close

ప్ర‌త్యేక క‌థ‌నం

అపర భగీరథ ఫలం.. కాళేశ్వరం!

ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో రేపు సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది పల్లమెరిగి ప్రవహించే నీటిని.. తాడెత్తుకు తరలించే, అదీ నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్‌ అద్భుతం.. కాళేశ్వరం!

దేశంలోనే ఇంత భారీ, ఇంతటి ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరోటి లేదు. ఎత్తిపోతల పథకాల్లో ప్రపంచంలోనే అరుదైన ఘనత దీనిది. భూమ్మీది నిర్మాణాలను చూసినా.. భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహా బాహుబలి పంప్‌హౌస్‌లను చూసినా.. అనకొండల్లా నేల మాళిగల్లో కిలోమీటర్ల కొద్దీ సాగిపోయే సొరంగాలను చూసినా.. కళ్లు చెదరటం ఖాయం. ఇంకా చెప్పాలంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు!

కాళేశ్వరం.. ఆధునిక భగీరథుడి అపురూప సృష్టి!
నెర్రలిచ్చిన తెలంగాణ నేలను ముద్దాడే అతిపెద్ద నీటి చుక్క!!

కాళేశ్వరాన్ని మనం ఒక పేరుతో పిలుస్తున్నాంగానీ.. వాస్తవానికి అది ఒక ప్రాజెక్టు కాదు.. పది భారీ ప్రాజెక్టుల పెట్టు! మేడిగడ్డ వద్ద గోదారి ప్రాణ ధారను పొదివిపట్టుకుని.. అక్కడి నుంచి మెట్టుమెట్టూ ఎక్కించుకుంటూ.. ఎక్కడిక్కడ వరస బ్యారేజీలతో అడ్డుకట్టి, మహా భారీ మోటార్లతో వడివడిగా మైళ్లకు మైళ్లు నడిపించుకుంటూ.. చివరాఖరికి ఏకంగా ఐదు వందల మీటర్ల ఎత్తు వరకూ తీసుకుపోయి.. తెలంగాణ నేలతల్లిని తడిపే ఓ సాహసోపేత స్వప్నం!!

ఈ స్వప్నం ఇప్పుడు నిజమవుతోంది!!

అవును.. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం. పల్లమెరిగి జలజల ప్రవహించే నీటిని.. తాడెత్తుకు తరలించే, అదీ నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్‌ అద్భుతం! దేశంలోనే ఇంత భారీ, ఇంతటి ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరోటి లేదు. ఎత్తిపోతల పథకాల్లో ప్రపంచంలోనే అరుదైన ఘనత దీనిది. భూమ్మీది నిర్మాణాలను చూసినా.. భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహా బాహుబలి పంప్‌హౌస్‌లను చూసినా.. అనకొండల్లా నేల మాళిగల్లో కిలోమీటర్ల కొద్దీ సాగిపోయే సొరంగాలను చూసినా కళ్లు చెదరటం ఖాయం. ఇంకా చెప్పాలంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు! ఒక్కో పంపుహౌస్‌ పనులు చూస్తే ఓ హాలివుడ్‌ సినిమా అనుభూతికి ఏం తగ్గదు. అందుకే నేడు కాళేశ్వరం పేరు దేశమంతా మోగిపోతోంది. ఇక ఈ స్వప్నాన్ని అకుంఠిత దీక్షతో అతి తక్కువ కాలంలోనే సాకారం చేస్తున్న కేసీఆర్‌ పేరు ‘తెలంగాణ కాటన్‌’గా తరతరాలు చెప్పుకుంటే ఆశ్చర్యమేముంటుంది?

అందనంత ఎత్తులకు నీటిని పట్టుకెళుతూ... ఇదో ఎత్తిపోతల పరంపర!

మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి.. ఇలా కొండపోచమ్మ వరకూ... నీటిని వరస బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో ఎత్తిపోసుకుంటూ.. సుదూరతీరం తీసుకువెళ్లటం కాళేశ్వరం ప్రాజెక్టు మూలసూత్రం!! ఈ క్రమంలో నీటిని పొడవాటి కాల్వలు, పెద్దపెద్ద భూగర్భ సొరంగాలు, పొడవాటి పీడన గొట్టాలు.. వీటన్నింటి గుండా.. దాదాపు 518 మీటర్ల ఎత్తుకు.. అంటే సుమారు ఐదు తాడిచెట్ల ఎత్తుకు తీసుకువెళతారు! 

మామూలుగా ఎంత భారీ ప్రాజెక్టు అయినా ఒక ప్రధాన డ్యాము, ప్రధాన కాలువలు, మధ్యలో కొన్ని జలాశయాలుంటాయి. కొన్ని ప్రాజెక్టుల్లో నాలుగైదు లిప్టులుంటాయి. కానీ కాళేశ్వరం ఎత్తిపోతల వీటన్నిటికి భిన్నం. ఒక ప్రాజెక్టులోనే బోలెడన్ని బ్యారేజీలు, పంప్‌హౌసులు.. అదీ ఒక్కోటీ ఒక ప్రాజెక్టంత ఉన్నవి దేశంలో మరెక్కడా లేవు. దీన్ని ప్రపంచంలోనే ప్రముఖమైన ఎత్తున నిలబెడుతున్నది ఈ భారీదనమే!

ఇదీ ప్రవాహం..
మేడిగడ్డ దగ్గర 1.63 కి.మీ. వెడల్పు బ్యారేజీతో మొదలవుతుందీ ప్రాజెక్టు. ఇక్కడి నుంచి నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన 11 మోటార్లు అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోస్తాయి. 66 గేట్లతో, 10.87 టీఎంసీల నిల్వసామర్థ్యంతో నిర్మించిన అన్నారం బ్యారేజీ నుంచి నీటిని.. ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 భారీ మోటార్లతో నిర్మించిన అన్నారం పంపుహౌస్‌.. 34 మీటర్ల ఎత్తుకు పంప్‌ చేసి.. 74 గేట్లతో నిర్మించిన సుందిళ్ల బ్యారేజిలోకి ఎత్తిపోస్తుంది. ఈ సుందిళ్ల బ్యారేజీ నుంచి ఇక్కడి పంప్‌హౌస్‌ 40 మీటర్ల ఎత్తుకు పంప్‌ చేసి.. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తుంది. ఇందుకోసం ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యంగల 9 భారీ మోటార్లు అమర్చారు. ఇక ఎల్లంపల్లి నుంచి నీరు రెండు 9.53 కి.మీ. భారీ సొరంగ మార్గాల ద్వారా పంప్‌హౌస్‌లకు, అక్కడి నుంచి మేడారానికి వెళ్తుంది. ఈ సొరంగ మార్గాలతో పాటు భూగర్బంలోనే పంపుహౌస్‌ నిర్మించి.. ఇక్కడ ఒక్కోటీ 124 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేశారు. మేడారం నుంచి 1.95 కి.మీ కాలువ, 15.37 కి.మీ దూరం గల రెండు సొరంగ మార్గాల ద్వారా ప్రవహించే నీరు భారీ పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు చేరుతుంది. ఈ పథకంలో ఎక్కువ సామర్థ్యం గల మోటార్లు, పంపులు ఉన్నది ఇక్కడే. ఇక్కడ ఒక్కోటీ 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి సాయంతో నీటిని 117 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కాలువలో పోసి, శ్రీరాంసాగర్‌ వరదకాలువలోకి మళ్లిస్తారు. దీన్నుంచి ఎత్తిపోసే నీరు మిడ్‌మానేరుకు చేరుతుంది. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్‌ ద్వారా మల్లన్నసాగర్‌ వరకు వస్తాయి. మల్లన్నసాగర్‌ నుంచి ఒక కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంథమల, బస్వాపుర తదితర రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తుంది. కాళేశ్వరం కింద మిడ్‌మానేరు వరకూ కూడా ఆయకట్టు లేదు.. గరిష్ఠంగా ఆయకట్టు ఉన్నది ఈ చుట్టుపక్కలే!

 

ఇవీ విశిష్టతలు!
ఒక్క ఏడాదిలో అన్ని అనుమతులు...

ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించడానికి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో పని చేసింది. 2017 ఫ్రిబవరిలో కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. జలసంఘం నుంచి వచ్చే కొర్రీలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూ  2017 అక్టోబరు 30న మొదట నీటి లభ్యత అనుమతి వస్తే 2018 జూన్‌ నాటికి జల సంఘం సాంకేతిక సలహా మండలి (టిఎసి) అనుమతి లభించింది. మొదటి అనుమతికి, సాంకేతిక సలహా కమిటీకి మధ్యనున్న 8 నెలల్లోనే అంతర్రాష్ట్ర అనుమతి, అటవీ, పర్యావరణ, సాగు ప్రణాళిక, ఇరిగేషన్‌ ప్లానింగ్‌.. ఇలా అన్ని అనుమతులూ లభించాయి. ఇంత భారీ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి అతి తక్కువ సమయంలో అన్ని అనుమతులూ రావటం అరుదైన అంశం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ లేఖలు రాస్తే.. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శి జోషి, ఇంజినీర్లు అనేక సార్లు దిల్లీ వెళ్లి అక్కడిక్కడే అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ త్వరితగతిన అనుమతులు వచ్చేలా చేశారు.

భారీగా భూసేకరణ

ఈ ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం కోసం సుమారు 80,000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 55,000 ఎకరాలు సేకరించారు. భూసేకరణకు రూ.4550 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులు కానున్న 6200 కుటుంబాల కోసం ఇప్పటి వరకూ రూ.550 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

అత్యధిక విద్యుత్తు వినియోగం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయేనాటికి రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ ఎంత ఉందో ఇంచుమించు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే అంత అవసరం. ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, మూడో టిఎంసీ పని కూడా పూర్తయితే 7152 మెగావాట్లు అవసరం. తెలంగాణ ఏర్పడినపుడు రాష్ట్రం విద్యుత్తు డిమాండ్‌ 7700 మెగావాట్లు కాగా, ఇప్పుడు అత్యధికంగా 10,818 మెగావాట్లు ఉంది. రాష్ట్రం మొత్తానికి విద్యుత్తు డిమాండ్‌ ఎంతో అందులో మూడో వంతు అదనంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే అవసరం. దీనికోసం ఎత్తిపోతల పథకాల వద్ద విద్యుత్తు సబ్‌స్టేషన్లు, లైన్లు లాగి సరఫరా ఇవ్వడం.. ఇలా అన్ని పనులను విద్యుత్తు శాఖ సకాలంలో పూర్తి చేసింది.

* ఈ పథకంలో మొత్తం 19 పంపింగ్‌ స్టేషన్లలో 82 పంపులు, మోటార్లు అమర్చారు. అన్ని లిప్టుల వద్ద ఎత్తును కలిపితే నీటిని పైకెత్తేది 1444 మీటర్లు. ఆరంభ ప్రాజెక్టు మట్టంతో చూస్తే నీరు 518 మీటర్లు ఎత్తుకు తీసుకువెళుతున్నారు.

ఎక్కడా లేవు!

శ్రీశైలంలో 150 మెగావాట్ల టర్బైన్లను వినియోగించి నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ విద్యుత్తును వినియోగించి నీటిని ఎత్తిపోసే మోటార్లు, పంపులు ఇప్పటి వరకూ ఎక్కడా లేవు. కల్వకుర్తిలో ఒక్కొక్కటి 30 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు, పంపులు ఉన్నాయి. కానీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యధికంగా ఒక్కో మోటారు సామర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటివి ఒకే పంపుహౌస్‌లో 7 ఏర్పాటు చేశారు. అంటే ఈ ఒక్క పంపుహౌస్‌లో నీటిని ఎత్తిపోయడానికే 973 మెగావాట్ల విద్యుత్తు అవసరం.

అడుగడుగునా రికార్డులు

* భూగర్భంలో భారీ పంపుహౌస్‌లు
* నీటిని అత్యధిక ఎత్తుకు మళ్లించే మహాశక్తి మోటార్లు
* మైళ్లకు మైళ్లే భారీ సొరంగ మార్గాలు
* అత్యధిక విద్యుత్తు వినియోగం
* అధిక సంఖ్యలో విద్యుత్తు సబ్‌స్టేషన్లు..

