close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇది మహాత్ముడి ఆవాహనా సమయం

 

ఈనాడొక అపురూప దినం!
ప్రపంచ చరిత్రలో ఒక బుద్ధుడిలా.. ఒక క్రీస్తులా.. ఉన్నత విలువలతో తోటి వారిని నడిపించేందుకు నడుం కట్టటమే కాదు.. తన జీవితాన్ని ఏ దాపరికమూ లేని అద్దంలా అందరి ముందూ ఉంచి.. ఒక నాయకుడిగా మొదలై.. ఒక యోధుడిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక తాత్వికుడిగా, ఒక ప్రవక్తలా... అన్నింటినీ మించి సామాన్యుల్లో  అతిసామాన్యుడిగా ఈ నేల మీద నడయాడిన మహాత్ముడి 150వ జయంతి నేడు!

గాంధీజీకి సంబంధించినంత వరకూ స్వతంత్ర సంగ్రామ సారథిగా జన సముద్రాన్ని కదిలించి.. ముందుండి నడిపించటం ఒక పార్శ్వం మాత్రమే. అంతకు మించి.. ఆయన ప్రయోగశీలంగా సకల జీవన పార్శ్వాలనూ మధించి.. సంక్షుభిత సమయాల్లోనే కాదు, నిత్య జీవితంలో కూడా మనం హృదయాలకు హత్తుకోవాల్సిన నమ్రత, సహనం, అహింస, ప్రేమ, క్షమ వంటి అత్యున్నత విలువలను స్పష్టంగా మన ముందుంచారు. దశాబ్దాలూ, శతాబ్దాలూ గడిచిపోవచ్చు. అయినా ఆయన నిలబడిన విలువల అవసరం ఒకప్పటి కంటే పెరుగుతోందేగానీ తగ్గటం లేదు. అందుకే ఇది మహాత్ముడిని మరింత విస్తృతంగా అర్థం చేసుకుంటూ.. ఆయన ఆలోచనలను ఆవాహన చేసుకోవాల్సిన సమయం!!

ఈ ప్రపంచం నుంచి నువ్వు ఏ మార్పును ఆశిస్తున్నావో.. అది నీతోనే మొదలవ్వనివ్వు
- మహాత్మాగాంధీ

 

ఆయన తెచ్చింది.. నైతిక విప్లవం!

ఓ మహాత్మా ..
ఓ మహర్షీ..
ఏది సత్యం.. ఏదసత్యం..
ఏది నీతి.. ఏది నేతి..
ఏది వెలుతురు.. ఏది చీకటి..

అంటూ మహాత్మాగాంధీ మరణించినపుడు శ్రీశ్రీ రాసిన ఈ మహోన్నత కవితా పాదాలను ఎన్నిసార్లు చదివినా జవాబు తేలికగా దొరకదు. మానవ జీవిత సమరంలో మంచీచెడూ, నీతి అవినీతి, ఉత్తమ- అధో మార్గాల గురించి ప్రశ్నలు ఎప్పుడూ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు అర్థం యుగయుగానికీ మారిపోతుంది. జవాబులూ మారిపోతాయి. ఎంత అర్థం మారినా మారని మౌలిక జీవనం ఒకటి ఉంటుంది. ఆ జీవన అస్తిత్వాన్ని కొనసాగించటానికి కొన్ని నైతిక నియమాలు కావాలి. పదికాలాలకు పనికొచ్చే అట్లాంటి నైతిక నియమాలను వెల్లడించిన వారు యుగానికొకరో లేక కొన్ని యుగాలకొకరో ఉంటారు. భారత దేశ చరిత్రలో గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ ఆ కోవకు  చెందిన వారు.

