close

బుధవారం, మార్చి 20, 2019

ప్రధానాంశాలు

దారిమళ్లిన గొర్రెలు 

క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం 
సరిదిద్దితేనే నెరవేరనున్న పథక లక్ష్యం 
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

కులవృత్తులకు ప్రాణం పోసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల అభివృద్ధి పథకం కింద మొదటి విడతలో అత్యధిక మంది లబ్ధిదారులకు జీవాలను పంపిణీ చేసి రాష్ట్రంలోనే ఉభయ జిల్లాల అధికారులు రికార్డు సృష్టించారు. ప్రస్తుతం రెండో విడత పంపిణీ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు కొనుగోలు చేసి అందించనున్నారు. 
మాచారెడ్డి మండలంలో మొదటి విడతలో లబ్ధిదారులకు రాయితీ గొర్రెలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇందులో 90 శాతం మంది గొర్రెలు విక్రయించుకొన్నారు. జుక్కల్‌ మండలంలో ఎనభై శాతం మంది లబ్ధిదారులు ఇలాగే చేశారు. ఉభయ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వృత్తినే నమ్ముకొన్న వారు మాత్రమే ప్రభుత్వం అందించిన గొర్రెలను పెంచుకొంటున్నారు. 
గొల్ల కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి పరచడంతో పాటు మాంసం కోసం ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని రాయితీ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికారు. ఉభయ జిల్లాల్లో ఇందుకు మొదటి విడతలో రూ.222 కోట్లు వెచ్చించారు. పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం తదితర ప్రాంతాల నుంచి జీవాలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాటిపై పర్యవేక్షణ మరిచారు. దీంతో రాయితీ గొర్రెలు పక్కదారి పడుతున్నాయి. 
నిబంధనలు తుంగలో తొక్కి.. 
కొనుగోలు చేసిన ప్రతి గొర్రెకు బీమా చేయించాలి. వాటిని ఏడాది పాటు విక్రయించకుండా చూడాలి. ప్రతినెల లబ్ధిదారుల వద్దకు వెళ్లి జీవాలను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాలి. వాటికి పుట్టే పిల్లల సంఖ్యను నమోదు చేయాలి. కానీ ఇదంతా క్షేత్రస్థాయి అధికారులు కాగితాల్లో అంకెల్లో ఉన్నతాధికారులకు చూపిస్తున్నారు. ఒక్కరో.. ఇద్దరో లబ్ధిదారులను ఉదాహరణగా చూపి పథకం పూర్తిగా విజయవంతం అయిందని ప్రకటనలు ఇస్తున్నారు. 
బాధ్యత విస్మరించారు.. 
లబ్ధిదారులకు అందించిన రాయితీ గొర్రెలను ఏడాది వరకు విక్రయించకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ అధికారుల మీదనే మోపింది. రెవెన్యూ, మార్కెటింగ్‌, రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రత్యేకంగా విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటుచేసి నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ఆ దిశగా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు కనపడటం లేదు. దీంతో గొల్ల, కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరకుండా పోతోంది. 
అంతా వారే.. 
ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అధికారులు మొదటి విడతలో ఆదరాబాదరాగా రాయితీ గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేసి చేతులు దులుపేసుకొన్నారు. పథకం ప్రారంభంలో శ్రద్ధ వహించిన ఉన్నతాధికారులు రానురాను మండల పశువైద్యాధికారులకే గొర్రెల కొనుగోలును వదిలేశారు. 
ఏం చేశారు.. 
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే లబ్ధిదారుల ఇంటికి చేరకముందే గొర్రెలు చేతులు మారాయి. ఇంకా కొన్నిచోట్ల అసలు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించగానే చెక్‌పోస్టులను దాటుకొని మళ్లీ వాటి సొంత రాష్ట్రాలకే చేరుకున్నాయి. ఈ అక్రమాల తంతులో మండల పశువైద్యాధికారులే క్రియాశీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలున్నాయి. 
అక్రమాల పరంపర.. 
గొర్రెల కొనుగోలుకు వెళ్లిన అధికారులు అటు అమ్మకం దారులతో ఒప్పందం కుదుర్చుకొని తక్కువ ధర పలికే గొర్రెలకు ఎక్కువ ధర నిర్ణయించడం..ఒక యూనిట్‌లో నాలుగు చిన్న పిల్లలను వేసి పెద్దవాటికి సమానంగా ధర నిర్ణయించడం వంటివి చేయడంతో లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు గతంలో వెలుగు చూశాయి. లబ్ధిదారుని ఇష్టానుసారమే నడుచుకొన్నామని అధికారులు చెబుతున్నా.. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు కొనుగోలుదారుతో మాట్లాడేందుకు భాష పరమైన సమస్యలు తలెత్తడంతో అంతా అధికారులు చెప్పినట్టే నడుచుకోవాల్సి వచ్చిందని లబ్ధిదారులు వాపోయిన ఘటనలు ఉన్నాయి. 
ప్రణాళికాయుతంగా అమలు చేస్తేనే.. 
నాణ్యమైన గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తేనే లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది. కులవృత్తిని నమ్ముకొన్నవారికే వాటిని ఇవ్వాలి. మొదటి విడతలో గొర్రెల కొనుగోలు సందర్భంగా తలెత్తిన తప్పిదాలు రెండో విడతలో పునరావృతం కాకుండా చేస్తేనే పథకం విజయవంతం అవుతుంది. ఈ దిశగా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.