close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

సాగిపోదాం సాఫీగా..

జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమాకు!
ఉత్తర-దక్షిణ మొబిలిటీ కారిడార్‌ అభివృద్ధిపై దృష్టి
ఏఎఫ్‌డీ నిధులతో అధ్యయనానికి సిద్ధమైన జీహెచ్‌ఎంసీ
ఈనాడు, హైదరాబాద్‌:

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండు నుంచి చార్మినార్‌, ఫలక్‌నుమా ప్రాంతాలను కలుపుతూ రహదారి మార్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. ఉత్తర-దక్షిణ మొబిలిటీ కారిడార్‌ పేరుతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టుపై అధ్యయనానికి సిద్ధమైంది. రోడ్డు పొడవునా వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన తుది నివేదిక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుంది. జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రజా రవాణ వ్యవస్థను బలోపేతం చేయడం, రోడ్లకు ఇరువైపులా కాలిబాటలు, సైకిళ్లకు ప్రత్యేక మార్గం, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తేవడం ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. అందుకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనే నాలుగు ఏజెన్సీల ప్రతినిధులతో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం బుద్ధభవన్‌లో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని ఆరాతీశారు. పర్యాటక ప్రాంతాలను, చారిత్రాత్మక కట్టడాలను కలుపుతూ కారిడార్‌ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

ఇదీ ఒప్పందం..
మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ఫ్రెంచ్‌ దేశానికి చెందిన ఏఎఫ్‌డీ(ఏజెన్సీ ప్రాంఛైజి డెవలప్‌మెంట్‌) గతంలో రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. అందులో భాగంగా ఏఎఫ్‌డీ నాలుగు ఏజెన్సీల ద్వారా ఉత్తర-దక్షిణ మొబిలిటీ కారిడార్‌ అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేందుకు రంగంలోకి దిగింది. సూయిజ్‌ కన్సల్టెన్సీ, అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కార్పొరేషన్‌, బ్రూనో ఏజెన్సీ, ట్రాన్స్‌ సామో అనే నాలుగు సంస్థలు అందుకు సంబంధించిన పనులు చూడనున్నాయి. అందుకోసం ఏఎఫ్‌డీ రూ.2కోట్లు కేటాయించింది.

భూసేకరణతో అవసరం లేదు..
జేబీఎస్‌ నుంచి మొదలుపెడితే, రాష్ట్రపతి రోడ్డు, రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, చార్మినార్‌, ఫలక్‌నుమా ప్రాంతాలను కలుపుతూ ఉత్తర-దక్షిణ మొబిలిటీ కారిడార్‌ అభివృద్ధి కానుంది. పైవంతెనలు, అండర్‌పాస్‌ల వంటి హడావుడి ఉండదు. భూసేకరణతో అవసరం లేదు. ఉన్న రోడ్డును పునర్‌ వ్యవస్థీకరించడమే లక్ష్యం. అందుకోసం ప్రాంతాలవారీగా ప్రస్తుతమున్న రోడ్ల వెడల్పు, అక్కడి ట్రాఫిక్‌, అనుసంధానంగా ఉండే గల్లీ రోడ్లు, వాటి నుంచి వచ్చే వాహనాలు, ద్విచక్ర వాహనాల రద్దీ, ఇతరత్రా అంశాలను ఏజెన్సీలు అంచనా వేస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవాలను బేరీజు వేస్తారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా రోడ్లపై లేన్‌ మార్కింగ్‌ను ప్రతిపాదిస్తారు. దాంతోపాటు కాలిబాట వెడల్పును పెంచడం, సైకిళ్లకు ప్రత్యేక లైనును కేటాయించడం జరుగుతుంది. ప్రజారవాణాకు ఆటంకాలు లేకుండా బస్‌బేలను తీర్చిదిద్దడం, ఇతర రవాణ వ్యవస్థలను మెరుగుపరచడం అందులో భాగం. పార్కింగ్‌ కేంద్రాలు ఎక్కడెక్కడ, ఏస్థాయిలో అవసరమనే విషయాలనూ అధ్యయనంలో తెలుసుకుంటామని నిపుణులు చెబుతున్నారు. వారసత్వ, చారిత్రాత్మక కట్టడాలను కలుపుతూ రోడ్డు మార్గం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌, అధ్యయన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.