పదోన్నతులు త్వరలో చేపడతాం - Kurnool - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ప్రధానాంశాలు

పదోన్నతులు త్వరలో చేపడతాం

బోధనేతర ఉద్యోగుల ఇబ్బందులు తొలగిస్తాం

● రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌

మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర ఉద్యోగుల పదోన్నతులు త్వరలో చేపడతామని, వీటితోపాటు న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో ఉన్నతవిద్య కమిషనర్‌, సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హామీ ఇచ్చారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సురేంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం రాయలసీమ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలోని సెనేట్‌హాలులో సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీలు సంజీవ్‌కుమార్‌, పోచా బ్రహ్మానందరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్సిటీలో సమస్యలు ఉన్నాయంటూ విద్యార్థులు ధర్నాలు చేయడం, రోడ్లపైకి రావడం దురదృష్టకరమని, అంతకుముందే అధికారులు వీటి పరిష్కారానికి కృషి చేస్తే ఇలాంటివి జరగవని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులకు ఇంతవరకు ఆరోగ్య కార్డులు ఇవ్వకపోవడం బాధాకరమని, వీరికి కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

 

ఇలాంటివి త్వరలో భర్తీ చేయాల్సి ఉందని, ఈ నియామకాల్లో విమర్శలకు తావివ్వకుండా పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. ప్రతి వర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లను నిబంధనల ప్రకారం నియమిస్తామని వెల్లడించారు. కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది విశ్వవిద్యాలయాల నుంచి రావాలని, ఇక్కడే మేధావులు పుట్టుకొస్తారన్నారు. వర్సిటీకి విద్యార్థులు, బోధన, బోధనేతర ఉద్యోగులే పునాదులని చెప్పారు. కిందిస్థాయి సిబ్బందిని అగౌరవపరుస్తున్నారంటూ రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి 20కిపైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఏవైనా సమస్యలతో వచ్చిన కిందిస్థాయి సిబ్బంది, విద్యార్థులతో సున్నితంగా మాట్లాడి వాటిని పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్వీయూ బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.కె.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బోధనేతర ఉద్యోగులకు మిగిలినవారి మాదిరిగానే ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని కోరారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలింగ్‌లో బోధనేతర సిబ్బందికి స్థానం కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బోధనేతర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాయకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా హాజరైన బోధనేతర ఉద్యోగులు వేదికపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి వరప్రసాద్‌రావు, రిజిస్ట్రార్‌ రమణారెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో తిలక్‌ విద్యాసాగర్‌, డీఈవో తహెరాసుల్తాన తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.