close

గురువారం, ఆగస్టు 22, 2019

తాజా వార్తలు

దోపిడీ దొంగల బీభత్సం

కర్నూలు శివారులో వరుస ఘటనలు

● ఆర్మీ జవాన్‌, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి  దంపతులపై దాడి 

బంగారు, డబ్బుతో పరారు


దొంగల దాడిలో గాయపడిన మోహన్‌కృష్ణ

 

కర్నూలు నేరవార్తలు, న్యూస్‌టుడే : కర్నూలు నగర శివారు కాలనీల్లో దోపిడీ దొంగలు మంగళవారం తెల్లవారు జామున బీభత్సం సృష్టించారు. మూకుమ్మడిగా మూడిళ్లలో చొరబడ్డారు. నిద్రిస్తున్న వారిపై దాడిచేసి భయపెట్టి దోచుకున్న ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి.

సమయం 2.00 : విశ్రాంత సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి కరుణాకర్‌రావు సదరుకాలనీలో ఉంటున్నారు. కర్నూలు నగరానికి వీరిదే చివరి ఇల్లులా ఉంటుంది. కరుణాకర్‌రావు, రోస్‌మేరీ దంపతులతోపాటు ఆయన కుమారుడు పాల్‌సుధాకర్‌, కోడలు ఉంటారు. ఓ ఫైనాన్స్‌లో పనిచేసే పాల్‌సుధాకర్‌ ఉద్యోగ నిమిత్తం గుంటూరుకు వెళ్లగా కోడలు పుట్టింటికి వెళ్లటంతో కరుణాకర్‌ దంపతులు మాత్రమే ఉన్నారు. తెల్లవారుజామున దాదాపు రెండు గంటల సమయంలో దుండగులు రాడ్డుతో వీరి ఇంటి తలుపు బద్ధలుకొట్టి లోపలికి చొరబడ్డారు. కరుణాకర్‌రావును రాడ్డుతో కొట్టడంతో భార్య భయపడి తన మెడలోని పుస్తెల గొలుసు, చేతి ఉంగారాన్ని తీసిచ్చారు. వారి వద్ద ఉన్న కత్తులు చూసి దాచుకున్న రూ.39 వేల నగదు తెచ్చి ఇవ్వటంతో దొంగలు వాటితో ఉడాయించారు. వెళ్తూవెళ్తూ వారిని దుప్పటితో తలుపుకు కట్టేసి నిర్భంధించారు. ఇంట్లో ఉన్న చరవాణి, తినేందుకు అరటిపళ్లు, నీళ్లసీసాలు తీసుకెళ్లారు.

సమయం 2.30 : కరుణాకర్‌రావు ఇంటి సమీపంలోనే మోహన్‌కృష్ణ నివాసం ఉంటున్నారు. ఆళ్లగడ్డ మండలం నందిపల్లె స్వగ్రామం. ఆర్మీ ఉద్యోగి అయిన ఈయన మరో రెండు మాసాల్లో పదవీవిరమణ పొందనున్నారు. స్థానిక ఎన్‌సీసీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈయనకు భార్య లావణ్య, ఇద్దరు కుమారులు సంతానం. మొదటి అంతస్తులో ట్రాక్టర్‌ షోరూంలో పనిచేసి పెద్దయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు స్వగ్రామానికి వెళ్లారు. దొంగలు ముందుగా పెద్దయ్య ఇంటి తాళం పగులగొట్టి బీరువాతో సహా అన్నిటినీ గాలించి దొరికిన హుండీ డబ్బు రూ.1500 మాత్రం తస్కరించారు.

