close

ప్ర‌త్యేక క‌థ‌నం

గొడ్డళ్ల గాండ్రింపు

అడవిలో అక్రమార్కులు
వేల ఎకరాల్లో కలప దోపిడీ.. 30 శాతం అడవి మాయం
తెలంగాణవ్యాప్తంగా అరణ్యాల్లో నేలకొరుగుతున్న భారీవృక్షాలు
చీకటిపడితే చెలరేగిపోతున్న అక్రమార్కులు
అడ్డంగా నరికి అయినకాడికి బేరం
అటవీ, పోలీసు అధికారులకూ వాటాలు
‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన

అక్కడ... చీకటి పడగానే గొడ్డళ్లు గాండ్రిస్తాయి... రంపాలు ఘీంకరిస్తాయి
ఆ రెండింటి మరణఘోషల మధ్య ఆకాశాన్నంటుకోవాలన్న ఆశతో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న వటవృక్షాలు నిట్టనిలువునా కుప్పకూలుతున్నాయి
అందుకే అది చీకటి రాజ్యం
అధికారం గుర్రుపెట్టి నిద్రపోయే, అరాచకం ఒళ్లు విరిచి వికటాట్టహాసం చేసే ఆటవిక రాజ్యం

ఈనాడు - హైదరాబాద్‌

క్కడ అడవి అడవిలాగానే ఉంది.. అని అధికారుల లెక్క. కానీ అందులో వెలకట్టలేని వృక్షసంపద మాత్రం అవసానదశకు చేరుకుందన్నది క్షేత్రస్థాయిలో కళ్లకు కడుతున్న వాస్తవం. అడవుల్లో యథేచ్ఛగా సాగిపోతున్న అక్రమాలను పరిశీలించేందుకు ‘ఈనాడు’ బృందం రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పర్యటించింది. రోడ్డు మీద నుంచి చూస్తే అడవి ఉన్నట్లుగా ఉంది. లోపలికి వెళ్లి చూస్తే అడ్డంగా నరికేసిన చెట్లు.. వాటి మొదళ్లు అడవి తల్లి గుండెకోతకు సాక్ష్యంగా మిగిలాయక్కడ. భయం మాటున కొంత, భక్తితో కొంత, జేబు నింపుకోవాలన్న ఆశతో మరికొంత.. వెరసి అటవీశాఖ అధికారులకు తెలిసే ఈ దోపిడీ సాగుతుందని తేటతెల్లమైంది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ అటవీ బీటు పరిధిలో ఒకప్పుడు అడుగడుగునా కనిపించే టేకు చెట్టు ఇప్పుడు అరుదైన వృక్షం జాబితాలోకి చేరిపోయింది. పలు జిల్లాల్లో దాదాపు ఇదే దుస్థితి.

 

అడవులు కాపాడాలి. కొట్టేసేవారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టాలు మార్చాలి. శిక్షలు పెంచాలి
- అటవీశాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం

అడివంతా ఆగమాగం
వలసాల వీరభద్రం, సుతారపు సోమశేఖర్‌
ఈనాడు ప్రత్యేక ప్రతినిధులు

టుచూసినా పచ్చదనం.. దట్టమైన అడవి.. దశాబ్దాలుగా ఆ గాలి, నీరు పీల్చుకుని ఎదిగిన వృక్షరాజాలు, వాటిని అల్లుకుని పొదలు, పండ్ల మొక్కలు.. వాటిమీద ఆధారపడి బతికే వన్యప్రాణులు.. ఇదంతా తెలంగాణ అడవుల్లోని ఒకనాటి సుందర దృశ్యం. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వేలాది ఎకరాల్లో చెట్లు అక్రమార్కుల గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్నాయి. అధికార యంత్రాంగం కాసుల మోజులో కళ్లు మూసుకుంటే అడవి దొంగలు అందినకాడికి ఆరగించేస్తున్నారు. దీంతో అడివంతా ఆగమాగమవుతోంది. ఈ అక్రమార్కుల ధాటికి తెలంగాణలో ఒకప్పుడు దట్టమైన అడవులున్న ప్రాంతాలు సైతం మైదానాలుగా మారిపోయాయి. 1988లో 11,689 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులు ఉంటే 2014 నాటికి అది 8,076 చ.కిమీకి తగ్గిపోయాయి. రెండున్నర దశాబ్దాల్లోనే 3,613 చ.కిమీ (30 శాతం) క్షీణించాయి. అడవులు అధికంగా ఉన్న పూర్వ ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువ జరుగుతోంది. ‘24 శాతం అటవీ ప్రాంతం ఉన్నట్లుగా చెబుతున్నా.. పచ్చదనం 12 శాతానికి మించి లేదు. సహజంగా చెట్లు పెరిగే అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా ఉపయోగం ఉండదు’ అంటూ ఇటీవల అటవీశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అడవుల విధ్వంస తీవ్రతకు నిదర్శనం.

