close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎవరు

విజయావకాశాలపై అన్ని పార్టీల్లో అస్పష్టత 
మెజారిటీకి దూరంగానే భాజపా? 
కమల దళానికి 180 సీట్లు రావచ్చని విపక్షాలు, విశ్లేషకుల అంచనా 
కాంగ్రెస్‌కు 125 దక్కుతాయని లెక్క 
ఉత్కంఠకు తెరపడేది ఈ నెల 23నే 
424 స్థానాలకు ఇప్పటివరకు ఎన్నికలు పూర్తి 
12, 19 తేదీల్లో మరో 118 స్థానాలకు పోలింగ్‌ 
చల్లా విజయభాస్కర్‌ 
ఈనాడు, దిల్లీ

సార్వత్రిక ఎన్నికల మహాక్రతువు ఐదు దశలను దిగ్విజయంగా దాటేసింది. మరో రెండు దశలే మిగిలిన ఉన్న తరుణంలో 2019లో ఎర్రకోటపై త్రివర్ణ పతాకమెగరేసే రాజెవ్వరన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. భాజపా లెక్క ఎక్కడ ఆగిపోతుంది? ఎన్డీయేతో కలిపి ఆ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి? భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ప్రధానమంత్రి ఎవరవుతారు? ఏకైక పెద్ద పార్టీగా భాజపా అవతరించినా మోదీయే ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారా? లేదంటే నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ లాంటివారు తెరమీదికి వస్తారా? ఎన్డీయేకు మెజారిటీ తగ్గితే కొత్తగా ఏ పార్టీలు దానికి మద్దతిస్తాయి? అన్న ప్రశ్నలు ఇప్పుడు సగటు భారతీయ పౌరుడి మదిని తొలిచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా సాధించబోయే సీట్లపై రకరకాల లెక్కలున్నాయి. 


భాజపాను తీవ్రంగా వ్యతిరేకించేవారు ఆ పార్టీ సంఖ్యాబలం 150లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొంత తటస్థంగా ఉన్నవారు కమలదళానికి 180 దాకా సీట్లు రావొచ్చని పేర్కొంటున్నారు. భాజపా అనుకూలురు 200 దాకా రావొచ్చని చెబుతున్నారు. భాజపా నేతలైతే తమకు 230కి పైగానే వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని మాట్లాడినా ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరిస్తుందన్న దాంట్లో ఎక్కడా సందేహం కనిపించడం లేదు. ఆ సంఖ్య ఎంత ఉంటుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. 
రాజకీయ పరిస్థితులు చెప్పేదిదే.. 
భాజపాకు 180, కాంగ్రెస్‌కు 125, ఇతర పక్షాలన్నింటికీ కలిపి 238 దాకా సీట్లు రావొచ్చని విపక్షాలు లెక్కకడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ గాలి, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రతిపక్షాలు ఈ అంచనాకు వచ్చాయి. 
అప్పటిలా మోదీ గాలి లేదు 
2014లో ఉన్నంత మోదీ గాలి ఇప్పుడు లేదని ప్రజలు భావిస్తున్నారు. ఈ గాలిలేని వాతావరణాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతగా చెబుతున్నాయి. కానీ భాజపా మాత్రం మోదీ గాలి అంతర్లీనంగా ఉందని విశ్లేషిస్తోంది. ఇందులో ఎవరి వాదన నిజమన్నది 23న వచ్చే ఫలితాలే తేల్చాల్సి ఉంది.

