close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఒత్తిడితో గుండె చిత్తు

  యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలు
  తాజాగా సికింద్రాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: అప్పటి వరకు ఆడుతూ..పాడుతూ..స్నేహితులతో గడుపుతూ.. అంతలోనే ఒక్కసారిగా గుండె ఆగిపోయి మృతి చెందడం లాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గతంలో హైదరాబాద్‌లో ఓ నేత కుమారుడు ఇంట్లో భోజనం చేస్తూ కుప్పకూలిపోయాడు. ఉద్యోగ వేటలో భాగంగా పరుగు పందెంలో అలసిపోయి మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. తాజాగా సికింద్రాబాద్‌లో ఓ కళాశాలలో ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూశాడు.

వీటికి కారణాలేమై ఉంటాయంటే...
* ర్యాంకులు... ఉద్యోగ వేట... చిన్నప్పటి నుంచి పొగతాగే అలవాటు.... శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలు చిన్నతనంలో హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి.
* పుట్టుకతోనే హృద్రోగ వ్యాధులున్నా సాధారణంగా వాటి లక్షణాలు అంత త్వరగా బయటకు కన్పించవు. తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పుడు గుండెల్లో సమస్య తలెత్తి కుప్పకూలిపోతుంటారని వైద్యులు తెలిపారు. ‘గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నరాలు కుంచించుకుపోతాయి. హార్ట్‌బీట్‌ 200-300కు చేరుకుంటుంది. కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతుంటారు’ అని వివరించారు.

తల్లిదండ్రులది కీలక పాత్ర
చాలా పాఠశాలలు, కళాశాలలు ర్యాంకుల కోసం విద్యార్థులకు లక్ష్యాలు నిర్దేశించి మరీ చదివిస్తున్నాయి. చదువంటే 24 గంటలపాటు పుస్తకాలు ముందేసుకొని కూర్చోటమే కాదు... మిగతా కార్యకలాపాలకూ సమయం కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర.

జంక్‌ఫుడ్‌ తెస్తున్న చేటు
* జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో 30 శాతం మంది పిల్లల లంచ్‌ బాక్సుల్లో జంక్‌ఫుడ్‌ ఉంటోంది. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం... కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌) 400-500కు పెరిగి ఒక్కసారిగా గుండెకు ముప్పు వాటిల్లుతోంది.
* కొందరు విద్యార్థులు పొగతాగడానికి అలవాటు పడుతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు సిగరెట్లు తాగినా సరే...అది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడానికి ఇదీ ఒక కారణం కావచ్చని పేర్కొంటున్నారు.

జాగ్రత్తలతో అడ్డుకట్ట...

* యువకుల్లో అకస్మాత్తుగా గుండె వైఫల్యానికి దాదాపు పది రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది హైపర్‌ ట్రోఫిక్‌ కార్డియోమయోపతి. దీంతో గుండె కండరం లావెక్కుతుంది. ఒక్కసారిగా సమస్య ఏర్పడి మృత్యువాత పడతారు.
* ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోవడం, గుండెదడతో చెమట పట్టడం, మెట్లు ఎక్కినప్పుడు గుండెల్లో నొప్పి రావడం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ఈసీజీ, 2డీ ఈకో, త్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకోవాలి.
* అవసరమనుకుంటే 24 గంటలపాటు గుండె పనితీరు పరిశీలించి సమస్యను నిర్థారించే వీలుంది.
* కుటుంబంలో ఇంతకుముందు ఒకరి కంటే ఎక్కువ మంది గుండె సమస్యలు ఉంటే వారి పిల్లల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ,
సీనియర్‌ ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్టు

చదువు ఒక్కటే ముఖ్యం కాదు

* విద్యార్థులకు చదువుతోపాటు రోజూ గంటపాటు వ్యాయామం అవసరం. మంచి ఆహారపు అలవాట్లు ముఖ్యం.
* ఒత్తిడికి లోను కాకుండా విద్యార్థులు తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి.
- డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి,
సీనియర్‌ కార్డియాలజిస్టు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.