ఇచ్చోడలో అడవే మాయం
జాతీయ రహదారిని ఆనుకున్న ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం రెండు దశాబ్దాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతం. ఇప్పుడు అడవి ఎక్కడ ఉందా అని వెతకాల్సిన దుస్థితి. పక్కన పెంబి, ఇతర మండలాల్లోనూ అడవిని మాయం చేస్తున్నారు. సిరికొండ మండలం భీంపూర్‌ గ్రామం నుంచి 2.5 కి.మీ వరకూ అడవి అంతరించిపోయింది. చుట్టుపక్కల పాతికేళ్ల క్రితం పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి సహా వివిధ రకాల వన్యప్రాణులు సంచరించేవి. ఇప్పుడు అడవిపందులు మాత్రమే కనిపిస్తున్నాయి. స్మగ్లర్లు, ఆక్రమణల ధాటికి రెండువేల ఎకరాల అడవి మాయమయింది. జన్నారం రేంజ్‌లో మహ్మదాబాద్‌ బీట్‌లో భారీ వృక్షాలతో కళకళలాడిన పెద్ద గుట్ట నామరూపాలు లేకుండా పోయింది. ఖానాపూర్‌, కడెం మండలాల్లో రాత్రివేళలో చెట్లను నరికి సైకిళ్లు, ఎడ్లబళ్లపై తరలిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని బోథ్‌, నేరడిగొండ, బజార్‌ హత్నూర మండలాలకు మహారాష్ట్రలోని చిక్లి నుంచి ముల్తానీలు వచ్చి చెట్లను నరికేస్తున్నారు. బాసర మొదలుకుని భద్రాచలం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి తీరప్రాంతంలో కలప స్మగ్లింగ్‌ విచ్చలవిడిగా సాగుతోంది.

నిమిషాల్లో నేలకూలుస్తూ
స్మగ్లర్లు ఎక్కువగా రాత్రి వేళలో చెట్లు నరికేస్తున్నారు. ఎక్కువ శ్రమపడకుండా పెట్రోల్‌తో నడిచే పవర్‌సాతో నిమిషాల్లో చెట్లను నేలకూలుస్తున్నారు. కొన్నిచోట్ల మర రంపాలనూ వాడుతున్నారు. అడవిలో నరికిన చెట్లను బయటకు తెచ్చేందుకు సైకిళ్లు, ఎడ్లబండ్లు, కొన్నిచోట్ల మోటారుసైకిళ్లు  ఉపయోగిస్తున్నారు. పొలాలు, ఇతర రహస్యప్రదేశాల్లో దాచిపెడుతున్నారు. గోదావరి తీరంలో.. దుంగల్ని రాత్రి వేళలో నదిలో వేసి తెల్లవారుజామున నదికి మరోవైపు నుంచి తీసుకుంటారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఖానాపూర్‌, కడెం తదితర మండలాల్లో నరికే చెట్లను గోదావరి నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

‘మహా’ మతలబు
అడవుల్లో అక్రమంగా నరికేస్తున్న కలప లారీలకు లారీలు రోడ్డు మార్గంలో దర్జాగా తరలిపోతుంది. మహారాష్ట్ర ప్రభుత్వ కలప డిపోల్లో వేలం పద్ధతిలో టేకు అమ్ముతారు. నాణ్యతను బట్టి క్యూబిక్‌ మీటర్‌ రూ.25 వేల నుంచి రూ.80 వేల వరకు ధర పలుకుతుంది. నాసిరకం, స్క్రాప్‌ ధర ఇంకా తక్కువ. మహారాష్ట్రలో విక్రయించే కలపకు ఇచ్చే పర్మిట్లలో అది ఏ రకమైందో రాయకుండా పరిమాణమే ఉంటుంది. దీన్ని తెలంగాణలోని కొందరు సామిల్లు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ నాసిరకం, స్క్రాప్‌ కొనుగోలు చేసి పర్మిట్‌ తీసుకుంటారు. ఇక్కడి అడవుల్లో నరికిన విలువైన కలపతో కలిపేస్తూ మహారాష్ట్ర పర్మిట్ల పేరుతో సక్రమం చేసుకుంటున్నారు.

ఆ రెండుచోట్ల అత్యధికం
తెలంగాణ వ్యాప్తంగా 12 అటవీ సర్కిళ్లున్నాయి. సింహాలు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు తిరిగే పులుల అభయారణ్యాలు (టైగర్‌ రిజర్వులు), దట్టమైన అటవీ ప్రాంతాల్లో అటవీ నేరాలు అధికంగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2017-18లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 12,293 కేసులను పరిశీలిస్తే- కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో 2,597.. కొత్తగూడెం సర్కిల్‌లో 2,878.. రెండు చోట్ల కలిపి 40 శాతం పైగా ఉన్నాయి.

