close

ప్ర‌త్యేక క‌థ‌నం

చిన్న మదుపర్లే అండ

కొత్త ఏడాదిలో అన్నీ సానుకూలమే..
మిడ్‌క్యాప్‌లో మంచి అవకాశాలు
ఎన్‌బీఎఫ్‌సీలకు నగదు కొరత తీరింది
రాధికా గుప్తా (సీఈఓ, ఎడెల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌)
ఈనాడు ఇంటర్వ్యూ

‘స్వల్పకాలంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ పటిష్ఠంగా ఉంది. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లినా.. దేశీయ పెట్టుబడులు మార్కెట్‌ ర్యాలీకి ఊతం ఇస్తున్నాయి. కొంతకాలంగా ఉన్న అనిశ్చితి కూడా ఇప్పుడు లేదు.. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి, కొత్త ఏడాదిలో మార్కెట్‌లో పూర్తి సానుకూల పరిస్థితులే కొనసాగుతాయి’ అని అంటున్నారు ఎడెల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రాధికా గుప్త్తా. చిన్న మదుపరులు ప్రత్యామ్నాయ పెట్టుబడి అంటే మ్యూచువల్‌ ఫండ్లవైపే చూస్తున్నారని అంటున్న ఆమె ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈనాడు - హైదరాబాద్‌

? రానున్న ఐదారు నెలలు మార్కెట్‌లో అనిశ్చితి ఉంటుందంటున్నారు.. నిజమేనా? స్వల్ప, మధ్య కాలంలో మార్కెట్‌ గమనం ఎలా ఉండబోతోంది?
మార్కెట్‌ను ఎప్పుడూ స్వల్పకాలిక దృష్టితో చూడకూడదు. కొన్ని వారాల క్రితం వరకూ రెండు మూడు వార్తలు సూచీలను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అవి చల్లబడ్డాయి. దీంతో మార్కెట్‌ కాస్త అటూ ఇటూగానైనా సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళ్తోంది. ముడి చమురు ధర తగ్గుతోంది. రూపాయి విలువలోనూ పెద్ద మార్పులు లేవు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. కాబట్టి, స్వల్పకాలంలో కాస్త దిద్దుబాటుకు గురైనా.. మధ్య, దీర్ఘకాలంలో ఆశాజనకంగానే ఉండబోతోంది. ఇక రాబోయే ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి.. రాజకీయ పరిణామాల మాట ఎలా ఉన్నా.. స్థిరమైన ప్రభుత్వం, సంస్కరణలను కొనసాగించడం, మౌలిక వసతుల కల్పన ఇవే మార్కెట్‌కు అవసరం.

? అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు పెరగడం, ముడి చమురు ధరల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఎలా ఉండబోతోంది?
ముందుగా ముడి చమురు ధర 50-65 డాలర్ల మధ్య ఉంటే మనకు మంచిది. అప్పుడు రూపాయి కూడా స్థిరంగా ఉంటుంది. ఫెడ్‌ వడ్డీ రేట్లు గతంలోలా ప్రభావితం చేయడం లేదు. గమనించాల్సిందేమిటంటే.. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయంటే.. ఆ దేశ ఆర్థికాభివృద్ధి బాగున్నట్లే. అక్కడ అభివృద్ధి సానుకూలంగా ఉంటే.. ప్రపంచలోని చాలా దేశాలు దానికి తగ్గట్టుగానే స్పందిస్తాయి. ఇంకో విషయం.. గత కొంతకాలంగా విదేశీ పెట్టుబడిదారులు ఇక్కడి మార్కెట్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో దేశీయంగా నెలకు రూ.8,000 కోట్ల వరకూ ఫండ్ల సిప్‌ రూపంలోనే వస్తున్నాయి. అంటే చిన్న మదుపర్ల పెట్టుబడులే ఇక్కడి మార్కెట్‌కు అండనిస్తున్నాయి.