రెండున్నర వేల సంవత్సరాల నాడు బుద్ధుడు ధర్మపథం (దమ్మపదం) ప్రకటించాడు. ‘‘మానవుడే చరిత్రకు సూత్రధారి. తనమీద తాను నిరంంతర పోరాటం ద్వారా సత్యాన్ని కనుగొంటాడు. గురువులో, దేవుళ్లో, దేవతలో మనిషికి సహాయం చేయలేరు. బయటిశక్తుల సహాయంతో నిజమైన జ్ఞానం లభించదు. మనిషికి మనిషే కేంద్రం. కోరికలే దుఃఖాలకు కారణం. ఆ కోరికలను విశ్లేషించుకుని సరైన దారిలో నడిచే వివేచన మనిషికి ఉంటుంది. ఆ వివేచనను తట్టిలేపటాన్ని ఏ మనిషికామనిషే చేయాలి’’ ధర్మపథం సారాంశం ఇది. ఈ విషయాలకు కాలం చెల్లటం అంటూ ఉంటుందా? అన్ని కాలాలకు వర్తించే సార్వకాలీన సత్యం వీటిల్లో లేదా? దశాబ్దాల క్రితం మహాత్మాగాంధీ చెప్పిన వాటిల్లో ఇటువంటి సార్వకాలీన సత్యాలు చాలా ఉన్నాయి. ఆ సత్యాల సారాన్ని గ్రహించటానికి ఎడతెగని పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. సత్యగ్రాహకులు ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు. దేశదేశాల్లో నియంతృత్వాలకు, భావదాస్యానికి, దౌర్జన్యాలకు, సంకుచిత ధోరణులకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు గాంధీ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నారు. బ్రిటీష్‌ వారినుంచి స్వాతంత్య్రం పొందటానికి గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు. అది నిజమే. కానీ అయన దృష్టిలో అది గొప్పది కాదు. స్వరాజ్యానికి మనం అర్హతను సంపాదించుకోవటమే ముఖ్యం. రకరకాల చెడుగుల వల్ల ఆ అర్హతను మనం కోల్పోయాం. తెల్లవాళ్ల స్థానంలో దేశస్థుల పాలన రావటం కష్టమైంది కాదు. అంతకంటే మనలో రావాల్సిన నైతిక విప్లవం ఎన్నో రెట్లు కష్టతరమైంది. అది రాకుండా రాజకీయ స్వాతంత్య్రాన్ని తెచ్చుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే ఆయన రాజకీయ పదవులకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. తను కావాలనుకుంటే ఏ పదవైనా వచ్చేది. కోర్కెల్లో సంయమనం, అహింసాయుత జీవితం, మానవ సౌహర్దం, సత్యాన్వేషణ ఈ నైతిక విప్లవంలో కీలకమైనవి.
ప్రకృతిని జయించటం, అవధుల్లేని అభివృద్ధిని సాధించటం 250 ఏళ్లుగా అన్ని సమాజాలకూ ఆదర్శంగా ఉంది. కోరికలు పెరుగుతూనే ఉంటాయి. వాటిని తీర్చుకుంటూ పోవాలి. కోరికలన్నీ భౌతిక వస్తువుల చుట్టూ తిరుగుతాయి కాబట్టి భౌతికవనరులను ఎడాపెడా ఉపయోగించాలి. మొత్తం ప్రకృతే మనిషికి దాసోహం అవ్వాలి. జంతు, వృక్షసంపదా మనిషికే ఉపయోగపడాలి. మన కోరికలు తీర్చుకునే క్రమంలో వందలవేల జంతు, వృక్ష, పక్షిజాతులు అంతరించినా ఫర్వాలేదు. అలా అంతరించటం ప్రగతికి సూచికలు. ఎవరన్నా ఇదేంటని ప్రశ్నిస్తే వారు ప్రగతి వ్యతిరేకులు. ఈ ఆలోచనను గాంధీ ప్రశ్నించారు. ప్రకృతి మన అవసరాలను తీర్చటానికే ఉంది. మన దురాశను, అవధుల్లేని కోరికలను తీర్చటానికి కాదు. అందుకే మితిమీరిన పారిశ్రామికీకరణను గాంధీ వ్యతిరేకించారు. పాశ్చాత్యదేశాలను ఆదర్శంగా తీసుకునే చాలామంది నాయకులకు ఇది రుచించలేదు. కానీ 1970ల తర్వాత పర్యావరణ చైతన్యం పెరిగిన తర్వాత అవధుల్లేని అభివృద్ధి గురించి ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రకృతి వనరులన్నీ పరిమితమే. కాబట్టి కోరికలూ అందుకనుగుణంగా ఉండాలనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. మనిషితో పాటు సమస్త జంతు జీవజాలానికి ప్రకృతిలో జీవించే హక్కు ఉందన్న చైతన్యం పెరుగుతోంది. వాతావరణ ఒప్పందాలు, కాలుష్య నియంత్రణలు, అభయారణ్యాలు అందులో భాగమే. ‘‘స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’’ పుస్తకాన్ని రాసి ఎందరెందరో ఆలోచనలను ఒక కుదుపు కుదిపిన ఇ.ఎఫ్‌.షుమాకర్‌పై బుద్ధుడి, గాంధీ ప్రభావం ఉంది. అందుకే గాంధీ గురించి ఇప్పుడు మనం ఆలోచించటమంటే మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవటమే.

