మంగళవారం, డిసెంబర్ 10, 2019
కేయూలో సజావుగా సాగని డిగ్రీ విద్య
నేటి నుంచి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు
ఆలస్యంగా ఫలితాలు విడుదల
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే
కాకతీయ విశ్వవిద్యాలయంలో గత కొంతకాలంగా డిగ్రీ విద్య సజావుగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలన అస్తవ్యస్తంగా ఉందని కేయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయ అధికారుల నిర్లక్ష్యం, నిరంతర పర్యవేక్షణ లోపంతోపాటు వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పలు కళాశాలలు దీని పరిధిలో ఉన్నాయి. పూర్వ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 55 ఉండగా 32 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు.
సిలబస్‌పై స్పష్టత ఏదీ...
2016లో డిగ్రీ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో సెమిస్టర్ విధానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ సబ్జెక్టులు, వాటి సిలబస్‌లపై స్పష్టత ఇచ్చే నాథుడే కరవయ్యారు. ఉదాహరణకు బీకాం కోర్సుల్లో కంప్యూటర్ సబ్జెక్టు సిలబస్ గురించి కంప్యూటర్ సైన్స్ బోర్డు ఆఫ్ స్టడీస్‌ను సంప్రదిస్తే, కామర్స్ బోర్డు ఆఫ్ స్టడీస్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. తీరా కామర్స్ బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌ను సంప్రదిస్తే కంప్యూటర్ బోర్డు ఆఫ్ స్టడీస్‌ను అడగండని చెబుతారు. ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితిలో ఇటు విద్యార్థులు, అటు ప్రిన్సిపల్స్ ఉన్నారు. ఏ బోర్డు ఆఫ్ స్టడీస్ పరిధిలోకి రానటువంటి జనరల్ సబ్జక్టులు కొన్ని ఉన్నాయి. వాటి సిలబస్, అవి ఏ సెమిస్టర్లో ఉన్నాయో, ఏయే కోర్సులకు వర్తిస్తాయో తెలియక కళాశాలల నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానుండగా.. మరో 15 రోజుల్లో విశ్వవిద్యాలయ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఫలితాలు ప్రకటించటంలో జాప్యం...
సెమిస్టర్ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల విడుదల మొదలైన విషయాల్లో యూనివర్శిటీ అధికార యంత్రాంగం శాస్త్రీయంగా పనిచేయటం లేదనే ఆరోపణలున్నాయి. కళాశాలల యాజమాన్యాలు కూడా ఈ విషయంలో సంబంధిత అధికారులను ప్రశ్నించలేక పోతున్నాయి. ఫలితంగా కేయూలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019 మే 8న (రెండు, నాలుగు, ఆరు) సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు జూన్ 15 లోగా పూర్తయ్యాయి. కానీ ఆయా సెమిస్టర్ ఫలితాలు జులై 24న ప్రకటించారు. ఫలితాలు ప్రకటించటంలో తీవ్ర జాప్యం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల గడువు జులై 19తో ముగిసింది. కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవటంతో విద్యార్థులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం లేకుండా పోయింది. నవంబరు/డిసెంబరు నెలల్లో జరిపే మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ ఫలితాలు ఏప్రిల్‌లో(నాలుగు నెలల తర్వాత) ప్రకటిస్తున్నారు.
మార్కుల జాబితాల కోసం..
పరీక్షల విభాగం మార్కుల జాబితాలను మాత్రం కళాశాలలకు సకాలంలో పంపటంలో విఫలమవుతోంది. బీఏ, బీకాం కోర్సులకు సంబంధించిన రెండు, నాలుగో సెమిస్టర్ మార్కుల జాబితాలను ఇంత వరకు కళాశాలలకు పంపలేదు. బీఎస్సీ కోర్సుకు చెందిన రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల మార్కుల జాబితాలు ఇంకా అందలేదు. రెండు, నాలుగు సెమిస్టర్ల మార్కుల జాబితా ముద్రణలో కొన్ని తప్పులు దొర్లాయిని, అందుకే వాటిని కళాశాలలకు పంపలేదని తెలుస్తోంది. డిగ్రీ పూర్తి చేసి పీజీలో చేరేందుకు చాలా మంది విద్యార్థులు గత వారం వరకు వరంగల్‌లోని యూనివర్శిటీకే వెళ్లి తమ కన్సాలిడేటెడ్ మార్కుల జాబితాలను తెచ్చుకున్నారు. జులై చివరి వారంలో ఫలితాలు ప్రకటించగా, అక్టోబరు చివరి వారంలో కన్సాలిడేటెడ్ మెమోలు కళాశాలలకు అందాయి. ఆన్లైన్ వర్క్ అనుక్షణం టెన్షన్ కలిగిస్తుందని కళాశాలల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
అన్నీ చక్కదిద్దుతాం: వై.వెంకయ్య, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
సిలబస్‌లో ఎదురవుతున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం. డిగ్రీ తుది సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలను ఆయా కళాశాలలకు పంపుతున్నాం. అత్యవసరం ఉన్న వారు తమను సంప్రదిస్తే ఇక్కడ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆన్లైన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని వెంటనే అప్డేట్ చేస్తాం. ప్రాక్టికల్ పరీక్షల్లో ఉన్న ఇబ్బందులను కూడా సత్వరం పరిష్కరిస్తాం. ఇన్స్టంట్ పరీక్షల తేదీలకు సంబంధించి గత పరీక్షల సమయంలో కొంత ఆలస్యం జరిగింది. ఇక నుంచి ఎలాంటి జాప్యం లేకుండా చేస్తాం.
తాజా వార్తలు
జిల్లా వార్తలు