శుక్రవారం, డిసెంబర్ 13, 2019
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హన్మంత్‌షిండే చిత్రంలో జడ్పీ ఛైర్పర్సన్ శోభ
కామారెడ్డి జిల్లా పరిషత్, న్యూస్‌టుడే: వసతి గృహాల సమస్యలను పరిష్కరించాలని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దఫేదార్ శోభ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం సాంఘిక సంక్షేమంపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని పిట్లం, జుక్కల్‌లోని వసతి గృహాలు ప్రమాదకరంగా ఉన్నాయని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ కళాశాలల్లో ఖాళీలెందుకున్నాయని ప్రశ్నించారు. నిజాంసాగర్ జలాశయానికి ఏడాది కాలంలో కాళేశ్వరం నీరు వస్తున్నందున పర్యాటకంగా ప్రాజెక్టుతో పాటు కౌలాస్ కోటను అభివృద్ధి పరచాలన్నారు. మధ్యాహ్నం వ్యవసాయంపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ.. రైతులకు రాయితీపై వీడర్లను అందించేలా చూడాలని సభ్యులు కోరారు. బిందు సేద్యానికి డీడీలు చెల్లించినా యూనిట్లు ఇవ్వలేదని.. చివరికి కట్టిన డీడీలనే తిరిగిచ్చారని కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ మొయినొద్దీన్ ఆవేదన చెందారు. వైస్ ఛైర్మన్ ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. వచ్చే కోటాలో మంజూరుకు మొదటి ప్రాధాన్యం నివ్వాలని, బీబీపేటలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. లావాణి భూములను అటవీ భూములంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జిల్లా అధికారిణి వసంత చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని లీడ్‌బ్యాంక్ మేనేజర్‌కు విన్నవించారు. సమావేశాల్లో జడ్పీటీసీ సభ్యులు బత్తుల రమాదేవి, సలావత్ జన్నుభాయి, తాటిపాముల పద్మ, తిర్మల్‌గౌడ్, ఇన్‌ఛార్జి సీఈవో చందర్నాయక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వార్తలు