గాంధీ ప్రబోధించిన అహింసా సిద్ధాంతం చాలా లోతైంది. హింసతో దేన్ని సాధించినా దాన్ని హింసతోనే కాపాడుకోవాల్సి వస్తుందన్నదే ఆయన ప్రతిపాదన. హింసతో సాధించింది హింసతోనే ముగుస్తుంది. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని కుదిపేసిన హింస ఆధారిత విప్లవాలు వాటిని కాపాడుకోటానికి హింసపై ఆధారపడి కుప్పకూలిపోయాయి. ఆయుధ బలంతో మాత్రమే సాధ్యమయ్యే విప్లవాలు నిలబడలేవని గాంధీ గట్టిగా నమ్మారు. అందుకే మనిషి కేంద్రంగా వివేచనతో వచ్చే నైతిక విప్లవాలే సమాజాన్ని ముందుకు తీసుకువెళతాయనీ, అలాంటివే ఎంతోకొంత విజయవంతమవుతాయని చెప్పారు. పెద్ద ఎత్తున హింసను ప్రయోగించగలిగే సాధనసంపత్తి, వనరులు ఆధునిక రాజ్యాల్లో పుష్కలం. 20వ శతాబ్దంలో ఏ ప్రభుత్వాన్నైనా హింసతో ఎదుర్కోవటం అసాధ్యం. వ్యవస్థీకృత సమాజాల్లోని ప్రభుత్వాలను హింసతో కూలదొయ్యటం గడచిన 50 ఏళ్లల్లో దాదాపుగా ఎక్కడా జరగలేదు. చిన్నాచితకా సమాజాల్లో ఎక్కడైనా సాధ్యమైనా అవి స్థిరంగా నిలవలేదు.

