close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

పార్కులో పైవంతెన!

భూసేకరణ వ్యయంలో రూ.70 కోట్లు ఆదా, తప్పిన మలుపు ముప్పు
ఉద్యానవనం ఆదుకుందంటోన్న జీహెచ్‌ఎంసీ
ఎకరా స్థలంలో మొదలైన నిర్మాణ పనులు
ఈనాడు, హైదరాబాద్‌

ఏడాదిగా అయోమయంలో పడిన జూబ్లీహిల్స్‌ రోడ్డు నం-45 పైవంతెన పనులకు ఆ ప్రాంతంలోని ఓ ఉద్యానవనం చక్కని పరిష్కారం చూపింది. భారంగా మారిన భూసేకరణ వ్యయం రూ.70కోట్ల మేర తగ్గింది. ప్రమాదకర మలుపు లేకుండా పైవంతెన నిర్మాణం సాఫీగా సాగిపోయే వెసులుబాటు దొరికింది. నిర్మాణానికి గల సాంకేతిక సమస్యలు సైతం తొలగిపోయాయి. అందుకు సంబంధించి బల్దియా ప్రణాళిక విభాగం పార్కుకు చెందిన ఎకరా స్థలాన్ని సేకరించింది. రోడ్డు పొడవునా ఆస్తుల సేకరణను దాదాపు పూర్తి చేసింది. క్లిష్టమైన సమస్యలు కొలిక్కిరావడంతో త్వరలో పనులు పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్సార్డీపీ) మూడో దశలో జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం-45 ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం ప్రధానమైంది. మధ్య నగరాన్ని హైటెక్‌సిటీతో అనుసంధానం చేసే భారీ పైవంతెన ఇది. పంజాగుట్ట కూడలి, కేబీఆర్‌పార్కు, జూబ్లీ చెక్‌పోస్టు కూడళ్లను దాటుకుని మైండ్‌స్పేస్‌ కూడలి వైపు వెళ్లాల్సిన వాహనాలకు ఇది ఉపయోగకరం. ఈ నిర్మాణం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఐదు నిమిషాలకుపైగా ఆదా అవుతుంది. రోడ్డు నం-45లోని దివంగత చిత్ర కథానాయకుడు శ్రీహరి ఇంటి ముందు మొదలయ్యే ఎలివేటెడ్‌ కారిడార్‌.. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెనుకవైపు నుంచి దుర్గం చెరువుపై నిర్మాణమవుతున్న తీగల వంతెన దగ్గర ముగుస్తుంది. అంటే.. తీగల వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు తప్పనిసరిగా రోడ్డు నెం-45 పైవంతెన ద్వారానే ప్రయాణించాలి. శ్రీహరి ఇంటి నుంచి అంబేడ్కర్‌ యూనివర్సిటీ వరకు పలువురు ఇళ్ల యజమానులు భూసేకరణకు అంగీకరించకపోవడంతో నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. సెప్టెంబర్‌-2019కు పూర్తికావాల్సిన పనులు అంతంతమాత్రంగా ఉన్నాయి.

ఊపిరిపోసిన ఉద్యానవనం..
ఇరువైపులా రాకపోకలుండే నాలుగులైన్ల భారీ పైవంతెన నిర్మాణ వ్యయం రూ.150 కోట్లు. అందులో మూడొంతులకుపైగా నిధులు భూసేకరణకు ఉద్దేశించినవే. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన బల్దియాకు ఆమేరకు వెచ్చించడం కష్టంగా మారింది. దాంతో ప్రణాళిక విభాగం టీడీఆర్‌(అభివృద్ధి బదలాయింపు హక్కు) అస్త్రాన్ని ఉపయోగించింది. డబ్బు బదులు టీడీఆర్‌ ఇస్తామని యజమానులను ఒప్పించే ప్రయత్నం చేసింది. మొత్తం 21 మంది యజమానుల్లో కేవలం నలుగురు మాత్రమే అందుకు ఒప్పుకున్నారు. మరో ముగ్గురు ఇంటి నిర్మాణ అనుమతి తీసుకుని, రోడ్డు కోసం స్థలం ఇచ్చారు. తొమ్మిది మందికి పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించేందుకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. ఇప్పటికీ భూసేకరణకు అంగీకరించని ఇద్దరు యజమానులతో బల్దియా చర్చలు జరుపుతోంది. ఇక పార్కు విషయానికొస్తే ఉద్యానవనం ఉన్న ప్రాంతంలో మూల మలుపు ఉంటుంది. 80 అడుగుల రోడ్డు వెడల్పుతో ఉన్న పాత ఆర్‌డీపీ(రోడ్డు అభివృద్ధి ప్రణాళిక) ప్రకారం అక్కడ నాలుగు లైన్ల పైవంతెన నిర్మిస్తే మూడు ఆస్తులను పెద్దమొత్తంలో సేకరించాల్సి వస్తుంది. అయినప్పటికీ మలుపు తొలగిపోదు. పరిస్థితిని చక్కదిద్దుతూ.. 120 అడుగుల రోడ్డు వెడల్పుతో 2018లో కొత్త ఆర్డీపీ వచ్చింది. అందులో కొంతమేర పార్కు స్థలం రోడ్డులో కలిసిపోయింది. దాన్ని అనుసరించి బల్దియా ఇంజినీర్లు పైవంతెన డిజైన్‌ను సవరించినట్లు సమాచారం. విద్యుత్తు ఉపకేంద్రం నుంచి శ్రీహరి ఇంటి వరకు పది పిల్లర్ల దిశ మారిందని, మూల మలుపు నుంచి విముక్తి లభించిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే రోడ్డుకు, పైవంతెనకు మధ్య ఎత్తు పెరగనుందని తెలిపారు. స్థానికుల అభ్యర్థనతో ప్రస్తుతం 100 అడుగుల రోడ్డు వెడల్పు ప్రాతిపదికన భూసేకరణ చేపడుతున్నామని ప్రణాళిక విభాగం తెలిపింది. భూసేకరణకు అంగీకరించిన ఇళ్ల కూల్చివేత మొదలైందని, ఆరు నెలల్లో వంతెన అందుబాటులోకి వచ్చేలా లక్ష్యం పెట్టుకున్నామని ఇంజినీర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.