close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

గృహాలకు ధరాఘాతం

నత్తనడకన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం

అశ్వారావుపేట, న్యూస్‌టుడే

ములకలపల్లి మండలం తాళ్లపాయిలో అసంపూర్తిగా రెండు పడకగదుల ఇళ్లు

పూర్వ ఖమ్మం జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ధరాఘాతం తప్పడంలేదు. ఇళ్లు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకూ నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఆశావహులకు నిరీక్షణ తప్పడంలేదు. నిర్మాణ ఖర్చులు, ఇంటి సామగ్రి ధరల పెరుగుదలతో అధికారులు సౌకర్యాలకు కత్తెర వేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయి? లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? ప్రారంభోత్సవాలు ఎప్పుడు చేస్తారు? అంతుపట్టకుండా ఉంది. మొదటిదశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలే నేటి వరకూ పూర్తికాలేదు. ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. విద్యుత్తు, మంచినీటి పైప్‌లైను, రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు కోసం ఒక్కో ఇంటికి అదనంగా రూ.1.25 లక్షలు కేటాయించారు. తొలుత నిర్మాణాలు జోరుగానే సాగినా ఆ తరువాత ధరల పెరుగుదలతో నత్తనడకన సాగుతున్నాయి. నిధులు సరిపోక అడుగడుగునా అవరోధాలు తలెత్తుతున్నాయి. బిల్లులు రాక గుత్తేదారులు నిర్మాణాలపై అనాసక్తి చూపుతున్నారు.

జాప్యానికి కారణాలివీ..

పూర్తయిన నిర్మాణాల్లో భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 780, ఖమ్మం జిల్లాలో 837 ఇళ్లల్లో గృహ ప్రవేశాలు జరిగాయి. మొదటి దశలో నిర్మాణాలు దాదాపు పూర్తికావచ్చినా రెండో దశలోనే అత్యధికంగా నిలిచిపోయాయి. గుత్తేదారులను ధరాఘాతం ఇబ్బంది పెడుతోంది. ఏటికేడాది సగటున కేటాయించిన నిధులకు అదనంగా మరో 7-10శాతం లోపు నిధులు పెంచాల్సి ఉండగా రెండుసార్లు ఒకే రీతిలో సొమ్ములు కేటాయించారు.

నిధులు సరిపోక అశ్వారావుపేటలో నిర్మాణం మధ్యలోనే ఆగిన ఇళ్లు

గతంలో వ్యాట్‌ పన్ను 5 శాతం ఉండగా అది జీఎస్టీ పేరుతో 12 శాతానికి పెరిగింది. దీంతో దాదాపు రూ.35వేలు అదనపు భారం ఒక్క జీఎస్టీ రూపంలోనే పడుతోంది. గతంలో సిమెంటు కట్ట రూ.275 నుంచి రూ.300 ఉంటే నేడు రూ.350కి పెరిగింది. ఇనుము టన్నుకు రూ.5,000, ఇటుక వెయ్యికి రూ.500, ఇసుక రూ.1,800-2,500 వరకు పెరిగాయి. తాపీమేస్త్రీల ఖర్చులు అదనం. విద్యుత్తు, మరుగుదొడ్డి నిర్మాణ సామగ్రి ధరలు రెండింతలు పెరిగాయి. ఇన్ని విధాలుగా ధరలు పెరగడంతో గుత్తేదారులు తాము నిర్దేశిత స్థాయిలో పని చేయలేమంటూ చేతులెత్తేశారు.

ధరల పెరుగుదలతో ఇబ్బందులు

కోటిరెడ్డి, ఐటీడీఏ ఈఈ

ఇంటి నిర్మాణంలో అన్ని రకాల ధరలు, ఖర్చులు పెరిగాయి. జీఎస్టీ, సిమెంటు, ఇసుక, ఇనుము, తాపీ మేస్త్రీలకు ఇచ్చే వేతనం అన్నీ పెరిగాయి. ప్రస్తుతం ఇస్తున్న రూ. 5.04 లక్షలు సరిపోవడంలేదు. వాటికి అదనంగా మరో రూ.70వేలు, సౌకర్యాలకు మరికొంత అదనంగా ఇస్తే సరిపోతాయి. మౌలిక వసతుల కల్పనకూ నిధులు పెంచాలి. ధరల పెంపుదలపై ప్రభుత్వానికి లేఖలు రాశాం. ఎలాంటి ఆదేశాలు రాలేదు. త్వరలోనే నిధుల పెంచే అవకాశాలున్నాయి. నిధులు సరిపోకపోవడం వల్లే ఇంటికి రంగులు, మరుగుదొడ్డి, నీటి సౌకర్యానికి పైపులైను, వీధులు, వీధిలైట్ల కోసం స్తంభాలు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయడంలేదు. నిధులు పెంచితే అవి సమకూరుస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.