కాంగ్రెస్‌ విఫలం 
దేశవ్యాప్తంగా మోదీపాలనపై అసంతృప్తి ఉన్నా కాంగ్రెస్‌ దాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైందని, రాహుల్‌గాంధీ తన నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచుకోలేకపోవడం వల్లే ఇప్పటికీ కొన్నివర్గాల ఓటర్లు మోదీని చూసి ఓటేస్తున్నారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించిన న్యాయ్‌ పథకం ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కాంగ్రెస్‌ నాయకత్వంపై విశ్వాసం పెరగకపోవడమే కారణమని భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచినా అది స్థానిక నాయకత్వం, పరిస్థితుల ఆధారంగా వచ్చినట్లే లెక్కేసుకోవాలి తప్పితే, జాతీయ నాయకత్వం బలంతో కాదని పేర్కొన్నాయి. భాజపాకు ఎన్నిసీట్లు వచ్చినా అది మోదీ బలం తప్పితే స్థానిక నాయకత్వంతో కాదనుకోవాలని విశ్లేషించాయి. 
ఎవరి నమ్మకం వారిది 
మోదీ, ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ, జాతీయవాదం అంశాలపైనే భాజపా నమ్మకం పెట్టుకొంది. ప్రతిపక్షాలు స్థానిక సమస్యలు, రైతాంగ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థికవృద్ధి, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ దుష్ప్రభావాలనే నమ్ముకొన్నాయి. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేకతకు ఇవే ప్రాతిపదికలవుతున్నాయి. వీటిపై జరుగుతున్నంత ప్రచారస్థాయిలో ఓటర్లు ప్రభావితమవుతున్నారా.. లేదా? అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదటి నాలుగుదశల పోలింగ్‌ శాతం కాస్త అటూ ఇటుగా 2014 స్థాయిలోనే ఉంది. తొలిదశలో 0.73% పెరగ్గా, రెండోదశలో 0.18% తగ్గింది. మూడోదశలో 1.25%, నాలుగోదశలో 2.46% పెరిగింది. అందువల్ల ఇది ప్రభుత్వ అనుకూల ఓటా? వ్యతిరేక ఓటా అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.  
హిందీ రాష్ట్రాల్లో 75 సీట్లకు గండి! 
హిందీ రాష్ట్రాల్లో తమకు 2014లో వచ్చినన్ని సీట్లు రావని కాషాయదళం అంగీకరిస్తోంది. అక్కడ జరిగే నష్టాన్ని ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో పూడ్చుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ రెండు రాష్ట్రాలపై భాజపా ఆశలుపెట్టుకొంది. అందులో ఏమాత్రం తేడా వచ్చినా ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలి. 2014 తర్వాత హిందీ బెల్ట్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను బట్టి ఈసారి భాజపా 75 సీట్లు కోల్పోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మోదీ గాలి పట్టణ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయన్న భావనను విశ్లేషకులు వినిపిస్తున్నారు. 
సొంత మెజారిటీ కల్లే 
భాజపా అంచనా వేసుకుంటున్నట్లుగా 230 సీట్లు రావాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో 55, రాజస్థాన్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 22, గుజరాత్‌లో 22, బిహార్‌లో 15, ఝార్ఖండ్‌లో 8, మహారాష్ట్రలో 20, హరియాణాలో 10, ఛత్తీస్‌గఢ్‌లో 6, కర్ణాటకలో 17, ఒడిశాలో 12, పశ్చిమబెంగాల్‌లో 15, అసోంలో 8, గోవాలో 2, దిల్లీలో 7, ఉత్తరాఖండ్‌లో 5, హిమాచల్‌లో 4 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుందని ఉదహరిస్తున్నారు. ఇవన్నీ గరిష్ఠస్థాయి లెక్కలని, భాజపా ఈ రాష్ట్రాల్లో ఇంత భారీస్థాయిలో సీట్లు దక్కించుకున్నా  సొంతంగా మెజారిటీ సాధించడానికి ఈసారి అవకాశాలే ఉండవని పేర్కొంటున్నారు. 
భాజపాకే అవకాశాలు 
జాతీయస్థాయిలో భాజపా గెలిచే స్థానాల సంఖ్య 180కిపైగా ఉండొచ్చని, కాంగ్రెస్‌కు 125 వరకు రావచ్చన్న భావనతో ఎవరూ విభేదించడం లేదు. ఈ సంఖ్యతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందన్నదానిపైనే చర్చ నడుస్తోంది. 2004లో కాంగ్రెస్‌ 145 సీట్లు సాధించినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. అప్పట్లో వామపక్షాలకు 64 సీట్లు రావడం, వారు బయటి నుంచి మద్దతివ్వడంతో భాజపాను అధికారానికి దూరంగా ఉంచగలిగారు. ఆ ఎన్నికల్లో భాజపా నంబరు 138 దగ్గరే ఆగిపోవడంతో కాంగ్రెస్‌ ఏకైక పెద్దపార్టీగా అవతరించింది. ఫలితంగా రాష్ట్రపతి దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, రాజకీయ అనివార్యత కారణంగా ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతి, లాలూ ప్రసాద్‌లాంటి వారు బయటి నుంచి మద్దతివ్వడంవల్ల యూపీయే-1 ప్రభుత్వం  సజావుగా సాగింది.  ఇప్పుడు ఏ కోణంలో చూసినా భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనిపిస్తున్నందున సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ఆ పార్టీనే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని, ఒకసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కిన తర్వాత చిన్నా చితక పార్టీలు, స్వతంత్రులు సహజంగానే అధికార కూటమివైపు మొగ్గుచూపుతారు కాబట్టి ప్రతిపక్షాల ఆశలు గల్లంతయ్యే అవకాశాలుంటాయన్న భావన కొందరి నుంచి వ్యక్తమవుతోంది.

