శుక్రవారం, డిసెంబర్ 13, 2019
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జాతీయ కన్వీనర్ అనీశ్
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: దేశంలో నేటికీ లింగ వివక్షత కొనసాగుతుందని, దాన్ని రూపుమాపాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ అనీశ్ అన్నారు. బాగ్లింగంపల్లి పాలమూరు బస్తీలోని ఓంకార్ భవన్ కేంద్ర కార్యాలయంలో ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర ద్వితీయ మహాసభలు రెండో రోజు కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ లింగ వివక్షతను రూపుమాపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దీంతో నానాటికీ మహిళల జనాభా నిష్పత్తి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళలకు సమాన వాటాను కల్పించాలన్నారు. తెలంగాణలో మహిళా సంక్షేమం కుంటుపడిందన్నారు. ఈ నెలాఖరున నగరంలో సమాఖ్య జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య మాట్లాడుతూ రాష్ట్రంలో దశలవారిగా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రతినిధులు కె.రాధక్క, పుష్పలత, సీహెచ్ లీల, పుష్ప, జ్యోతి, విమల, లావణ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు