెరవాలని నిర్ణయించారు. 

రద్దీ ప్రాంతాల్లో తొలి విడతలో రెండు 
యూటర్న్‌ల మూసివేత క్రమంలో ఐటీ కారిడార్‌లోనూ అప్పట్లో పలు మార్పులు చేశారు. దీనికితోడు ఈ ప్రాంతంలో ఎస్‌ఆర్‌డీపీ, మెట్రోరైల్‌ నిర్మాణ పనుల నేపథ్యంలోనూ మార్పులు అనివార్యమయ్యాయి. 2016-17లో ఈ పనులను వేగిరం చేసేందుకు కొన్ని కూడళ్లను మూసివేశారు. మాదాపూర్‌ సెంటర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌(సీవోడీ), మైండ్‌స్పేస్‌ కూడలి సమీపంలోని సాఫ్ట్‌సోల్‌ ప్రాంతంలోని కూడళ్లు ఇలాగే మూతపడ్డాయి. తాజాగా వరద ముంపు వల్ల ఈ రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాంలు విపరీతంగా ఉంటుండటంతో ఈ కూడళ్లను తిరిగి తెరవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సైబర్‌ టవర్స్‌ నుంచి కావూరిహిల్స్‌ మార్గంలోని సీవోడీ దగ్గర ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం వరదనీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మైండ్‌స్పేస్‌ కూడలి నుంచి ఇనార్బిట్‌ మాల్‌ వెళ్లే మార్గంలో ఇరుకుదారి కారణంగా ట్రాఫిక్‌ జాం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు ప్రాంతాల్లో డివైడర్‌లను తొలగించి కూడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు. 
నాడు యూటర్న్‌లతో కూడళ్ల మూసివేత 
దాదాపు అయిదేళ్ల క్రితం హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లలో ట్రాఫిక్‌ పోలీసులు ‘యూటర్న్‌’ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రధాన కూడళ్లను పూర్తిగా మూసివేసి వాహనాల్ని మళ్లించే ప్రక్రియను తెరపైకి తెచ్చారు. ప్రధాన కూడలికి రెండువైపులా కొంత దూరంలో డివైడర్లను తొలగించి వాహనాలు వెళ్లే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రధాన కూడలిని మూసివేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో అలా చేశారు. తొలినాళ్లలో అది సత్ఫలితాలివ్వడంతో క్రమేపీ జంట నగరాల వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రధాన కూడళ్లను దాదాపుగా మూసివేసి యూటర్న్‌లను ఏర్పాటు చేశారు. యూటర్న్‌ల కారణంగా వాహనదారులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటివరకు ఆ యూటర్న్‌లను అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా ఐటీ కారిడార్‌ ప్రధాన రహదారులకు వరద ముంపు పొంచి ఉండటంతో ఉన్నతాధికారులు కొత్త కూడళ్ల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.