close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎటువైపు సాగుతుంది?

ఈ బడ్జెట్‌ రైతు నేస్తమా?
నేరుగా నగదు బదిలీ చేస్తారా..

రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యమని చెబుతున్న మోదీ సర్కారు- ఫిబ్రవరి ఒకటో తేదీన వ్యవసాయ అనుకూల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందా? రైతులకు వివిధ రూపాల్లో అందిస్తున్న రాయితీలకు బదులుగా నేరుగా నగదు బదిలీ ప్రతిపాదన తెస్తుందా? అన్నదాతకు ఆదాయాన్ని చేకూర్చడం, వడ్డీలేని రుణాలు ఇవ్వడం లాంటి హామీలు ఇస్తుందా? మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలుతిన్న భాజపా సర్కారు తాము రైతు అనుకూలమనే భ్రమ కల్పించడానికి ఈ బడ్జెట్‌లో ప్రయత్నించొచ్చని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రుణమాఫీని అమలుచేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే హామీఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో దేశవ్యాప్తంగా కొత్త పథకాన్ని అమలుచేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు రైతు అనుకూల వ్యూహాలకు పదునుపెట్టింది.

రుణమాఫీ పరిష్కారమా?

రైతన్నను ఆదుకోవడానికి రుణమాఫీని ఒక దివ్యౌషధంగా వివిధ రాష్ట్రాలు ప్రకటించేస్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్న దాతను ఆదుకోవడానికి రుణమాఫీ ఉపకరించేదే అయినా.. కేవలం దీంతోనే వారి సమస్యలు తీరిపోవని, కేవలం కొద్దిమంది రైతులే రుణమాఫీ వల్ల లబ్ధిపొందుతారని పలువురు ఆర్థికవేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. కారణాలు...

1. జులై 2015- జూన్‌ 2016 మధ్య కేవలం 43.5 శాతం మంది రైతులే రుణాలు తీసుకున్నట్లు నాబార్డ్‌ గణాంకాలు తేటతెల్లంచేస్తున్నాయి. వీరిలోనూ సంస్థాగత రుణాలు తీసుకున్న వారు 69.7 శాతం మంది. ఈ లెక్కన దేశంలోని మొత్తం రైతుల్లో సంస్థాగత రుణాలు తీసుకున్న వారు 30% మంది. కేంద్రం రుణమాఫీ అమలుచేస్తే కేవలం 30% మందికే లబ్ధిచేకూరుతుంది. మిగతా 70% మంది ఈ ప్రయోజనానికి దూరం అవుతారు.

2. రుణమాఫీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయం ఉంది. రుణమాఫీ లాంటి డిమాండ్ల కోసం నిధులు మళ్లిస్తూ పోతే.. అభివృద్ధి పనులు కుంటుపడతాయి.

3.రుణమాఫీ దేశ రుణ సంస్కృతికి గొడ్డలి పెట్టులాంటిదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రుణ గ్రహీతలు తాము అప్పుతీసుకునే సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. వారు ఎలాంటి నైతిక బాధ్యత వహించరంటున్నారు.