భాజపా..

180 కన్నా తగ్గుతాయా? 
ఉత్తర్‌ప్రదేశ్‌లో 27, మధ్యప్రదేశ్‌లో 17, రాజస్థాన్‌లో 13, ఛత్తీస్‌గఢ్‌లో 1 సీటుకు భాజపా పరిమితం కావొచ్చనే లెక్క చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఇదివరకటిలాగానే అక్కడున్న 9 సీట్లనూ పూర్తిగా గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది నిజమైతే భాజపా దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లోనూ భారీగా నష్టపోయే అవకాశాలుంటాయి. అప్పుడు ఆ పార్టీ లెక్క 180కంటే కిందికే పడిపోయే ప్రమాదం ఉంటుంది.

కాంగ్రెస్‌..

8 రాష్ట్రాల్లో 10 చొప్పున వస్తేనే..! 
కాంగ్రెస్‌ 125 సీట్ల మార్కు దాటాలన్నా దానికి పట్టున్న రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, పంజాబ్‌ల్లో కనీసం పదికి తగ్గకుండా సీట్లు గెలుచుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ ఎనిమిది రాష్ట్రాలన్నింట్లో కలిపి 80 సీట్లు దక్కించుకుంటే మిగిలిన 21 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 45 వస్తే దాని మొత్తం సంఖ్య 125కి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

పోలింగ్‌ మిగిలింది 118 స్థానాలకే 
సార్వత్రిక ఎన్నికల సమరాంగణంలో రెండు దశలే మిగిలాయి. ఏప్రిల్‌ 11న మొదలైన మహాక్రతువు ఒక్కోదశను దాటుకుంటూ, ఉత్కంఠను పెంచుకుంటూ వచ్చింది. తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానాన్ని మినహాయిస్తే ఇప్పటివరకూ 424 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ పూర్తయింది. ఈ నెల 12, 19 తేదీల్లో 9 రాష్ట్రాల్లో 118 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, దిల్లీల్లో ఒకేదశలో ఎన్నిక పూర్తికానుండగా, బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో మిగిలిన రెండుదశల్లోనూ ఓటింగ్‌ ఉంది. ధన ప్రభావం కారణంగా తమిళనాడులోని వెల్లూరు ఎన్నికను రద్దుచేసినా ఎప్పుడు నిర్వహించేదీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకూ చెప్పలేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.