close

ప్ర‌త్యేక క‌థ‌నం

సమర సింహపురి!

నెల్లూరు జిల్లాలో పోరు హోరు
సీట్లు పెంచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా
నెల్లూరు జిల్లా క్షేత్రపరిశీలన కథనం
పెమ్మసాని బాపనయ్య
నెల్లూరు జిల్లా నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

పెన్నానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎందరో ఉద్దండులకు నిలయం. ఈ జిల్లాకు చెందిన బెజవాడ గోపాలరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి... ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేశారు. సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య... ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఇక్కడివారే.  వర్తమాన రాజకీయాల్లోనూ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి గెలిచి రాజకీయాల్లో రాణించారు. గత ఎన్నికల్లో ఈ జిల్లా వైకాపా వెంట నడిచింది.  అభివృద్ధి-సంక్షేమం అనే అస్త్రాలతో జిల్లాపై జెండా ఎగర వేయాలని తెదేపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పార్టీలు... ఉద్దండులను, సీనియర్‌ నేతలను రంగంలోకి దించడంతో హోరాహోరీ పోటీ నెలకొంది. జనసేన ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో జనం మొగ్గు ఎటో తెలుసుకునేందుకు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పర్యటించి అందిస్తున్న కథనమిది...

నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల్లో ఈసారి పోరు ఉత్కంఠ రేపుతోంది. గతంలో ప్రత్యర్థులుగా ఉన్నవారిలో కొందరు ప్రస్తుతం మిత్రులయ్యారు. ఆనం, నల్లపురెడ్డి, మేకపాటి అందరూ వైకాపాలోనే ఉన్నారు. మేకపాటి గౌతంరెడ్డికి ఆత్మకూరులో ఆనం వర్గం, వెంకటగిరి నుంచి బరిలో దిగిన ఆనం రామనారాయణరెడ్డికి అక్కడ నేదురుమల్లి వర్గం సహకారం అందిస్తున్నాయి. తెదేపాలోనూ వైరి వర్గాలు ఒక్కటయ్యాయి. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న బీద మస్తాన్‌రావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కావలిలో ఒకతాటిపైకి చేరారు. ఆత్మకూరులో గతంలో ప్రత్యర్థులైన బొల్లినేని కృష్ణయ్య, కొమ్మి లక్ష్మయ్యనాయుడు కలసి పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి తెదేపాలో చేరిన పనబాక లక్ష్మి తిరుపతి తెదేపా ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీరాం మాల్యాద్రి తెదేపా బాపట్ల ఎంపీగా ఉన్నారు. మరోసారి అక్కడే బరిలోకి దిగారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇటీవలే తెదేపా నుంచి వైకాపాలో చేరి ఆ పార్టీ ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైకాపా ఏడు, తెదేపా మూడు చోట్ల గెలిచాయి. ఈసారి సీట్లు పెంచుకునేందుకు రెండు పార్టీలూ వ్యూహాలు పన్నుతున్నాయి.

సంక్షేమ పథకాలపైనే చర్చ
ప్రచారంలో ఇరు పార్టీలూ ఎన్నో అంశాలను ప్రస్తావిస్తున్నా తెదేపా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే అధికంగా చర్చ సాగుతోంది. పింఛన్ల పెంపు, పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ లబ్ధిదారుల ఓట్లు తమకే పడతాయని తెదేపా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఆయా పథకాల ప్రభావంపై వైకాపాలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. అధిక నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తమవుతోంది.