ఇన్నాళ్లూ పట్టుకోలేదే?
సీఎం ఆదేశాల నేపథ్యంలో అటవీ అధికారులు దాడులు చేస్తున్నారు. గత 20 రోజుల్లో 554 గ్రామాలు, 387 సామిల్లుల్లో తనిఖీ చేశారు. 528 మంది వడ్రంగి పనివారిని ఆరా తీశారు. 309 దూగోడ యంత్రాలను పరిశీలించి 449 కేసులు నమోదు చేశారు. గడ్డివాముల్లో, పొలాల్లో, అడవుల్లో 480 క్యూబిక్‌ మెట్రిక్‌ టన్నుల కలప స్వాధీనం చేసుకున్నారు. ఈ గణాంకాల్ని చూసి ‘ఇన్నాళ్లూ ఈ కలప దుంగలు ఎక్కడున్నాయి? ఇంతకాలం ఎందుకు పట్టుకోలేదు?’ అని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. నిజంగా జరిగే అక్రమాల్లో పట్టుబడుతున్నవి 5 శాతం కూడా ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ జోక్యం

లాభాలు ఆర్జించిపెట్టే ఈ వ్యాపారంలో రాజకీయ జోక్యం కూడా పెరిగిపోతోంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కలప కోత మిల్లుల యజమానులు ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. కలప అక్రమ రవాణాకు సంబంధించి పోలీసు శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. నిజామాబాద్‌ జిల్లా ముజాహిద్‌నగర్‌లో ఉన్న బిలాల్‌ సామిల్‌, సోహిల్‌ సామిల్‌, డెక్కన్‌ సామిల్‌, నిజామాబాద్‌ సామిల్‌ల యజమానులు అక్రమ కలప వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కలప అక్రమ రవాణాకు సంబంధించి గతంలో నిజామాబాద్‌ పోలీసులు అఫ్జల్‌ అనే నిందితుడ్ని అరెస్టు చేశారు. బిలాల్‌ సామిల్‌ యజమాని, నిజామాబాద్‌ డిప్యూటీ మేయర్‌ ఫహీమ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బలవంతంగా అఫ్జల్‌ను తీసుకెళ్లారు. దీంతో ఫహీమ్‌పై కూడా కేసు నమోదు చేశారు. కలప అక్రమ రవాణాలో భాగంగా నిజామాబాద్‌కు, మహారాష్ట్రలోని నాందేడ్‌కు మధ్య ఉన్న చెక్‌పోస్టులను ఫహీమ్‌, సోహిల్‌ సామిల్‌ యజమాని మిస్బా బేగ్‌ తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

అంతా కుమ్మక్కై..

* కలప అక్రమ రవాణాలో అటవీశాఖతోపాటు పోలీసులు కూడా కుమ్మక్కైనట్లు పోలీసుశాఖ నివేదికలో పేర్కొనడం గమనార్హం.

* ఆరేళ్లుగా నిజామాబాద్‌లోనే పని చేస్తూ ఒకసారి సస్పెండయిన ఎఫ్‌డీవో, అతని కింద పనిచేసే రేంజి అధికారి, డిప్యూటీ రేంజి అధికారి కూడా కలప అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైనట్లు నివేదికలో ఉంది. ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తే వీరు ముందుగానే కోతమిల్లుల యజమానులు, అక్రమ రవాణాదారులకు సమాచారం ఇచ్చేస్తారని అందులో స్పష్టం చేశారు.

* అటవీశాఖలో స్థానిక, విజిలెన్స్‌, స్పెషల్‌ స్క్వాడ్‌ అధికారులకు కలిపి ఒక్కో సామిల్లు నుంచి ఏడాదికి రూ.5 లక్షల వరకు మామూళ్లు ముట్టజెబుతున్నారని సమాచారం. దీంతో కలప దొంగల గుట్టుమట్లన్నీ తెలిసినా అటవీశాఖ అధికారులు కిమ్మనడం లేదన్నది బహిరంగ రహస్యం.

* స్థానిక పోలీసులు కూడా కొంతమంది కలప అక్రమార్కులతో కుమ్మక్కయ్యారు. ఇచ్చోడ సీఐ సతీష్‌, నేరడిగొండ ఎస్సై హరిశంకర్‌, సాయుధ ఎస్సై షకీల్‌పాషాలను ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్‌ చేశారు.

అడవిపై స్మగ్లర్ల ఉడుంపట్టు.. ప్రత్యేక కథనం రేపటి సంచికలో..

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.