close

ప్ర‌త్యేక క‌థ‌నం

పొగమంచు గండం

దారి కనిపించక రోడ్డు ప్రమాదాలు
పలువురి మృత్యువాత
అతి వేగం, రోడ్డుపై నిలిపివేయడం ప్రమాదకరం
ప్రయాణం వాయిదానే మంచిది

పొగమంచు ప్రాణాలు తీస్తోంది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. తెల్లవారుజామున దారి పొడవునా దట్టంగా కమ్మేసే పొగమంచు కారణంగా ఎదురుగా ఏ వాహనం వస్తుందో, ఎక్కడ ఏముందో కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో పొగమంచుతో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈనాడు - అమరావతి, హైదరాబాద్‌

రోడ్డుపై దట్టంగా మంచు కమ్మేయడంవల్ల మనకు ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎదురుగా వస్తున్న, రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టడమో,  డివైడర్లను ఢీకొట్టడమో జరిగి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా వాహనాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడంవల్ల బోల్తాపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

మంచుకు వేగం తోడైతే మరింత ముప్పు
సాధారణంగా మనముందున్న రోడ్డు సరిగ్గా కనిపించనప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్తే అంత మంచిది. అలా చేస్తే ఎదురుగా ఏదైనా అవరోధం వచ్చినా బ్రేకు వేసిన వెంటనే వాహనం ఆగిపోతోంది. ఫలితంగా ప్రమాదాన్ని నివారించొచ్చు. అదే మంచుకు వేగం తోడైతే ముప్పు మరింత పెరుగుతుంది. వేగంగా వెళ్తున్న వాహనాన్ని అకస్మాత్తుగా ఆపడం కష్టమై ప్రమాదానికి దారి తీస్తుంది.

పసుపు రంగు లైట్లతో ప్రయోజనం...
వాహనాలకు ప్రస్తుతమున్న లైట్లకు అదనంగా పసుపు లైట్లు (యెల్లో లైట్లు) ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మంచులో వాహనం నడిపేటప్పుడు ఈ పసుపు లైట్లు వినియోగించడంవల్ల వెలుతురు ఎక్కువ పడి దారి స్పష్టంగా కనిపిస్తుందని వారు వివరిస్తున్నారు.

ఇలాంటి చర్యలొద్దు
* వేగంగా వాహనాన్ని నడిపితే మంచును తప్పించుకుని త్వరగా వెళ్లిపోవచ్చని కొందరు భావిస్తారు. అది సరికాదు.
* దట్టమైన మంచు కురుస్తున్నప్పుడు రోడ్డు మధ్యలో వాహనాన్ని నిలపడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు.

 

ఏం చేయాలి?

పొగమంచు గండం

* దట్టంగా పొగమంచు కురుస్తున్నప్పుడు వాహనాన్ని నడపటం అత్యంత ప్రమాదకరం. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. వీలైనంత వరకూ మంచు కురిసే సమయంలో వాహన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.
* వాహనం నడిపేటప్పుడు ముందున్న దారి ఎన్నిమీటర్ల దూరం కనిపిస్తుంది.. బ్రేకు వేస్తే ఎంత దూరంలో వాహనం ఆగుతుందనే దానిపై పూర్తి స్పష్టత ఉండాలి.
* ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ మంచు ఉంటే సురక్షిత ప్రదేశంలో వాహనాన్ని నిలిపి తగ్గే వరకూ వేచి చూడటం మంచిది.
* అద్దంపై పడుతున్న మంచును తొలగించేలా వైపర్లు పనిచేస్తున్నాయా? లేదా చూడాలి.
* అతి తక్కువ వేగంతో వెళ్లాలి. లైట్లు తప్పనిసరిగా ఆన్‌చేసి ఉంచాలి.
* ఇతర వాహనాలను అధిగమించే (ఓవర్‌టేక్‌) చేసే ప్రయత్నం చేయొద్దు.
* కూడళ్లవద్ద ఆగి ఒకసారి చూసుకుని ముందుకెళ్లాలి.

త్రుటిలో తప్పిన ముప్పు

పొగమంచు గండం

హైదరాబాద్‌ నుంచి గురువారం ఉదయం 6 గంటలకు ఏటూరునాగారం వచ్చిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు అక్కణ్నుంచి మంగపేటకు బయలుదేరింది. జీడివాగు వద్ద పొగమంచు కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న ఇసుక లారీని తప్పించే క్రమంలో వాగు కల్వర్టు రక్షణ గోడను ఢీకొంది. అనంతరం కొంతదూరం దూసుకెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు అదుపుతప్పి వాగులో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

- న్యూస్‌టుడే, ఏటూరునాగారం

పొగమంచు గండం

పొగమంచు గండం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.