సర్వేపల్లి  గెలుచుకోవాలని ఒకరు... నిలుపుకోవాలని మరొకరు

తెదేపా: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
వైకాపా: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇలాకాలో ఆయనకు, వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. సోమిరెడ్డి ఇదే స్థానం నుంచి వరుసగా 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇక్కడ తెదేపా జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్నారు. సోమశిల జలాశయం కాలువ పనులు పూర్తి చేసి... చెరువులను నీటితో నింపడం, రహదారుల అభివృద్ధి, సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదం చేస్తాయన్న విశ్వాసంతో తెదేపా ఉంది. అభివృద్ధి పనులపై ఓటర్లలోనూ సంతృప్తి కనిపిస్తోంది. ‘ఏడాది ముందుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే తెదేపాకు తిరుగే ఉండేది కాదు’ అని పొదలకూరుకు చెందిన ఒక రైతు అభిప్రాయపడ్డారు. కొందరు మండల స్థాయి నేతలు పార్టీకి దూరం కావడం, మరికొందరు వైకాపాలో చేరడం... కొంత ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. వైకాపా అభ్యర్థి గోవర్ధన్‌రెడ్డి మరోసారి సోమిరెడ్డిని ఓడించాలని ఆనం వర్గీయుల సహకారంతో గట్టిగా కృషి చేస్తున్నారు.

వెంకటగిరి  ప్రతిష్ఠాత్మక బరి

తెదేపా: కురుగొండ్ల రామకృష్ణ 
వైకాపా: ఆనం రామనారాయణరెడ్డి
వెంకటగిరి నియోజకవర్గం పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ తెదేపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. వైకాపా అభ్యర్థిగా మాజీ మంత్రి, తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి పోటీకి దిగడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి జనార్దనరెడ్డి కుమారుడు వైకాపా తరఫున సీటు ఆశించినా ఇక్కడ ఆనం వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే దూకుడు స్వభావంపై కొంత అసంతృప్తి ఉన్నా అభివృద్ధి విషయంలో ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తమవుతుండటం విశేషం. ‘ఆయన దూకుడు కారణంగానే మా గ్రామాలకు నీళ్లు అందుతున్నాయి. రైతుల కోసం... ఆయన గట్టిగా పోరాడటం ఎలా తప్పవుతుంది’ అని రాపూరు మండలానికి చెందిన రైతులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామకృష్ణతో విభేదాల కారణంగా వెంకటగిరి రాజా సాయికృష్ణ వైకాపాలో చేరి, రామనారాయణరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దానికితోడు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శారద తెదేపా నుంచి వైకాపాలో చేరారు. జనార్దనరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అనుచర వర్గాన్ని కలుపుకొని ఆనం ప్రచారం సాగిస్తున్నారు. ‘చంద్రబాబు పరిపాలన బాగుంది. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వక తప్పదు.’ అని వెంకటగిరికి చెందిన వస్త్ర వ్యాపారి ఒకరు వ్యాఖ్యానించారు.

సూళ్లూరుపేట  పట్టుదలగా ముందుకు... పీఠమెక్కేందుకు...

తెదేపా: పరసా వెంకటరత్నం
వైకాపా: కిలివేటి సంజీవయ్య
ఎస్సీ రిజర్వుడు స్థానమైన సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఈసారైనా కైవసం చేసుకోవాలని తెదేపా పట్టుదలతో ఉండగా... దాన్ని నిలుపుకోవాలని వైకాపాకు మొదటి నుంచి అండగా నిలుస్తున్న సామాజిక వర్గం నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన సంజీవయ్య... జగన్‌ వస్తేనే నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ప్రచారం చేస్తున్నారు. తెదేపా అభ్యర్థిగా పరసా వెంకటరత్నం బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 3,700 ఓట్లతో ఈ స్థానం చేజారిపోయింది... ఈసారి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గెలుపును సొంతం చేసుకుంటామని తెదేపా చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో తెదేపా, గ్రామాల్లో వైకాపా బలంగా ఉన్నాయి. ‘రుణమాఫీ నాలుగు, అయిదు విడతల డబ్బు ఎన్నికల లోపు ఇస్తే మాట నిలబెట్టుకున్నారన్న భావన తెదేపాకు కలిసి వస్తుంది’ అని సూళ్లూరుపేటలో ఒక రైతు అభిప్రాయపడ్డారు.

