close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

అయ్యో! చిట్టి తండ్రి!

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే:  వివాహమైన అయిదేళ్ల తర్వాత లేకలేక పుట్టిన బిడ్డ.. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. మొన్న మొన్ననే తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే ఊహించని ఘటన.. పాత భవనం రూపంలో ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. పైకప్పు కూలి నిద్రలో ఉన్న బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి గాయపడింది. ఈ ఘటన ఆదివారం సికింద్రాబాద్‌ సర్కిల్‌ సీతాఫల్‌మండిలో చోటుచేసుకుంది. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ ఏసీ బాలగంగిరెడ్డి, కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం...సీతాఫల్‌మండికి చెందిన రాజు, స్వాతిలతోపాటు వారి కుమారుడు గీతాంశ్‌(14నెలలు), రాజు తల్లి పుష్పమ్మ, చిన్నాన్న రమేష్‌ ఓ పాత భవనంలో అద్దెకు ఉంటున్నారు. సమీపంలోనే సొంత ఇల్లు ఉన్నా వ్యక్తిగత కారణాలతో ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉన్నారు. శనివారం రాత్రి పుష్పమ్మ కుమార్తె ఇంటికి వెళ్లగా మిగతావారు నిద్రపోయారు. ఆదివారం ఉదయం 5 గంటలకే రాజు బయటకు వెళ్లగా, రమేష్‌ బాత్రూమ్‌లో ఉన్నాడు. ఒక్కసారిగా పైకప్పు కూలి నిద్రలో ఉన్న చిన్నారితోపాటు స్వాతిపై పడింది. స్వాతి గాయాలతోనే శిథిలాలను తోసుకుని లేచింది.. గీతాంశ్‌నూ తీసేసరికి అప్పటికే విగతజీవిగా మారిపోయాడు. స్వాతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రెండు నెలల క్రితమే వేడుకలు జరిపి..
రాజు, స్వాతిలకు 2013లో వివాహమైంది. ఏడాది క్రితం గీతాంశ్‌ జన్మించాడు. రెండునెలల క్రితమే మొదటి జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఇంతలోనే బాలుడు చనిపోవడం విషాదం నింపింది.  సికింద్రాబాద్‌ జడ్సీ సీఎన్‌ రఘుప్రసాద్‌, డీసీ రవికుమార్‌, స్థానిక కార్పొరేటర్లు సందర్శించారు. ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి మాట్లాడుతూ ఘటనపై కేసు నమోదు చేశామని.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు. డీసీ రవికుమార్‌ మాట్లాడుతూ పురాతన భవనాలను ఖాళీ చేయాలంటూ నోటీసులందజేస్తున్నా స్పందించడంలేదన్నారు. ఇప్పటికైనా యజమానులు స్పందించి ఖాళీ చేయాలన్నారు. సంఘటన జరిగిన ఇంట్లో అయిదు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని, వారందరిని ఖాళీ చేయించి కూల్చివేతలు చేపడతామన్నారు. జరిగిన ప్రాణనష్టం పూడ్చలేనిదని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.