సమయం 3.00 : పెద్దయ్య ఇంటిని దోచేసిన దుండుగులు కిందకి వచ్చి తలుపు గడియ పెకిలించి లోపలికి చొరబడ్డారు. నిద్రలేచిన మోహనకృష్ణ తలుపును మూసివారిని లోపలికి రాకుండా అడ్డుకునే యత్నం చేశారు. అయితే వారు బలంగా తోసుకొని వెళ్లి తలపై రాడ్డుతో కొట్టడంతో కిందపడిపోయారు. వెంటనే లేచి ధైర్యంగా తిరగబడ్డారు. చివరకు ఇద్దరు పిల్లల మెడకు కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించటంతో మోహనకృష్ణ దంపతులు భయపడి ఏమీ చేయవద్దని వారివారి మెడలోని బంగారు గొలుసులు తీసిచ్చారు. ఓ చెవి కమ్మ తీసి ఇవ్వగానే బయట ఉండే దుండగులు పిలవటంతో పారిపోయారు. అంతటితో ఊరుకోని మోహనకృష్ణ వారిని పట్టుకొని కత్తి లాక్కొన్నాడు. ఇంటి ముందున్న రాళ్లను వారిపై విసిరి పట్టుకునే యత్నం చేయగా వారు వెనుక వైపు గోడ దూకి పారిపోయారు. బయట ఉన్న దుండగులు ఇతని రెండు ద్విచక్ర వాహనాలు పనిచేయకుండా చేశారు. సెల్‌ఫోన్‌ వెంట తీసుకెళ్లారు. దొంగలు దాడి చేసిన సమయంలో మోహనకృష్ణ గట్టిగా కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ స్పందించలేదు. సమీపంలోనే నవభారత్‌ డీఈడీ కళాశాల వాచ్‌మెన్‌ దంపతులు వృద్ధులు కావటంతో ధైర్యం చేయలేకపోయారు. గాయపడిన ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లి తలకు, ఒంటికి అయిన గాయాలకు చికిత్స చేయించుకున్నారు. సమాచారం తెలిసి ఇన్‌ఛార్జి డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌, సీసీఎస్‌ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు రామకృష్ణారెడ్డి, శ్రీరాములు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను విచారించారు. దండగులు 35 ఏళ్ల లోపువారేనని తెలిసింది. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. ఘటనాస్థలానికి కొద్దిదూరంలో కరుణాకర్‌రావు ఇంట్లో తస్కరించిన సెల్‌ఫోన్‌, నీళ్లసీసాలు, అరటిపండ్ల తొక్కలు, పరికరాలు ఉండటంతో మొదటి ఇల్లు దోచుకున్న తర్వాత దొంగలు కొద్దిసేపు సేదతీరి ఆర్మీ ఉద్యోగి ఇంట్లో నేరానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. సమీప నవభారత్‌ కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజీ పరిశీలించారు. మోహనకృష్ణ ఇంట్లో 8 తులాలు, కరుణాకర్‌ ఇంట్లో రూ.39 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు దొంగలపాలైనట్లు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బిహార్‌ గ్యాంగ్‌ ముఠా పనేనా?

దోపిడీకి పాల్పడిన దొంగలు ఎనిమిది మంది ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వారు హిందీ భాష మాట్లాడుకోవటంతో బిహార్‌ దొంగల ముఠా లేదా ఉత్తరాధి రాష్ట్రాల పాతనేరస్థుల ముఠా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

స్పందించని డయల్‌ 100

దొంగల దాడి జరిగిన సమయంలో మోహనకృష్ణ పలుమార్లు 100కు ఫోన్‌చేశారు. స్పందన లేకపోవటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందేసరికి ఆలస్యం అయింది. ఘటన జరిగిన ఇళ్లకు పోలీసు స్టేషన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండటంతో మరింత ఆలస్యమైంది. సమీప డాక్టర్‌ కాలనీలో పోలీసు ఔట్‌పోస్టు కొద్దిరోజుల క్రితం ఎత్తివేయటంతో చుట్టుపక్కల కాలనీల్లో పోలీసు గస్తీ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన 100 స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది.

మోహన్‌కృష్ణ ధైర్యసాహసాలు భేష్‌

దొంగలతో పోరాడిన మోహన్‌కృష్ణ నిజంగా ఆర్మీ ఉద్యోగి అని నిరూపించుకున్నారు. ఏమాత్రం భయపడకుండా ఏకంగా 8 మంది దుండుగులతో పోరాడటంతోపాటు గాయపడినా లెక్కచేయకుండా వారిపై ప్రతిదాడికి పాల్పడి తరమికొట్టారు. గాయపడిన ఆయనే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు.

ఆర్మీ ఉద్యోగి మోహన్‌కృష్ణ ఇల్లు


సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న సీఐ రామకృష్ణారెడ్డి

తలుపు బద్ధలు కొట్టిన తీరును వివరిస్తున్న కరుణాకర్‌రావు
 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.