close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

స్వచ్ఛ సాధకులు.. పర్యావరణహితులు

వ్యర్థాల సేకరణలో విద్యార్థుల భాగస్వామ్యం
ఇరుగు పొరుగుకు అవగాహన కల్పిస్తున్న చిన్నారులు
ఈనాడు, హైదరాబాద్‌

చిన్న వయసులో పర్యావరణహితులై కదిలారు.. వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ కదం తొక్కారు.. ఇరుగుపొరుగు వారినీ భాగస్వాములను చేశారు.. పచ్చదన పరిరక్షణకు తమవంతుగా తోడ్పాటునందించారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా కాగిత వ్యర్థాలు సేకరించి రీసైక్లింగ్‌కు అందించారు. చెట్లను నరకకుండా పునర్వినియోగమే మేలని చాటుతున్నారు. ఐటీసీ వావ్‌ కబ్స్‌, తెలంగాణ విద్యాశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా స్వచ్ఛవిద్యాలయ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా వ్యర్థాల సేకరణలో పాల్గొన్న కొందరు విద్యార్థులు, పాఠశాలల ప్రతినిధులను ‘ఈనాడు’ పలకరించగా వారి కృషి ఇలా ఉంది.

తడి, పొడి.. విడివడి..
తడి, పొడి చెత్త వేరు చేయడం.. ఏడాది తర్వాత నోటుపుస్తకాలు రీసైకిల్‌కు పంపించడం.. ఇలా వ్యర్థాల నిర్వహణలో కుత్బుల్లాపూర్‌లోని జగద్గిరినగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో వ్యర్థాలను పారవేసేందుకు రెండు బుట్టల విధానం అమలు చేస్తున్నారు. నీలం రంగులో బుట్టలో పొడి, పచ్చరంగు బుట్టలో తడి చెత్త వేస్తుంటారు. విద్యార్థులు కూడా తాము తెచ్చిన తినుబండారాల వ్యర్థాలను, మధ్యాహ్న భోజనం చేశాక మిగిలినవి బుట్టల్లోనే వేస్తారు. వీటిని కొంత కిచెన్‌ గార్డెన్‌కు వినియోగించడంతోపాటు మిగిలినవి గుడ్‌మార్నింగ్‌ సంస్థకు అప్పగిస్తుంటారు. విద్యాసంవత్సరం అయ్యాక విద్యార్థులందరూ వృథా నోటు పుస్తకాలు రీసైకిల్‌ చేసేందుకు తిరిగి ఇస్తారు. ‘విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసికట్టుగా ఉంటూ వ్యర్థాల నిర్వహణ ద్వారా స్వచ్ఛ విద్యాలయ సాధిస్తున్నాం. హెచ్‌ఎం భీమయ్య ఎంతో సహకరిస్తున్నారని బయోలజీ ఉపాధ్యాయురాలు శ్రీలత వివరించారు.

పాఠశాల స్థాయిలోనే..
విద్యార్థి దశలోనే వ్యర్థాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాల విద్యార్థులు పర్యావరణహిత కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. తమ ఇళ్లతోపాటు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి ఇళ్ల నుంచి గతేడాది 20,389 కిలోలు, ఈ ఏడాది 17,570 కిలోల వ్యర్థాలు సేకరించారు. రీసైకిల్‌ చేసే కార్యక్రమాన్ని చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. పీ-1 నుంచి పదోతరగతి వరకు విద్యార్థులందరూ చేస్తున్నారు. మా కాలనీల్లో ఉన్న ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. కోఆర్డినేటర్‌ రమ ఎంతో సహకారం అందించారు’ అని పాఠశాల విద్యార్థులు చెప్పారు.

జూనియర్స్‌ను చైతన్యవంతులను చేస్తూ..
పర్యావరణ పరిరక్షణపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని అంటున్నాడు కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివే ధ్రువ్‌ రాఠీ. పాత పుస్తకాలు, రాసిన పుస్తకాలు, పత్రికలు వంటి 1440 కిలోల వ్యర్థాలు సేకరించాడు. ‘ఇంట్లోనే కాదు బంధువులందరి దగ్గర్నుంచి తీసుకున్నా. పాఠశాలలో జూనియర్స్‌కు చెప్పి పర్యావరణహిత కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నా. నాకు తల్లిదండ్రులు సోనాల్‌ రాఠీ, అనిరుధ్‌రాఠీ మద్దతుగా నిలిచారు. ఇంట్లోని కాగిత వ్యర్థాలు పారవేయకుండా ఉంచేవారు.’ అని ధ్రువ్‌ చెప్పాడు.

ఇంటింటికి వెళ్లి.. అవగాహన కల్పించి..
‘మా అపార్టుమెంట్‌లో తడి, పొడి చెత్త వేర్వేరు చేసే విధానం గతంలో అంతగా లేదు. దీనిపై ప్రతి ఇంటికి వెళ్లి వివరించా. చుటుపక్కల ఇళ్లకు వెళ్లి వ్యర్థాలు సేకరిస్తున్నానని చెప్పి పారవేయవద్దని కోరా. అలా 1200 కిలోల వ్యర్థాలు సమీకరించా’ అని చెబుతోంది  ఇస్మితాదత్‌. బేగంపేటకు చెందిన ఈమె సికింద్రాబాద్‌ దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆరోతరగతి చదువుతోంది. తల్లిదండ్రులు అభిజిత్‌దత్‌, శృతి.

ఈ బాలుడు.. పర్యావరణ హితుడు
చిన్ననాటి నుంచే పర్యావరణంపై శ్రద్ధ కనబరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిరూపిస్తున్నాడు అదిత్‌ కందనూరి. హిమాయత్‌నగర్‌కు ఈ బాలుడు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్‌ పాఠశాలలో రెండోతరగతి చదువుతున్నాడు. తాను నివాసం ఉండే అపార్టుమెంట్‌లో రాసేసిన నోటు పుస్తకాలు, పత్రికలు, చిత్తు కాగితాలు పారవేయకుండా తనకు ఇవ్వాలని ఏడాది కిందట ప్రతి ఫ్లాట్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశాడు. అలా అందరి నుంచి 2,145 కేజీల వ్యర్థాలు సేకరించాడు. ‘పర్యావరణంపై మన బాధ్యత గురించి ఎప్పటికప్పుడు చెప్తుంటాం. టీవీలో వచ్చే కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటాడు’ అని తల్లిదండ్రులు తెలిపారు.

చెట్లన నరికితే.. అనర్థమని చాటుతూ..
ఆరు నెలల్లో 1500 కిలోల వ్యర్థాలు సేకరించింది జూబ్లీహిల్స్‌కు చెందిన ఇషా తబ్రేవాల్‌. ఓక్రిడ్జ్‌ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది ఈమె. ఐటీసీ తరఫున పోటీ జరుగుతోందని తెలిసి ఇంట్లో నాలుగు నెలలపాటు పొడి చెత్త పారవేయలేదు. అలాగే పరిశ్రమలకు వెళ్లి కాటన్‌ వేస్ట్‌ సేకరించింది. కాగిత వినియోగం పెరగడంతో చెట్లు నరికివేయాల్సి వస్తోంది. అదే రీసైకిల్‌ చేస్తే చెట్లను కాపాడవచ్చని చెబుతోంది. ‘వ్యర్థాల సేకరణ ఎంతో కీలకం. చిన్నతనం నుంచే పిల్లలకు దాన్ని అలవాటు చేయాలి’ అని ఇషా తల్లి శివాని వివరించారు.

బంధువులనూ ప్రోత్సహించాలి
మనమే కాదు.. ఇరుగుపొరుగున ఉన్నవారు వ్యర్థాల నిర్వహణలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. బంధువులను ఈ క్రతువులో పాలుపంచుకునేలా ప్రోత్సహించాలి. ఇందుకు చొరవ చూపాడు ఆరోతరగతి విద్యార్థి విక్టర్‌. ప్రస్తుతం దోమల్‌గూడలోని సెయింట్‌ థెరిసా స్కూల్‌లో ఆరోతరగతి చదుతున్నాడు. అలాగే ఇళ్లల్లో తడి, పొడి చెత్త వేరుగా ఉంచే విధానం గురించి వివరిస్తుంటాడు. తల్లిదండ్రులు, బంధువులకు చెప్పి కాగిత వ్యర్థాలు పారవేయకుండా 1400 కిలోలు సేకరించాడు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.