భారత చరిత్రను గాంధీ లోతుగా చదవలేదు. అయినా చరిత్రసారాన్ని ఆయన తనలో ఆవహించుకున్నట్లుగా మరే నాయకుడికీ సాధ్యపడలేదు. భారత చరిత్రలో హింస ఇతర సమాజాలతో పోల్చితే చాలా తక్కువ పాత్ర పోషించిందని మొట్టమొదటిసారి సాధికారికంగా చెప్పిన చరిత్రకారుడు దామోదర్‌ ధర్మానంద కోశాంబి. వ్యవసాయ సమాజం క్రమేపీ దేశం నలుమూలలకూ విస్త్తరిస్తున్న క్రమంలో ఎన్నో తెగలతో సంపర్కం పెట్టుకోవాల్సి వచ్చింది. తెగలు ఒక పట్టాన తమ జీవన విధానాలను వదులుకోడానికి ఇష్టపడవు. ఇతర సమాజాల్లో ఇలాంటి తెగలను బలవంతంగా లొంగదీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిర్మూలించారు. లొంగదీసుకున్న తెగల సంస్కృతులను రూపుమాపారు. కానీ మన దేశంలో చాలా వరకూ అలా జరగలేదు. తెగలను శాంతియుతంగా మచ్చికచేసుకున్నారు. తెగల దేవుళ్లనూ, దేవతలనూ ఉపదేవుళ్లగానో, దేవతలుగానో చేర్చుకున్నారు. వాళ్ల ఆచారాలను కొనసాగనిచ్చారు. తెగలను ప్రత్యేక కులాలుగా స్థిరపడనిచ్చారు. అందుకే మన దేవుళ్లు, దేవతల సంఖ్య చాలా ఎక్కువ. ఇట్లా ఒక పెద్ద చరిత్రాత్మకమైన మార్పు తక్కువ హింసతో జరిగింది. అహింస అనేది ఒక బలమైన విలువగా మన చరిత్రలో కొనసాగుతూ వచ్చింది. బౌద్ధం అదే బోధించింది. చరిత్ర మనకు అందించిన ఈ ఘన వారసత్వాన్ని గాంధీ అద్భుతంగా గ్రహించారు.
మన చరిత్ర నుంచి నేర్చుకున్నంత మాత్రాన ఇతర నాగరికతలను, సంస్కృతులను గాంధీ ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. గాంధీ విలువలను ప్రభావితం చేసిన వాళ్లలో పాశ్చాత్య చింతనాపరులకు చాలా ప్రాధాన్యం ఉంది. రష్యన్‌ మహారచయిత టాల్‌స్టాయ్‌తో ఎన్నో విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు. ఏసుక్రీస్తు ప్రదర్శించిన ఓర్పు-క్షమాగుణం గాంధీని జీవితాంతం ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఏసుక్రీస్తు శిలువనెక్కి కూడా అంతటి క్షమాగుణం ఎలా ప్రదర్శించారో తలచుకున్నప్పుడల్లా గాంధీ ఉద్వేగానికి గురయ్యేవారు. తన ఆశ్రమంలో ఏ ఫొటోలు పెట్టుకోకపోయినా నిరంతరం మహోన్నతమైన క్షమాగుణాన్ని గుర్తుచేసే శిలువను మాత్రం పదిలంగా పెట్టుకున్నారు. అన్ని సంస్కృతుల నుంచి వచ్చే మానవతావీచికలను అక్కున చేర్చుకోవటంలోనే యుగకర్తల గొప్పతనం ఉంటుంది. సంకుచిత జాతీయవాదంతో ఆలోచించే వారికి ఇతర సంస్కృతుల్లో గొప్పతనం ఏమీ కన్పించదు. ‘‘అన్ని మన వేదాల్లో ఉన్నాయష’’ అనే అగ్నిహోత్రావధానుల్లా చివరికి మిగిలిపోతారు.
కులవ్యవస్థపై పోరాటంలోనూ గాంధీది భిన్నమైన తీరే. కులవ్యవస్థను అంతర్గతంగా సంస్కరించాలని ఆయన కోరుకున్నారు. అంటరాని తనాన్ని తొలగించటానికి హరిజనవాడలకు సంస్కరణవాదులు తరలివెళ్లి అక్కడ సేవాకార్యక్రమాలను చేపడితే ఇరువైపులా హృదయపరివర్తనం కలిగి సుహృద్భావం ఏర్పడుతుందని ఆయన నమ్మారు. హృదయపరివర్తన రావటమే ఆయన దృష్టిలో విప్లవం కాబట్టి ఆ బాటను ఎంచుకున్నారు. చట్టాలు చేస్తే చెడు భావాలు తొలగిపోతాయన్న భావనను నమ్మలేదు.
ఒక మతంపై ఇంకొక మతం ఆధిపత్యం.. ఒకరికి గెలుపు.. మరొకరికి ఓటమి.. గాంధీ ఇవి కోరుకోలేదు. ఆయన దృష్టిలో పరాజిత- విజేత సమూహాలు ఉండకూడదు. హిందూ-ముస్లింలను కలపటానికి ఆ రీతిలోనే కృషిచేశారు. విజేత-పరాజిత మనస్తత్వాలు ఉన్నంతకాలం వైషమ్యాలు రాజుకుంటూనే ఉంటాయి. అవి లేకుండా చేయటానికే ఎన్నో మెట్లు దిగారు. మతప్రాతిపదికపై దేశ విభజన తప్పదని కాంగ్రెస్‌ తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత భార హృదయంతోనే దాన్ని అంగీకరించారు. విజేత-పరాజిత మనస్తత్వాన్ని నిలువెల్లా ఆవహింపచేసుకున్న వ్యక్తి చేతిలో చివరికి మహాత్ముడు నేలకొరిగారు.
గాంధీ జీవితాంతం పరితపించిన విలువలను తూకపురాళ్లుగా తీసుకుని మనం ఎక్కడున్నామో అంచనా వేసుకుంటే విషాదదృశ్యమే కనపడుతుంది. పర్యావరణ విధ్వంసం, మత దురహంకారం, కులతత్వం,  విజృంభిస్తున్న గాడ్సే ఆలోచనాధోరణి, విపరీత సైనిక వ్యయం, తారస్థాయికి చేరుకుంటున్న అసమానతలు, బలహీనవర్గాలపై దాడులు, వేలకోట్లల్లో ఎన్నికల ఖర్చులు, విచ్చలవిడి మద్యం వాడకం చూస్తుంటే గాంధీ ప్రబోధాల నుంచి నవభారత్‌ చాలా దూరం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ దూరాన్ని తగ్గించటానికి మరో సైద్ధాంతిక ప్రత్యామ్నాయ మార్గమూ కనుచూపుమేరలో లేదు. తరాలు మారినా తిరిగి తిరిగి గాంధీ లేవనెత్తిన మౌలిక నైతిక ప్రశ్నల వైపు వెళ్లటమూ తప్పటం లేదు. అందుకే గాంధీ ప్రతి ఆశయమూ వక్రీకరణకో, వికృతీకరణకో గురవుతోన్న సమయంలో మనం ఏది సత్యం, ఏదసత్యం.. ఏది వెలుతురు.. ఏది చీకటి.. ఏది నీతి.. ఏది నేతి అని ఘోషిస్తూనే ఉండాలి. నైతిక పరివర్తనకు లోనవుతూనే ఉండాలి. మహాత్ముడికి అంతకంటే ఘన నివాళి ఏముంటుంది!
- ఎన్‌.రాహుల్‌కుమార్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.