తెలంగాణ రైతుబంధు ఆదర్శం
రైతన్నను ఆదుకోవడానికి కొన్ని రాష్ట్రాలు వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకాన్ని అమలుచేస్తోంది. ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు రైతు ఖాతాకే నేరుగా నగదు జమచేస్తోంది. విత్తనాలు, ఎరువులు కొనడానికి రైతుకు ఇది ఉపకరిస్తోంది. ఇది విజయవంతమైన పథకంగా మన్ననలందుకుంది. దాదాపు 90 శాతం మంది భూ యజమానులకు ఇది చేరింది. అయితే ఈ పథకం కౌలు రైతుల్ని విస్మరించిందన్న విమర్శ ఉంది. ఒడిశా ప్రభుత్వం రైతు సహాయ, జీవనభృతి, ఆదాయ పెంపు(కేఏఎల్‌ఐఏ) పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం కింద కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఒకసారి చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎలాంటి రికార్డుల్లేవు కాబట్టి ఈ రెండు కేటగిరీలను గుర్తించడమే పెద్ద సమస్య. తెలంగాణ, ఒడిశా తరహా పథకాలు.. అవినీతిని తగ్గిస్తాయని, మార్కెట్‌ మాయాజాలానికి అడ్డుకట్టవేస్తాయని, రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగా లబ్ధిపొందుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నేరుగా నగదు బదిలీ రైతుకు లాభమా?
ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేసినా.. అది రైతులందరికీ చేరదనే అభిప్రాయమూ ఉంది. కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఎలా? అనేది పెద్ద ప్రశ్న. దేశంలో దాదాపు 14.6 కోట్ల రైతు కుటుంబాలున్నాయి. ప్రభుత్వం నేరుగా నగదు బదిలీచేస్తే వీరిలో 10 కోట్ల మంది రైతులు లాభపడొచ్చు. దీనికి రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయింపులు అవసరమవుతాయి. అయితే ప్రస్తుతం రాయితీలు, ఇతరత్రా రూపాల్లో ప్రయోజనాలు పొందుతున్న రైతుల్లో కనీసం మూడోవంతు మందికి నగదు బదిలీ అందదు. దేశంలో 56% మంది గ్రామీణులకు వ్యవసాయ భూమి లేదు. ఝార్ఖండ్‌, బిహార్‌, గుజరాత్‌, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో భూ రికార్డుల డిజిటలైజేషన్‌ పూర్తికాలేదు. కాబట్టి నిజమైన లబ్ధిదారులకు నగదు బదిలీ చేరవేత కష్టంతో కూడుకున్న పని.

మద్దతు ధర పెంచితే.. 
వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి మద్దతు ధరల(ఎంఎస్‌పీ)ను పెంచటమన్నది తరచూ వినిపించే డిమాండేకానీ.. దీనివల్ల మార్కెట్లు ఇబ్బందుల్ని ఎదుర్కొంటాయని, ప్రభుత్వాల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయి, విపరీత నష్టాలు చేకూరుతాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. మార్కెట్‌ చేయగలిగిన మిగులు పంటలు ఉన్న రైతులకే ఎంఎస్‌పీ వల్ల ఉపయోగం తప్ప మెజారిటీ రైతులకు దీనివల్ల ప్రయోజనం లేదంటున్నారు.

ఏం చేస్తారు?
వ్యవసాయ సంక్షోభానికి కేంద్రం ఈ బడ్జెట్లో ఎలాంటి పరిష్కారాలతో ముందుకు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు పెద్దపీట వెయ్యటం, పెట్టుబడులు పెంచటం, సుస్థిర ధరల విధానాన్ని అమలుచేయటం.. లాంటి దీర్ఘకాలిక చర్యలతో సాగు రంగంలో సమూల మార్పులు తెచ్చి, రైతుకు భరోసా కల్పించే సంస్థాగత చర్యలు చేపట్టాలనేది ఆర్థిక, వ్యవసాయ రంగ నిపుణుల సూచన. మరి ఎన్నికల ముంగిట మోదీ సర్కారు దీర్ఘకాలిక పరిష్కారాలతో ముందుకు వస్తుందా? తాత్కాలిక ఉపశమనాలతో సరిపెడుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

2017 ఏప్రిల్‌ నుంచి దేశంలోని 8 రాష్ట్రాలు రుణమాఫీని ప్రకటించాయి. ఈ మొత్తం రూ.1.9 లక్షల కోట్లు



ప్రస్తుతం రాయితీలు, రైతు మద్దతు పథకాలకు కేంద్రం రూ.98,100 కోట్లు కేటాయిస్తోంది. పంటల బీమా, ఎరువుల రాయితీలు, తక్కువ వడ్డీకి రుణాలు ఇందులో ఉన్నాయి. 



మొత్తం 14.6 కోట్ల మంది రైతుల్లో పంటల బీమాను వినియోగించుకున్నది 35% మందే.
(2015-16 వ్యవసాయ గణాంకాలు)

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.