నెల్లూరు గ్రామీణం కొత్త-పాత పోరు

తెదేపా: అబ్దుల్‌ అజీజ్
వైకాపా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్‌లో దాదాపు సగం ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. తెదేపా అభ్యర్థిగా మొదట ప్రకటించిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనూహ్యంగా వైకాపాలో చేరారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి తెదేపా అభ్యర్థిగా నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ను రంగంలోకి దింపారు. అభ్యర్థి ఖరారు ఆలస్యం కావడంతో ఈ స్థానం గెలుపు బాధ్యతలను మంత్రి నారాయణ భుజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. భారీగా అభివృద్ధి పనులు చేపట్టి రొట్టెల పండుగను బాగా నిర్వహించారన్న పేరు అబ్దుల్‌ అజీజ్‌కు ఉంది. ‘మనసులో వైకాపాను గెలిపించాలని ఉంది... కాకపోతే అబ్దుల్‌ అజీజ్‌ పోటీ చేస్తుండటంతో ఎవరి వైపు నిలవాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేయర్‌గా అజీజ్‌ బాగా పని చేశారన్న పేరు ఉంది’ అని నగరంలోని 30వ డివిజన్‌కు చెందిన ముస్లిం నేత ఒకరు చెప్పారు. ముస్లింల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి.

ఉదయగిరి పాత ప్రత్యర్థులే

తెదేపా: బొల్లినేని రామారావు
వైకాపా: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
తెదేపా నుంచి గెలిచిన బొల్లినేని వెంకట రామారావు, వైకాపా నుంచి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మరోసారి తలపడుతున్నారు. 2014లోనూ వీరే పోటీపడ్డారు. ఆసుపత్రుల నిర్మాణం, స్టేడియం, జాతీయ కామధేను బ్రీడింగ్‌ కేంద్రం, చెక్‌డ్యామ్‌లు, రహదారులు తదితర పనులతో అభివృద్ధిపరంగా నియోజకవర్గంలో తన ముద్ర వేసిన రామారావు అదే సమయంలో కొన్ని ఆరోపణలూ ఎదుర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వచ్చాయి. ఉదయగిరిలో అతిథిగృహం నిర్మించి, ప్రజలకు అందుబాటులో ఉంటానని, మరోసారి గెలిపిస్తే నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డితో కలిసి ప్రచారం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు సానుకూల అంశంగా మారింది.

నెల్లూరు నగరం కఠిన పరీక్ష

తెదేపా: పి.నారాయణ
వైకాపా: పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌
నెల్లూరు పోటీ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా నారాయణ విద్యాసంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తుండటమే కారణం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ వైకాపా నుంచి మళ్లీ బరిలోకి దిగారు. నారాయణ మంత్రిగా రోడ్లు, డ్రైనేజీ, ఎన్టీఆర్‌ నెక్లెస్‌రోడ్డు, పార్కులు తదితర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతోపాటు తన సొంత వైద్యశాల ద్వారా ఉచిత వైద్యం అందిస్తుండటం కలిసి రానుంది. ‘మరోసారి చంద్రబాబుతోపాటు ఇక్కడ నారాయణను గెలిపిస్తే నెల్లూరు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది’ అని కిరాణా దుకాణం యజమాని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులను చివరి ఆరు నెలల్లోనే చేశారన్న విమర్శలూ ఉన్నాయి. మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ అభివృద్ధి పనులు చేయకున్నా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారన్న పేరు ఉంది. దాంతో ఇక్కడ గట్టి పోటీ నెలకొంది.

కోవూరు కలిసొచ్చే అంశాలు గెలిపించేనా?

తెదేపా: పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
వైకాపా: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
నెల్లూరు నగరాన్ని ఆనుకొని ఉన్న కోవూరు నియోజకవర్గంలో తెదేపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైకాపా నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు. గతంలో అయిదుసార్లు గెలిచిన ప్రసన్నకుమార్‌రెడ్డి 2014 ఎన్నికల్లో దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి సానుభూతితోపాటు జగన్‌ ప్రజాదరణ కలిసి వస్తుందని వైకాపా శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తెదేపా అభ్యర్థి పోలంరెడ్డికి కలిసొచ్చే అంశాలు. ‘పింఛన్‌ పెంచి... వృద్ధుల్లో భరోసాను నింపారు చంద్రబాబు’ అని కోవూరులోని పాటూరు రోడ్డు కాలనీకి చెందిన మీరాంబీ వ్యాఖ్యానించారు.

