close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

సాగులోతలోదారి

●● పోచారం ప్రాజెక్టు నీటి సరఫరాపై గందరగోళం

●●● బీ జోన్‌కే సరఫరా చేస్తామంటున్న అధికారులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

యాసంగిలో పోచారం జలాశయం నుంచి ఆయకట్టుకు నీటి విడుదలపై అయోమయం నెలకొంది. ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఈ నెల 13న జరిగిన నీటిపారుదల సలహా సంఘం సమావేశంలో జలాశయం బీ జోన్‌ పరిధిలోని ఆయకట్టుకు మాత్రమే నీటిని సరఫరా చేయాలని సాగునీటి పారుదలశాఖ అధికారులు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు మాత్రం సమృద్ధిగా నీరు ఉన్నందున రెండు జోన్లకూ నీటిని విడుదల చేయిస్తామని రైతులకు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ప్రకటనలు చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

నిండుకుండలా జలాశయం

ఖరీఫ్‌ సీజన్‌ చివర్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలాశయం నిండుకుండలా ఉంది. ఈ నేపథ్యంలో రెండు జోన్లకూ నీటిని సరఫరా చేస్తారనే నమ్మకంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ప్రాజెక్టు కింది మొదటి ఆయకట్టును ఏ జోన్‌గా, రెండో ఆయకట్టును బీ జోన్‌గా పరిగణిస్తున్నారు. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న వంతుల వారీ పద్ధతిలో భాగంగా ప్రస్తుతం బీ జోన్‌కు నీటిని సరఫరా చేస్తామని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఏ జోన్‌ పరిధిలో పూర్తి స్థాయిలో పంటల సాగు చేపట్టలేదు. ప్రస్తుతం పంటల వేయవద్దంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగుకు సమాయత్తం

జలాశయం పరిధిలోని ఆయకట్టులో వరికోతలు పూర్తికావస్తుండటంతో రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఏ జోన్‌ పరిధిలోని పోచారం, మాల్తుమ్మెద గ్రామాల్లో నారుపోశారు. రెండు పంటలు పండి తమ అప్పులు తీరుతాయని ఆశతో సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలపై నీటిపారుదలశాఖ అధికారులు కేవలం బీ జోన్‌కు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ప్రకటించడం వారి ఆశలపై నీరు పోసినట్లువుతోంది.

వృథా అరికడితే

ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు వృథా కాకుండా వినియోగిస్తే రెండు ఆయకట్లకూ నీరందించవచ్చని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా డిస్ట్రిబ్యూటరీల వారీగా నీటిని విడుదల చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రాజెక్టు పరిధిలో ఏళ్లుగా సిబ్బంది కొరత

ప్రాజెక్టు జలాలు చివరి రైతు పొలం వరకు అందాలంటే క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించేది లస్కర్లు. ఈ పోస్టుల్లో ఉద్యోగులు పదవీ విరమణే తప్ప కొత్త నియామకాలు కనిపించట్లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 1500 ఎకరాలకు ఒక లస్కరు ఉండాలి. ప్రధాన కాలువపై ప్రతి ఆరు కి.మీ. ఒకరు అందుబాటులో ఉండి పర్యవేక్షణ చేయాలి. రెగ్యులేటర్లు ఉంటే ఇద్దరు చొప్పున విధులు నిర్వహించాలి. ప్రతి అయిదుగురు లస్కర్లకు ఒక వర్క్‌ఇన్‌స్పెక్టరు ఉండాలి. ఈ నిబంధన ప్రకారం పోచారం ప్రాజెక్టు కింద ఉన్న 13 కాలువల్లో ఏ ఒక్కదానిపైనా సిబ్బంది లేరంటే అతిశయోక్తి కాదు. ఇంజినీరింగ్‌ అధికారులు సరిపడా ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే ముఖ్యమైన సిబ్బంది కొరత కాలువల పరిధిలో పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. పోచారం ప్రాజెక్టు పరిధిలో మేజర్‌, మైనర్‌ కాలువల తవ్వకాలు జరిగినప్పుడు తప్ప లస్కర్లను ఇప్పటి వరకు కొత్తగా నియమించలేదు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లకు సంబంధించి కూడా 2004 నుంచి ఇంత వరకు నియామకాలు చేపట్టలేదు. ఫలితంగా నీటి కోసం అన్నదాతలు రాత్రి సమయాల్లో నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. చివరి ఆయకట్టుకు నీరందాలంటే సాగునీటి నిర్వహణ ప్రతి దశలో పక్కాగా ఉండాలి.


జలాశయం నీటి నిల్వ సామర్థ్యం: 1.82 టీఎంసీలు

ప్రస్తుతం : 1.81 టీఎంసీలు


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.