జలశక్తి.. ఎందుకు అనాసక్తి? - Kurnool - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

జలశక్తి.. ఎందుకు అనాసక్తి?

మందకొడిగా సాగుతున్న పనులు

 ● సెప్టెంబరు 15 తొలి విడత పూర్తి  

● ఇప్పటివరకు రూ.1.2 కోట్ల  వేతనాల చెల్లింపు

 ● ర్యాలీలతో సరిపెడుతున్న అధికారులు 

పెద్దవంగలిలో బావి పూడిక తీస్తున్న ఉపాధి కూలీలు

చాగలమర్రి, న్యూస్‌టుడే: రోజురోజుకీ నీటి ఎద్దడి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఏటా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, భూగర్భ జలాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం తలచింది. జల వనరులను సంరక్షించి, వాననీరు, ఇతర నీటి వనరులను ఒడిసి పట్టాలని కేంద్ర ప్రభుత్వం ‘జలశక్తి అభియాన్‌’ అనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జలశక్తి అభియాన్‌ పథకాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలో 64 బ్లాకులను గుర్తించింది. తొలి విడతగా జిల్లాలో చాగలమర్రి మండలాన్ని ఎంపిక చేసింది. పథకం అమలు చేసే దిశగా అధికారులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 50 రోజులు పూర్తయినా నేటికీ సగం పనులు కూడా పూర్తి కాలేదు. 398 పనులు గుర్తించగా 300 పనులను ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ పనీ పూర్తి కాలేదు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇలాగే కొనసాగితే లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. సెప్టెంబరు 15 లోపు మంజూరు చేసిన తొలిదశ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది. ఆ దిశగా జిల్లా అధికారులు అడుగులేస్తారో లేదో వేచి చూడాల్సిందే.

 

రెండు దశల్లో కార్యాచరణ: ఈనెల 1 నుంచి సెప్టెంబరు 15 వరకు తొలి దశ, అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు మలిదశ.

 

అయిదు అంశాలపై దృష్టి: 1. నీటి పరిరక్షణ 2. సంప్రదాయ జలవనరులు, కుంటలు, చెరువుల పునరుద్ధరణ. 3. పునర్వినియోగార్హమైన నిర్మాణాలు చేపట్టడం. 4. వాటర్‌షెడ్ల అభివృద్ధి 5. అటవీకరణ కార్యక్రమం

 

గుర్తించి, మంజూరు చేసిన పనులు: 398 ● అన్ని పనులకు కేటాయించిన నిధులు: రూ.11 కోట్లు ● ఉపాధి పథకానికి కేటాయించిన నిధులు: రూ.7 కోట్లు ● ఇంత వరకు ప్రారంభించిన పనులు: 300 ● ప్రారంభానికి నోచుకోని పనులు: 98 ● ఉపాధి కూలీలు పాల్గొన్న పనిదినాల సంఖ్య: 60 వేలు ● ఉపాధి కూలీలకు చెల్లించిన వేతనం: రూ.1.20 కోట్లు

 

అధికారుల పర్యటనలు..

జులై 1న ఉపాధి పీడీ వెంకటసుబ్బయ్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జులై 5న జిల్లా సర్వోన్నతాధికారి వీరపాండియన్‌, జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి సంజయ్‌రాయ్‌, కార్యదర్శి సుబ్బరాయన్‌ పర్యటించారు. కలెక్టర్‌ జులై 15న ఎమ్మెల్యేతో కలిసి మండలంలో పర్యటించారు. వీరితోపాటు కేంద్రం నుంచి వచ్చిన ఐఏఎస్‌ అధికారులు విశ్వనాథన్‌, తరుణ్‌మిశ్రాలు రెండు రోజుల పాటు మండల వ్యాప్తంగా పర్యటించారు.

 

ప్రారంభించిన పనులివే..: ఉపాధి పథకంలో 398 పనులను మంజూరు చేశారు. దీనికోసం రూ.7 కోట్లు నిధులు కేటాయించారు. ఇంకుడు గుంతలు 200 పనులు, ప్రభుత్వ భవనాల వర్షపు నీరు ఇంకింపజేసేందుకు(రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌) 40 పనులు, రహదారుల వెంట మొక్కల పెంపకానికి 10, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి 30, బావుల్లో పూడికతీతకు 10, పంట కుంటలకు 98 పనులు మంజూరు చేశారు. మొత్తం 300 పనులు ప్రాంభించామని అధికారులు లెక్కల్లో చెబుతున్నారు. 98 పనులు ప్రారంభం కాలేదు. క్షేత్రస్థాయిలో 200 పనులు పూర్తికాలేదు.

 

ప్రారంభానికి నోచుకోని అటవీకరణ పనులు..

జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలోని ప్రధానాంశాల్లో ఒకటి అటవీకరణ. అటవీకరణ కోసం రూ.28 లక్షలను కేటాయించారు. పల్లపు నీటిని ఇంకింపజేసేందుకు కుంటలు, అటవీ సమీపంలో ఒక మీటరు లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంతలను ఏర్పాటు చేయాలి. మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాలి. నేటికీ అటవీకరణకు సంబంధించి ఒక్క పనీ ప్రారంభం కాలేదు.

ఈ చిత్రంలో కన్పిస్తున్నది మండలంలోని శెట్టివీడు గ్రామం నుంచి సాగే ఎర్రవంక వాగు. ఈ వాగులో పూడిక తీత పనులకు రూ.2 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇప్పటిదాకా రూ.లక్ష మేర పనులు పూర్తి చేశారు. వర్షాలు రావడంతో వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.

గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తాం

- వెంకటసుబ్బయ్య, ఉపాధి పీడీ, కర్నూలు

సెప్టెంబరు 15లోపు మంజూరు చేసిన పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పది మంది ఏపీడీలు, ఐదుగురు ఏపీవోలు, ఇతర ఉపాధి సిబ్బందితో కలసి పనులను వేగవంతం చేశాం. 98 పనులు ప్రారంభించాల్సి ఉంది. వాటిని రెండ్రోజుల్లో ప్రారంభిస్తాం. గడువులోపు నిర్దేశించిన పనులు పూర్తి చేస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.