కావలి ఎలాగైనా గెలవాలి

తెదేపా: విష్ణువర్ధన్‌రెడ్డి
వైకాపా: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తెదేపా ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు ఈ నియోజకవర్గానికి చెందిన వారే. ఎవరికి వారు అధిక మెజారిటీ సాధించాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మళ్లీ గెలిచేందుకు ఆదాల వర్గంతో కలిసి సాగుతున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డికి బీద మస్తాన్‌రావు వర్గం తోడైంది. మస్తాన్‌రావు 2009లో కావలి నుంచి తెదేపా అభ్యర్థిగా గెలవడంతో అక్కడ ఆయనకు మద్దతుదారులు అధికంగా ఉన్నారు. అందుకే విష్ణువర్ధన్‌రెడ్డి గెలుపు బాధ్యత మస్తాన్‌రావు వర్గంపై పెట్టినట్లు తెలుస్తోంది. క్రాస్‌ ఓటింగ్‌ వల్ల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థికి కొంత నష్టం చేకూరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఓటు తమకు వేసి ఎంపీ ఓటు మీ ఇష్టమైన వారికి వేసుకోవాలని వైకాపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. విష్ణువర్ధన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిది అల్లూరి మండలం కావడంతో ఎవరికి వారు అక్కడ అత్యధిక మెజారిటీ సాధించేందుకు శ్రమిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని దగదర్తిలో విమానాశ్రయానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది.

గూడూరు ఆసక్తికర పోటీ

తెదేపా: పాశం సునీల్‌
వైకాపా: వరప్రసాద్‌
ఎస్సీ రిజర్వుడు స్థానమిది. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన పాశం సునీల్‌కుమార్‌ ఆ తర్వాత తెదేపాలో చేరారు. ఆయనే మళ్లీ తెదేపా నుంచి పోటీలో నిలిచారు. తిరుపతి ఎంపీగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి వరప్రసాద్‌ వైకాపా నుంచి బరిలోకి దిగారు. సునీల్‌కుమార్‌ను ఎలాగైనా ఓడించాలని వైకాపాకు అండగా నిలిచే బలమైన సామాజికవర్గం పట్టుదలగా ఉంది. తెదేపాకు చెందిన గూడూరు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ దేవసేనమ్మ వైకాపాలో చేరారు. ఈ పరిణామం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి వర్గంతో కలిసి ఇక్కడ పసుపు జెండాను ఎగురవేయాలనే లక్ష్యంగా సునీల్‌కుమార్‌ పనిచేస్తున్నారు.

ఆత్మకూరు బొల్లినేని వర్సెస్‌ మేకపాటి

తెదేపా: బొల్లినేని కృష్ణయ్య
వైకాపా: మేకపాటి గౌతంరెడ్డి
ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మళ్లీ వైకాపా తరఫున బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే, కిమ్స్‌ ఆసుపత్రి అధినేత బొల్లినేని కృష్ణయ్యను తెదేపా ఎన్నికల క్షేత్రంలో నిలిపింది. గత ఎన్నికల్లో దాదాపు 32 వేల మెజారిటీతో గెలిచిన మేకపాటి... ఆ తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంపై ఓటర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెదేపా అభ్యర్థి కృష్ణయ్య గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలున్నాయి. ఆయన రెండోసారి ఓడినా సొంత నిధులతో తాగునీరు సరఫరా చేయడంతోపాటు దేవాలయాల నిర్మాణం, ఇతర పనులకు విరాళాలు ఇవ్వడం తదితర కారణాలతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గెలుపునకు దోహద పడతాయని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, విజయరామిరెడ్డి, గత ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓడిన కన్నబాబు పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో..

* జిల్లాలో మొత్తం స్థానాలు: 10
* వైకాపా గెలిచిన నియోజకవర్గాలు: నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి
* తెదేపా విజయం సాధించిన స్థానాలు: కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి
(గమనిక: గూడూరులో వైకాపా నుంచి గెలిచిన సునీల్‌కుమార్‌ తర్వాత తెదేపాలో చేరారు.)

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.