close

ప్ర‌త్యేక క‌థ‌నం

రైతుకు రాయితీ రక్ష 

ఐరోపా దేశాల వ్యవసాయ బడ్జెట్లలో 38 శాతం సబ్సిడీలకే 
పలు దేశాల్లో అన్నదాతలకు పింఛన్లు 
విత్తన నాణ్యతలో మనకన్నా మేలు 
పక్కాగా విత్తనోత్పత్తి, నాణ్యత ధ్రువీకరణ 
అంతర్జాతీయ సదస్సుతో తెలంగాణకు గుర్తింపు వస్తుంది 
విత్తన ఎగుమతులకు ఇక మరిన్ని అవకాశాలు 
‘ఈనాడు’తో ముఖాముఖిలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి 
ఈనాడు - హైదరాబాద్‌ 
రైతుకు రాయితీ రక్ష 

ఐరోపా ఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు అక్కడి రైతులకు భారీగా రాయితీలిస్తున్నాయి. ఆయా దేశాల వ్యవసాయ రంగం బడ్జెట్లలో 38 శాతం నిధులు రాయితీలకే కేటాయిస్తున్నట్లు ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వెల్లడించింది.

రోపా దేశాలు రైతు భద్రతకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తాయని.. వారికి విత్తనాలు మొదలు రాయితీలు, గిడ్డంగి సౌకర్యాలు, పింఛన్లు ఇలా అన్ని విధాలా అన్నదాతను ఆదుకుంటాయని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి వివరించారు. ఇటీవల ఇటలీ రాజధాని రోమ్‌లో ఎఫ్‌ఏఓ నిర్వహించిన ‘సృజనాత్మక వ్యవసాయ అంతర్జాతీయ సదస్సు’కు భారత ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. అనంతరం జ్యూరిచ్‌లోని ‘అంతర్జాతీయ విత్తన పరీక్షల ఏజెన్సీ’(ఇస్టా)కి వెళ్లి హైదరాబాద్‌లో జరిగే ‘అంతర్జాతీయ విత్తన సదస్సు’కు చేయాల్సిన ఏర్పాట్లపై నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా పార్థసారథితో  ‘ఈనాడు’ ముఖాముఖి.

రైతు బంధులా నేరుగా రైతులకు నగదు ఇచ్చే పథకాలు ఇంకెక్కడా లేవా? 
ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో రైతులకు పరోక్ష విధానంలో రాయితీలు ఎక్కువగా ఇస్తున్నారు. అక్కడ వ్యవసాయానికి అవసరమైన పరికరాలు, ఎరువులు, గిడ్డంగులు వంటి మౌలిక సదుపాయాలు ఇస్తున్నారు. రైతులకు వృద్ధాప్యంలో నేరుగా పింఛను చెల్లిస్తున్నారు.

ఐరోపా దేశాల్లో నాణ్యమైన విత్తన పంపిణీకి తీసుకునే జాగ్రత్తలేమిటి? 
అక్కడ విత్తన పంటల సాగు, విత్తనోత్పత్తిలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ విత్తన నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. విత్తు నాణ్యత పరీక్షలు చేసే ప్రయోగశాలల్లో అధునాతన సదుపాయాలున్నాయి. విత్తన చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నారు.

అక్కడి వ్యవసాయాధికారుల, విత్తన కంపెనీల పనితీరుకు, మనదేశంలో ఉన్నవాటికి తేడాలేమిటి? 
వ్యవసాయ రంగంలో అక్కడ అవినీతి అనేది లేదు. అక్కడి ప్రతి వ్యక్తి, కంపెనీ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయి. విత్తన చట్టాల నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఎవరైనా మోసం చేస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకునేలా నియంత్రణ వ్యవస్థలున్నాయి.

మనదేశంలో కొత్త విత్తన చట్టం రావడానికి ఎందుకు జాప్యం జరుగుతోంది? 
దేశమంతటా విత్తనాలు అమ్ముకునే స్వేచ్ఛ దేశంలో ఉంది. కొత్త విత్తన చట్టం ఆమోదం అంశం పార్లమెంటులో పెండింగులో ఉంది.

‘రైతు బంధు’ను ఐరాస విభాగమైన ఎఫ్‌ఏఓ ప్రత్యేకంగా గుర్తించడానికి కారణాలు? 
ప్రపంచవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం సృజనాత్మకంగా, వినూత్నంగా అమలు చేస్తున్న పథకాలను గుర్తించడానికి ఎఫ్‌ఏఓ ప్రతిపాదనలు ఆహ్వానిస్తే 203 దేశాల నుంచి 700 దాకా వచ్చాయి. వాటిని వడపోసి 20 ప్రతిపాదనలను గుర్తించి సదస్సులో చర్చించారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ ఉంది. పంట సాగు చేయడానికి అవసరమైన కనీస పెట్టుబడి నేరుగా రైతుకు నగదు రూపంలో ఇవ్వడం కొత్త అంశంగా వారు గుర్తించారు. దీనికి నన్ను భారత, తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధిగా ఆహ్వానించారు.

దేశంలోనే అత్యధికంగా విత్తనాలు తెలంగాణలో పండిస్తున్నారు. కానీ ఇక్కడి రైతులకు నాసిరకం విత్తనాలనే అమ్ముతున్నారు? 
దేశంలోనే అత్యధికంగా 400 విత్తన కంపెనీలు తెలంగాణలో ఉన్నందున ఇక్కడ విత్తనోత్పత్తి అధికం. కానీ సాధారణ పంటను చిన్న కంపెనీలు విత్తనాలుగా అమ్మేస్తున్నాయి. వీటిని తెలియక కొని రైతులు నష్టపోతున్నారు. అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తప్పవు.

హైదరాబాద్‌లో ఇస్టా ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ విత్తన సదస్సు వల్ల రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనాలేమిటి? 
తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా మార్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. ఎఫ్‌ఏఓలోని 203 దేశాల వారికి వర్తమానం పంపి అందరినీ ఆహ్వానిస్తామని ఎఫ్‌ఏఓ అధికారులూ చెప్పారు. ఇస్టాలో సభ్యత్వమున్న 83 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పెద్ద కంపెనీల ప్రతినిధులు వస్తారు. వారితో ఇక్కడి కంపెనీలు, రైతులు, అధికారులతో చర్చాగోష్ఠి ఉంటుంది. దీనివల్ల ప్రపంచమంతటా మన విత్తులకు గుర్తింపు వస్తుంది.

తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చడానికి ప్రణాళికలేమిటి? 
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధ్రువీకరణ సంస్థలను పటిష్ఠం చేస్తున్నాం. అధునాతన విత్తన పరీక్షల ప్రయోగశాలను మరో 3 నెలల్లో ప్రారంభించబోతున్నాం. అంతర్జాతీయ విత్తన నాణ్యత ప్రమాణాల ప్రకారం నాణ్యత ధ్రువీకరణ పత్రం ఇస్తాం. దీన్నిచూపి 83 దేశాల్లో ఎక్కడికైనా విత్తనాలను ఎగుమతి చేయవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.