? బ్యాంకింగేతర రుణ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం ముగిసిందని అనుకుంటున్నారా? ఇప్పుడు వీటి పరిస్థితి ఏమిటి?
ఎన్‌బీఎఫ్‌సీలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిన మాట వాస్తవమే. అయితే దీన్ని సంక్షోభమని అనుకోలేం. ఐఎల్‌అండ్‌ ఎఫ్‌ఎస్‌ పరిణామం తర్వాత ఒకటి రెండు సంస్థలే చిక్కులు ఎదుర్కొన్నాయి. ఈ రంగంలో పలు పటిష్ఠమైన కంపెనీలు ఉన్నాయి. మంచి రుణ ఖాతాలు ఉన్నవీ, వైవిధ్యమైన వ్యాపారాల్లో ఉన్నవాటికి ఎలాంటి ప్రతికూలతలూ ఎదురవ్వలేదు.  ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు కూడా మంచి ఫలితాలనే ఇచ్చాయని చెప్పొచ్చు.

? గత ఏడాదిలో స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్ల నుంచి ఆశించిన రాబడి రాలేదు. మున్ముందు  ఇలాంటిదే కొనసాగుతుందా?
ఏడాది కాలంలో సెన్సెక్స్‌ 6% పెరిగితే.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 14%, స్మాల్‌ క్యాప్‌ 24% వరకూ తగ్గాయి. వీటిలో పెట్టుబడులు ఉన్న మ్యూచువల్‌ ఫండ్లు కూడా ఈ సూచీలనే అనుసరించాయి. ప్రతికూల రాబడి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఇప్పుడలా లేదు. మళ్లీ స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్లకు మంచి రోజులు రాబోతున్నట్లు చెప్పొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లను పునఃవర్గీకరణ చేసిన తర్వాత లార్జ్‌ క్యాప్‌ ఫండ్లతో పోలిస్తే.. మిడ్‌ క్యాప్‌ ఫండ్లకు అధిక కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి, ఐదారేళ్ల వ్యవధితో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు వీటిని పరిశీలించవచ్చు. ఈ విభాగంపై ఉన్న నమ్మకంతో ఎడెల్‌వైజ్‌ నుంచి కొత్త మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను జనవరిలో తీసుకురాబోతున్నాం.

? మ్యూచువల్‌ ఫండ్ల వ్యయ నిష్పత్తి (టీఈఆర్‌) తగ్గించాలని సెబీ నిర్ణయించింది కదా! దీని ప్రభావమెలా ఉండబోతోంది.
కచ్చితంగా ఇది మ్యూచువల్‌ ఫండ్ల మదుపరులకు మంచిదే. ఈ తగ్గించిన నిష్పత్తి వారి రాబడిలో కలుస్తుంది. అయితే పెద్ద ఫండ్‌ సంస్థల ఆదాయంపై ఈ తగ్గింపు ప్రభావం పడొచ్చు.

? కొత్త ఏడాదిలో ఏ రంగాలు సానుకూలంగా ఉండొచ్చు
పరిస్థితులను బట్టి రంగాలను నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అయితే, నిర్మాణం, ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లలో 25-30% వరకూ దిద్దుబాటు జరిగింది. వీటిపైనా దృష్టిపెట్టొచ్చు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు అంత సానుకూలంగా కనిపించడం లేదు.

? మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడుల ధోరణి ఎలా ఉంది?
నోట్ల రద్దు తర్వాత ఆర్థిక పెట్టుబడులపై అవగాహన పెరిగింది. ఫండ్లలో పెట్టుబడులు మొదటి స్థానంలోకి వచ్చాయి. మన దేశ జీడీపీలో కేవలం నాలుగు శాతమే ఫండ్ల వాటా ఉంది. చాలా దేశాల్లో ఇది 40% వరకూ ఉంది. అంటే.. ఇక్కడ ఫండ్లలో మదుపు చేసేందుకు అపార అవకాశాలున్నాయి. అధికశాతం మదుపరులు ఫండ్లలో పెట్టుబడులను 5-6 ఏళ్లకు మించి కొనసాగిస్తున్నారు. వీరికి దాదాపు 12 శాతం వరకూ రాబడి గిట్టుబాటు అవుతోంది. పన్నుల పరంగా రాబడిపై అధిక భారమేమీ లేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మ్యూచువల్‌ ఫండ్లు పెట్టుబడులన్నింటికీ ప్రత్యామ్నాయంగా మారతాయని చెప్పొచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.