ఆలోచనకు పదును... ఆవిష్కరణకు అదును - Jagtial - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

ఆలోచనకు పదును... ఆవిష్కరణకు అదును

పాఠశాల విద్యార్థుల విజ్ఞాన పరిశోధనలకు ఆహ్వానం
వచ్చే నెలలో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణ
న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ

బాలలూ.. ఆలోచనలకు పదును పెట్టండి.. కొత్త ప్రాజెక్టుల దిశగా మేధో మధనం చేయండి.. పరిసరాల్లో ఏమైన సమస్యలున్నాయా.. వాటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారా.. వాటికి మీరు పరిష్కారం కనుగొనాలనిపిస్తుందా.. ఇంకేముంది. ఎలా పరిష్కరిస్తారో ఆలోచించండి.. బాల శాస్త్రవేత్తగా గుర్తింపు సాధించండి. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచనకు కార్యరూపం ఇవ్వండి.. మీ ఆవిష్కరణ గొప్పదైతే జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకునే అవకాశం సొంతమవుతుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో మీ ఆలోచనలు ఆవిష్కరించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కండి.

పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి వారిని వైజ్ఞానిక పరిశోధనలు, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌సీఎస్‌సీ) నిర్వహిస్తోంది. 27వ విడతలో భాగంగా సెప్టెంబరులో జిల్లా స్థాయి ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం నిర్వహణపై ఉమ్మడి జిల్లాలోని సైన్స్‌ ఉపాధ్యాయులకు శిక్షణ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బాల్యలంలోనే చిన్నపాటి పరిశోధనలు నిర్వహించడానికి ఎన్‌సీఎస్‌సీ వేదికగా నిలుస్తోంది. 1993లో ఎన్‌సీఎస్‌సీని జాతీయ శాస్త్ర, సాంకేతిక సమాచార మండలి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రాష్ట్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ లక్ష్యాలు
* నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారం కనుగొనడం.
* పరిసరాలపై అవగాహన పెంపొందించుకోవడం, కృత్యాధార విధానంలో బాలబాలికల్లో పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు నిర్వహించడం, వినూత్న అంశాలను ప్రాజెక్టు పనులు చేయడం ద్వారా ప్రోత్సహించడం.
* పాఠశాలల్లో, అలాగే బడిబయట ఉన్న 10 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే దీని ఉద్దేశ్యం.

స్వచ్ఛత.. హరితం
జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను ఏటా నిర్వహిస్తున్నా, రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రధాన అంశం, దాని ఉప అంశాలపై ప్రాజెక్టులు ఆహ్వానిస్తారు. ఈసారి ‘పరిశుభ్రత, హరితహారం, ఆరోగ్యకర దేశం’ అన్న నినాదంతో ‘శాస్త్ర, సాంకేతిక నూతన ఆవిష్కరణలు’ అన్న ప్రధాన అంశంపై ప్రాజెక్టులు పిలుస్తున్నారు. ఇందులో పలు ఉప అంశాలున్నాయి. అవి..
* ఆవరణ వ్యవస్థ-అది అందించే సేవలు
* ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం
* చెత్త నుంచి సంపద
* సమాజం, సంస్కృతి, జీవనోపాధులు
* సంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు

ప్రాజెక్టుల రూపకల్పన ఇలా..
పాఠశాలలోని ఇద్దరు బాలలు బృందంగా ఏర్పడి విజ్ఞానశాస్త్రం ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలో ఎంపిక చేసుకున్న ప్రాజెక్టుకు అనుగుణంగా స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించాలి. సర్వేల నిర్వహణ, కారణాల విశ్లేషణ, ప్రజల నుంచి ప్రశ్నావళి రూపంలో సమాధానాలు రాబట్టడం, సమస్యపై విమర్శనాత్మకంగా ఆలోచించి పరిష్కార మార్గాలపై క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఆయా అంశాలపై పరిశోధన చేసి, పరిశోధన పత్రాలు సమర్పించాలి. ప్రాజెక్టులు వినూత్నంగా, ఆచరణాత్మకంగా, సులభరీతిలో ఉండేలా చూసుకోవాలి. అన్వేషణలు నిత్య జీవిత సంఘటనల ఆధారితంగా ఉండాలి. శాస్త్రీయ విధానాల ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధించాలి. తద్వారా బాల శాస్త్రవేత్తలుగా ప్రేరణ పొంది భవిష్యత్తులో ప్రతిభతో రాణించే అవకాశం ఉంది.

డిసెంబరులో జాతీయ స్థాయి పోటీలు
జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో భాగంగా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రాజెక్టుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. సెప్టెంబరులో జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు, అనంతరం డిసెంబరులో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు.

విద్యార్థులను ప్రోత్సహించాలి: బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి
27వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు సిద్ధం కావాలి. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్టునైనా ప్రదర్శించేలా సైన్స్‌ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. సామాన్యశాస్త్ర ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో సృజనాత్మక ప్రాజెక్టులను రూపొందించేలా కృషి చేయాలి.

పట్టుదలకు నాంది: డేనియల్‌, రామగుండం మండల విద్యాధికారి
విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానం వైపు విద్యార్థులు ఆసక్తి పెంచుకునేలా, వారిని పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా కృషి చేసేలా బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ తీర్చిదిద్దుతుంది. ఈ ప్రాజెక్టుల తయారీ ద్వారా విద్యార్థుల్లో క్రమేణా ఆలోచన ధోరణి పెరుగుతుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల మొదలవుతుంది. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తుకు వేదికగా చేసుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.