ఇవన్నీ ఒక ఎత్తైతే..

వీటి నిర్మాణానికి ఒకే ప్రాజెక్టు మీద    3 ఏళ్లలో రూ.45,000 కోట్లకు పైగా ఖర్చుచేసి దాదాపు ప్రధాన పనులన్నింటినీ పూర్తి చేయించటం పెద్ద రికార్డు!ఇవన్నీ ఒక ఎత్తైతే.. ‘సాగునీటి’ ప్రాజెక్టులంటే ‘సంవత్సరాల తరబడి పనులు సాగుతూనే’ ఉండే ప్రాజెక్టులని చెప్పుకోవటం పరిపాటిగా మారిన పరిస్థితుల్లో.. ఒక్కో పని ఒక భారీ ప్రాజెక్టు అంత ఉన్నా, అన్ని పనులనూ 3 ఏళ్లలోపే పూర్తి చేయించగలగడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. వేల మంది కార్మికులు, వందల మంది ఇంజినీర్లు రేయింబవళ్లు విశ్రాంతి లేకుండా శ్రమించడం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వం, నిత్య పర్యవేక్షణతో.. గుత్తేదారులు ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా పనులను పరుగెత్తించటం.. అన్నీ కలిసి కాళేశ్వరం మహా స్వప్నం రికార్డు సమయంలో కార్యరూపం దాల్చింది!

28 ప్యాకేజీలు

మొత్తం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వాయువేగంతో పూర్తి చేసేందుకు 28 ప్యాకేజీలుగా విభజించి గుత్తేదారులకు అప్పగించారు. ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా గుత్తేదారులు పోటీపడి పనులు పూర్తి చేశారు. ఆధునిక యంత్రాలు తెప్పించడం, సాంకేతిక నిపుణులు, కూలీలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం, మూడు షిఫ్టుల్లో పనులు చేయించడం ద్వారా రెండు నుంచి రెండున్నర సంవత్సరాల్లోనే ప్రధాన పనులన్నీ పూర్తి చేయగలిగారు. భారీ పనులను మెగా ఇంజినీరింగ్‌, నవయుగ ఇంజినీరింగ్‌, ఎల్‌అండ్‌టీ, ఆప్కాన్స్‌ తదితర సంస్థలు చేయగా బీహెచ్‌ఈఎల్‌, ఏబీబీ, యాండ్రిజ్‌, ఎన్‌సీసీ, పటేల్‌ తదితర సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

ఇక్కడే ప్రారంభం!!

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల పరంపరంలో మొట్టమొదటి ఘట్టం.. ఈ మేడిగడ్డ బ్యారేజీ! ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత.. కాళేశ్వరానికి దిగువన గోదావరిపై 1.63 కిలో మీటర్ల వెడల్పుతో.. 85 గేట్లతో.. నిర్మించిన భారీ బ్యారేజీ ఇది! 2017 చివర్లో ఆరంభించినా పని మొత్తం పూర్తయిపోయిన ఈ బ్యారేజీ వద్దే రేపు ప్రారంభోత్సవం జరగనుంది. గోదావరిలోనే ఇది 16.37 టీఎంసీల నీటిని నిల్వ చేస్తుంది. ఈ నీటిని ఇక్కడికి 22 కి.మీ. దూరంలో కన్నెపల్లి వద్ద నిర్మించిన భారీ పంప్‌హౌస్‌.. అన్నారంలోకి పంపుతుంది.

ఇదీ కన్నెపల్లి పంప్‌హౌస్‌ లోపలి భాగం! దీనిలో ఒక్కోటీ 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. మామూలుగా మన ఇళ్లలో వాడే చిన్న మోటార్ల సామర్థ్యం 1 హార్స్‌పవర్‌ అనుకుంటే వీటిలో ఒక్కోటీ 54 వేల మోటార్లకు సమానం!! మొత్తం ఈ 11 మోటార్లూ కలిసి రోజూ 2 టీఎంసీల నీటిని 49 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తాయి.

కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి కాలువలోకి నీటిని తీసుకువచ్చే గొట్టాలివి! ఇక్కడి నుంచి నీరు కాలువల ద్వారా అన్నారం బ్యారేజీ వద్దకు వెళుతుంది! అక్కడి నుంచి మళ్లీ సుందిళ్లకు ఎత్తిపోస్తారు! అక్కడి నుంచి ఎల్లంపల్లికి, తర్వాత మేడారం, ఆ తర్వాత.. రామడుగు.. మధ్య మానేరు.. ఇలా వరసగా కొండ పోచమ్మ వరకూ ఈ పరంపర సాగుతుంది!

ఒక్కోటీ.. 1 లక్షా 86 వేల ఇంటి మోటార్లకు సమానం!

మిడ్‌మానేరుకు నీటిని మళ్లించేందుకు భూగర్భంలో ఏర్పాటు చేసిన పంపుహౌస్‌ ఇది! ఇందులో ఒక్కో మోటారు సామర్థ్యం 139 మెగావాట్లు. ఇలాంటి మోటార్లు ఇక్కడ 7 అమర్చారు. తేలికగా చెప్పుకోవాలంటే ఈ మోటార్లు ఒక్కోటీ 1 లక్షా 86 వేల హార్స్‌పవర్‌తో సమానం. అంటే మన ఇళ్లలో వాడే 1 హెచ్‌.పీ సామర్థ్యం గల మోటార్ల వంటివి 1 లక్షా 86 వేలు ఒక్కసారిగా ఎంత నీటిని ఎత్తిపోస్తాయో ఇక్కడ ఒక్కో మోటారూ అంత నీటిని బయటకు తెస్తుంది. ఇలాగే ఇతర పంప్‌హౌసుల్లో ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు, 124 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్లు కూడా వాడారు!

భూగర్భంలో అదో అద్భుత యంత్ర లోకం!

భూగర్భంలో భారీ పంప్‌హౌస్‌ల నిర్మాణం కాళేశ్వరం ప్రత్యేకం! ఇది ఎల్లంపల్లి నుంచి మేడారం చెరువుకు నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన భారీ భూగర్భ పంప్‌హౌస్‌ ఇది!

భారీ వాహనాలు వెళ్లేంత సొరంగ మార్గాలు...

ఇది మేడారం చెరువు నుంచి మిడ్‌మానేరుకు నీటిని మళ్లించేందుకు నిర్మించిన పంపుహౌస్‌ వరకు తవ్విన సొరంగం. ఈ ప్రాజెక్టులో  ఇలా మొత్తం 203 కి.మీ దూరం సొరంగమార్గాలు ఉన్నాయి. ఈ సొరంగమార్గాల్లో భారీ వాహనాలు కూడా సులభంగా ప్రయాణించొచ్చు. ఇన్నోవా లాంటి వాహనాలు రెండు ఎదురెదురుగా వెళ్లిపోవచ్చు. చాలా చోట్ల 10 మీటర్ల వ్యాసం గల సొరంగాలు రెండింటిని సమాంతరంగా తవ్వారు. ఈ సొరంగ మార్గాలన్నింటినీ పూర్తిగా లైనింగ్‌ చేశారు.

విద్యుత్తూ ప్రత్యేకమే!

అనంతగిరి నుంచి నీటిని మళ్లించే ఎత్తిపోతల పథకం వద్ద నిర్మించిన సబ్‌ స్టేషన్‌ ఇది. ఇలాంటివి ప్రాజెక్టు మొత్తం మీద 17 నిర్మించారు. ఏడాదికి విద్యుత్తు ఛార్జీల కింద రూ.4067.40 కోట్ల బిల్లు వస్తుందని అంచనా.

