close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

‘పెద్దపట్నం’లో భక్తుల శివతాండవం

చేర్యాల, న్యూస్‌టుడే: పరమశివుడి ప్రతిరూపమైన మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి ఆలయం మార్మోగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం తెల్లవారుజామున కొమురవెల్లి ఆలయం వద్ద ‘పెద్దపట్నం’ కార్యక్రమం కనులపండువగా జరిగింది. స్వామిని స్తుతిస్తూ వేలాది భక్తులు వేడుకను తిలకిస్తూ మహాశివరాత్రి రోజున జాగరణ చేశారు. మహోత్తరమైన ఘట్టానికి సుమారు 40వేల మంది హాజరైనట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ప్రత్యేక పూజా కార్యక్రమాలతో..

అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవకాలం అనంతరం వేద పండితులు, అర్చకులు గర్భగుడిలో అర్చకులు పడిగన్నగారి మల్లయ్య దంపతుల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం పల్లకీ సేవ చేపట్టారు. ఆ తర్వాత పెద్దపట్నం వేయడానికి పూజలు సాగించారు. శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఒగ్గు పూజారులు స్వామికి పట్టు వస్త్రాలు, బియ్యం సమర్పించారు. 1.30 గంటలకు గంగతెప్ప నిర్వహించారు. కోనేరులోని గంగ నీరు తీసుకొచ్చి పూజలు చేశారు. 1.45 గంటలకు బియ్యం సంకు పోయడం, 1.55 గంటలకు మైలపోలు తీశారు. మరోవైపు కల్యాణ మండపం వద్ద ఒగ్గు పూజారులు స్వామి చరిత్రను చెబుతూ ‘మల్లన్న’ను స్తుతించారు. ‘పెద్దపట్నం’ (ముగ్గుపోయడం) శనివారం తెల్లవారుజామున 3.55 గంటలకు పూర్తయింది. 4 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నంపైకి అర్చకులు తీసుకొచ్చి పూజలు చేశారు. అప్పటికే పూనకాలతో ఊగిపోతూ ‘మల్లన్న’ నామస్మరణ చేస్తున్న భక్తులు పట్నంపైకి దూసుకొచ్చి శివతాండవం ఆడారు. చూర్ణాన్ని తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు. అనంతరం ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నపూజ నిర్వహించారు. మూలవిరాట్‌ ఎదుట ఉన్న శివలింగాన్ని అన్నంతో అలంకరించారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఆలయంలో నిర్వహించే రుద్రాభిషేకం కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. కరీంనగర్‌ జిల్లా న్యాయమూర్తి అనుపమ కుటుంబ సభ్యులతో శనివారం ఆలయాన్ని సందర్శించారు. పెద్దపట్నం కార్యక్రమంలో ఆలయ ఈవో టి.వెంకటేశ్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ఏఈవోలు రావుల సుదర్శన్‌, గంగ శ్రీనివాస్‌, పునరుద్ధరణ కమిటీ ప్రతినిధులు మేక సంతోశ్‌, ముత్యం నర్సింహులు, ఉత్కం అమర్‌, నాగిరెడ్డి, మల్లయ్య, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫలించిన పోలీసుల వ్యూహం

ఏసీపీ సందెపోగు మహేందర్‌ నేతృత్వంలో సీఐ రఘు ఆధ్వర్యంలో పెద్దపట్నం కార్యక్రమానికి సంబంధించి పక్కా ప్రణాళిక రూపొందించారు. పట్నంపైకి ఒక్కసారిగా భక్తులు దూసుకురాకుండా అడ్డుకున్నారు. పట్నం నిర్వహించే నాలుగువైపులా సుమారు 15 అడుగుల ఎత్తులో జాలీలు పకడ్బందీగా నిర్మించారు. ఎదురుగా ఒక్కరినీ రాకుండా నియంత్రించారు. పట్నం పైకి రావడానికి ఒకే దారి ఏర్పాటు చేసి పాతిక మంది చొప్పున వదులుతూ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఏసీపీలు, 11 మంది సీఐలు, 17 ఎస్సైలతో పాటు 250 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

* పెద్దపట్నం వేసేటప్పుడు మధ్యలో నిమ్మకాయ పెట్టడం ఆనవాయితీ. దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో మంది ఆరాట పడుతుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు అర్చకులకు అడ్డుగా పట్నంపైకి వేగంగా దూసుకొచ్చాడు. దీంతో పోలీసులు అతడిని అడ్డు తొలగించడంతో పాటు పక్కకు లాక్కెళ్లిన పోలీసులు చితకబాదారు. ఈ క్రమంలో ఆ గుంపులో పట్నం దాటుతున్న ఆలయ కమిటీ సభ్యుడు నాగిరెడ్డిపై అనుకోకుండా లాఠీ దెబ్బ పడింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.