close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ఫిర్యాదులపై ఉన్నత విద్యామండలి కమిటీ ఏర్పాటు

వర్సిటీలో దస్త్రాలను పరిశీలించిన సభ్యులు

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆచార్య యు.ఉమేశ్‌ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిటీ వేసింది. ఇందులో కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య జగన్నాథ స్వామి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ వెంకటయ్యను సభ్యులుగా నియమించింది. శాతవాహన విశ్వవిద్యాలయం టీచర్స్‌ అసోసియేషన్‌, విద్యార్థి సంఘాలు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ గవర్నర్‌, ప్రభుత్వానికి పలు ఆరోపణలతో మాజీ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదు చేశాయి. దీంతో ప్రభుత్వం కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం వర్సిటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫిర్యాదులకు సంబంధించి అంశాల దస్త్రాలను నిశితంగా సమీక్షించారు. ఇష్టారాజ్యంగా నిధుల దుర్వినియోగం, బోధనేతర సిబ్బంది సర్వీసు నిబంధనలకు భిన్నంగా క్రమబద్ధీకరణ, సెక్యూరిటీ సిబ్బంది నియామకం, అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం వంటి వాటితో పాటు ఇతర ప్రగతి పనుల్లో ఆర్థిక అవకతవకలు, ప్రజాధన దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్‌ పదవిలో కొనసాగడం వంటి అంశాలపై ఫిర్యాదులు అందాయి. లీన్‌ సెలవులను అధిగమించి అసాధారణ(ఈవోఎల్‌) సెలవుల్లో రిజిస్ట్రార్‌గా కొనసాగారనేది ప్రధాన ఆరోపణ. ఆగస్టు 30, 2019 వరకు ఓయూ లీన్‌ సెలవులు ముగిశాయని పేర్కొంటూ ప్రొఫెసర్‌ విధుల్లో చేరాలని జనవరి 7న ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ రిజిస్ట్రార్‌గానే ఆయన విధులు నిర్వహించారని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. వర్సిటీ పరిపాలనకు ఆయన మొగ్గు చూపుతున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ప్రతి ఒక ఆరోపణకు సంబంధించిన వివరాలను సేకరించి నివేదిక రూపకల్పన చేసేందుకు కమిటీ సభ్యులు దస్త్రాల పరిశీలనతో పాటు వర్సిటీలోని రిజిస్ట్రార్‌ ఆచార్య టి.భరత్‌తో పాటు పలు విభాగాల అధికారులు, సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా లీన్‌ సెలవు ఎప్పటి వరకు ఉంది అనే విషయం ఓయూ నుంచి తెలుసుకుని నివేదికలో పేర్కొంటామని తెలిపారు. వర్క్స్‌, ఫైనాన్స్‌, ఎగ్జిక్యూటీవ్‌ కమిటీల ఆమోదం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.