ఏడాదిలోనే భారీ జలాశయం నిర్మాణం.. కొండపోచమ్మ..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో రెండో అతిపెద్ద సామర్థ్యం దీనిది! 15.8 కి.మీ దూరం కట్ట నిర్మాణంతో 12 మీటర్ల నుంచి 47 మీటర్ల వరకు ఎత్తుతో 15 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా భారీఎత్తున చేపట్టిన ఈ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ఏడాదిలోనే పూర్తవటం విశేషం. దీనికోసం భారీ యంత్రాలేకాదు.. అధిక సంఖ్యలో కార్మికులూ పనిచేశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఉన్న రిజర్వాయర్లన్నింటిలోకీ మల్లన్నసాగర్‌ అతిపెద్దది, దీని సామర్థ్యం 50 టీఎంసీలు. ఇది పూర్తి కావటానికి మరికొంత సమయం పట్టేలా ఉండటంతో 18 కి.మీ. దూరం కాలువ తవ్వి పంపుహౌస్‌ ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేలా ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ కృషి అమోఘం

సర్వే మొదలుకొని నిర్మాణం వరకు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల ఇంత భారీ ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తి చేయగలిగాం. భూసేకరణ, అనుమతులు, మహారాష్ట్రతో చర్చించి సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం.. ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వం పట్టువిడవకుండా కృషిచేసింది. అదే సమయంలో సమాంతరంగా పనులు చేయడం కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత. ప్రాజెక్టులో డిజైన్ల సంఖ్య చాలా ఎక్కువ. అయినా ఎక్కడా ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు ఆమోదం తెలపడం వల్ల గుత్తేదారులు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలుసుకొంటూ మార్గదర్శకం చేయడం, గతంలో నీటిపారుదల మంత్రిగా హరీశ్‌రావు పర్యవేక్షించటం, ఇంజినీర్లు, అన్ని ప్రభుత్వ విభాగాలు, గుత్తేదారులు ఇలా అందరూ ఎవరి పనులు వారి చేసేలా ప్రభుత్వం తీసుకొన్న చర్యల వల్లే ఈ ప్రాజెక్టు కల సాకారమైంది.
- మురళీధర్‌ (ఈఎన్‌సీ -నీటిపారుదల)

రాత్రనక పగలనక కష్టపడ్డాం

ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఇంజినీర్లు, గుత్తేదారులు, కార్మికులు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన వారు రాత్రనక, పగలనక కష్టపడ్డారు. పునరాకృతి జరిగిన తర్వాత లైడార్‌ సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, జలసంఘం నుంచి అనుమతుల సాధనకు అహోరాత్రులు కృషిచేయడంతో పాటు, మూడు షిప్టులుగా పనులు చేశాం. పగలు కాలువలు, రాత్రుళ్లు సొరంగ మార్గాలు, పంపుహౌస్‌ల పనులను పర్యవేక్షణ, అర్ధరాత్రి వరకు గుత్తేదారులతో సమీక్షలు.. ఇలా ఓ యుద్ధం లాగా ఇంజినీర్లందరూ సమష్టిగా కృషిచేశారు. ముఖ్యమంత్రి పట్టుదలతో ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో సహకరించారు. తక్కువ సమయంలో ఇంత భారీ ప్రాజెక్టు పూర్తయ్యేస్థాయికి చేరుకోవడం ఓ అద్భుతం. కరవుతో అల్లాడే రైతుకు నీరందించాలన్న ప్రభుత్వ పట్టుదలతోనే ఇది సాధ్యమైంది.
- హరిరాం (ఈఎన్‌సీ-కాళేశ్వరం)

ఇంజినీర్లందరికీ గర్వకారణం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల్లో భాగస్వామి అయినందుకు గర్వకారణంగా ఉంది. 10-15 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టును రెండు సంవత్సరాల ఒక నెలలో పూర్తి చేయడం ఇంజినీర్లందరికీ గర్వకారణం. ఈ అవకాశం కల్పించినందుకు ఇంజినీర్లమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. తెలంగాణలో మెజారిటీ ప్రజానీకానికి నీళ్లందించే ప్రాజెక్టు పూర్తిచేయడం చాలా సంతృప్తి కలిగించింది. సమష్టి కృషితోనే ప్రపంచంలోనే ఓ భారీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయగలిగాం. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఇచ్చిన స్ఫూర్తితో గుత్తేదారులు, ఇంజినీర్లు అంతా అంకిత భావంతో పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది.
- వెంకటేశ్వర్లు (ఈఎన్‌సీ)


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.