close

ఆదివారం, జులై 21, 2019

ప్రధానాంశాలు

రూ.1.6కోట్లకు కిడ్నీ కొంటాం..! 

అంతర్జాలంలో ఆఫ్రికన్‌ సైబర్‌ నేరస్థుల బురిడీ 
ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.21 లక్షలు స్వాహా 
ఎనిమిది నెలల పాటు సాగిన వసూళ్ల పరంపర 
ఈనాడు, హైదరాబాద్‌

సైబర్‌ నేరస్థుల బురిడీ దందా ఎల్లలు దాటుతోంది. ఇప్పటి వరకు ఈకామర్స్‌ వెబ్‌సైట్లలో తక్కువ ధరకే వాహనాలను అమ్ముతామని బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు.. చివరకు కిడ్నీ కొనుగోలు చేస్తామని ఆశపెట్టి దోచుకునే పన్నాగాలకూ తెర లేపుతున్నారు. అంతర్జాలంలో ఈ తరహా ప్రకటనలు ఉంచి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ తరహా మోసపు ఉదంతం రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల దృష్టికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్‌బీనగర్‌కి చెందిన ప్రైవేటు ఉద్యోగి (40) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వీటిని అధిగమించేందుకు కిడ్నీ అమ్మాలనే నిర్ణయానికి వచ్చాడు. కిడ్నీ మార్పిడిపై నిషేథం ఉండటంతో కిడ్నీ గ్రహీతల కోసం అంతర్జాలంలో వెతికాడు. గత ఏడాది సెప్టెంబరులో డా.వెస్లీ డేవిడ్‌ పేరుతో ఉన్న ప్రకటన చూశాడు. అందులో ఉన్న ఫోన్‌ నంబరుకు సంప్రదించాడు. ఆ తర్వాత డా.వెస్లీ డేవిడ్‌ పేరు చెబుతూ బాధితుడికి పలు దఫాలుగా పలువురు ఫోన్లు చేశారు. రూ.1.6కోట్లు వెచ్చించి కిడ్నీ కొనుగోలు చేస్తామని నమ్మించారు. బాధితుడి కిడ్నీ తమకు అత్యవసరం కావడంతో అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. భారీ ఆఫర్‌ ఇవ్వడంతో బాధితుడు వారి వలలో చిక్కుకుపోయాడు. 
8 నెలలు.. 27 బ్యాంకు ఖాతాలు.. 
అలా బాధితుడితో ఫోన్‌లో సైబర్‌ నేరస్థులు సంప్రదింపులు నెలల తరబడి కొనసాగాయి. డా.కర్రీ, డా.రవిభన్సాల్‌ పేరుతో మాట్లాడిన వ్యక్తులు ప్రాసెసింగ్‌ రుసుం పేరిట కొంత డబ్బు చెల్లించాలంటూ స్వాహాయనం మొదలుపెట్టారు. ఇదంతా తెరచాటు వ్యవహారం కావడంతో బాధితుడు ఎవరినీ సంప్రదించకుండానే నేరస్థులకు డబ్బులు చెల్లించడం మొదలుపెట్టాడు. సైబర్‌ నేరస్థులు సూచిస్తూ పోయిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయడం ఆరంభించాడు. అలా గత సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మే వరకు మొత్తం 27 బ్యాంకు ఖాతాలకు రూ.21 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత నేరస్థుల చరవాణులు స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు. 
ఉత్తరాది బ్యాంకు ఖాతాలకు బదిలీ 
బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఆఫ్రికన్‌ నేరగాళ్ల పనిగా గుర్తించారు. బాధితుడు నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలు ఉత్తరాది రాష్ట్రాలతోపాటు బెంగళూరులోనూ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కిడ్నీ అమ్మాలకున్న బాధితుడు.. అప్పు చేసి మరీ సైబర్‌ నేరస్థులకు సమర్పించడం విస్తుపోయే అంశంగా మారింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.