close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా

ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

లక్ష్మీపురం వద్ద బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్‌ బస్సు

కొణిజర్ల, న్యూస్‌టుడే: ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కొణిజర్ల మండలం లక్ష్మిపురం వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ప్రయాణికులతో భద్రాచలానికి వెళ్తుంది. లక్ష్మిపురం దాటగానే ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ వెనక భాగంలో కూర్చున్న దొడ్డి చిట్టిబాబు(62) అక్కడికక్కడే మృతిచెందగా కొత్తగూడేనికి చెందిన కొప్పిశెట్టి అరుణ, భద్రాచలానికి చెందిన రాయల సునిత, వీర్ల అంజమ్మ, వైష్ణవి, దుస్సా బాలనర్సయ్య, భారతిలకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 16 మంది వరకు ప్రయాణికులున్నారు. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ రామనుజానికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం కొంత సమయం అక్కడున్న డ్రైవర్‌ తర్వాత పరారయ్యాడు. క్షతగాత్రులను రెండు 108 వాహనాల ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు తెల్లవారుజామున బోల్తాపడగా స్థానికులు గుర్తించేసరికి సమయం పట్టింది. ఆ సమయంలో స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు అద్దాల నుంచి బయటకు వచ్చారు. కొంత సమయానికి స్థానికులు అక్కడకు చేరుకుని ప్రయాణికులను బయటకు తీసి సపర్యలు చేశారు. రహదారికి అడ్డుగా బస్సు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల ఎస్సై యల్లయ్య అక్కడకు చేరుకుని బస్సును జేసీబీతో పక్కకు నెట్టించారు. ఏసీపీ ప్రసన్నకుమార్‌ అక్కడకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఆపద సమయంలో సహకరించిన స్థానికులను అభినందించారు.


చిట్టిబాబు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

శుభకార్యానికి ముందు విషాదం

చర్ల మండలం తేగడకు చెందిన దొడ్డి చిట్టిబాబు చర్ల మండలం సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. నవంబరు 21న కుమారుడు గీయేశ్‌ వివాహం ఉండటంతో పెళ్లి దుస్తుల కోసం హైదరాబాద్‌ వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. గీయేశ్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తుండగా ఆ బస్సులోనే వచ్చిన అతడు ఖమ్మంలోనే దిగాడు. చిట్టిబాబుతో పాటు భార్య సత్యవతి, వారి బంధువులు దుస్సా బాలనర్సయ్య, భారతిలు ఉన్నారు. లక్ష్మీపురం వద్దకు రాగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడటంతో డ్రైవర్‌ వెనక సీటులో కూర్చొన్న చిట్టిబాబు తలకు బలమైన గాయమైంది. అతడిని స్థానికులు శ్రమించి బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. విషయం కుమారునికి సమాచారం అందించారు. తనతో రోజంతా పెళ్లి వేడుక దుస్తులు కొనుగోలు చేసి ఆనందంగా ఉన్న తండ్రి ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించాడు. శుభకార్యానికి ముందు ఇంటి పెద్ద మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహం వద్ద భార్య, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందరిని కలిచివేసింది.

అతివేగం.. మూలమలుపు

బస్సు ప్రమాదానికి అతివేగంతో పాటు మూలమలుపు కారణమైంది. పల్లిపాడు వద్ద టీతాగిన బస్సు డ్రైవర్‌ అక్కడ నుంచి వేగంగా నడపుతూ వెళ్తున్నాడు. లక్ష్మిపురం దాటగానే ప్రమాదకర మూలమలుపును అంచనా వేయలేదు. అప్పటికే బస్సు రహదారికి కిందకు దిగింది. ఈ లోపులో తేరుకుని రహదారిని ఎక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు అదుపుతప్పి రహదారికి అడ్డంగా బోల్తాపడింది. రహదారి పక్కనే పెద్ద కందకం ఉంది. అందులోకి జారిపోకుండా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదకర మూలమలుపు ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు సూచిక ఏర్పాటు చేయలేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.