close

ప్ర‌త్యేక క‌థ‌నం

సేవలు మెరుగు.. రైలుకు పరుగు

ప్రమాదాలు తగ్గించి.. ప్రమాణాలు పెంచుతాం 
1,200 కిమీ రూ.1,500 కోట్లతో రైళ్లు ఢీకొనని టి-కాస్‌ 
ఈ ఏడాది 271 కిమీ కొత్త రైలు మార్గాలు, అదనపు లైన్ల పూర్తి 
కొత్త రైళ్లకు చాలా డిమాండ్లు.. రాయలసీమ నుంచి విజయవాడకు నిజామాబాద్‌, కరీంనగర్‌ నుంచి ముంబయి, తిరుపతికి 
ఏడాదిన్నర రెండేళ్లలో రైల్వే జోన్‌ విభజన.. చిన్న డివిజన్ల మనుగడ కష్టం 
ప్రస్తుత మార్గాలు కిటకిట.. అదనపు లైన్లతో కొత్త రైళ్లు, వేగం పెంపు 
నాలుగైదేళ్లలో 80 శాతం కొత్త రైళ్లు 
జూన్‌ నెలాఖరుకు కాగిత రహితంగా ద.మ.రైల్వే 
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో జీఎం గజానన్‌ మల్య 
సుతారపు సోమశేఖర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికులకు సేవలు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మల్య స్పష్టంచేశారు. ద.మ.రైల్వే జోన్‌ విభజన.. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన విధివిధినాల రూపకల్పన జరుగుతోందని.. విభజనలో ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని, మొత్తంగా ఏడాదిన్నర, రెండేళ్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. వచ్చే మార్చిలోపు 271 కి.మీ. మేర కొత్త రైలు మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ద.మ.రైల్వే జీఎంగా ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించిన మల్య జోన్‌ పరిధిలో ప్రాజెక్టుల నిర్మాణం..స్టేషన్లలో సదుపాయాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, వారి నుంచి వస్తున్న డిమాండ్లను వివరించారు. రైళ్ల వేగాన్ని పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించడం తమ ముందున్న అతిపెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. ఒకట్రెండు వేగవంతమైన రైళ్లు ప్రవేశపెట్టడం బదులు పది రైళ్ల ప్రయాణికులకు సమయం కలిసివస్తేనే ఎక్కువ ప్రయోజనమని, ఆ దిశగా తమ ప్రయత్నాలను ముందుకు తీసుకెళతామని చెప్పారు. జూన్‌ నాటికి ద.మ.రైల్వే జోన్‌ మొత్తాన్ని కాగిత రహిత కార్యాలయంగా మారుస్తామని వెల్లడించారు. 
? ద.మ.రైల్వే ప్రణాళికలు, లక్ష్యాలు ఏంటి? 
రికార్డుస్థాయిలో 2018-19లో 38.3 కోట్లమంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చాం. ఈ ఏడాది 38.6 కోట్లమందిని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమార్గాలు కిక్కిరిసి నడుస్తుండటంతో ఉన్న రైళ్ల వేగం పెంచడం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఉన్న మార్గాలను విస్తరించడం, సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపరచడమే పరిష్కారం. గూడూరు-విజయవాడ, విజయవాడ-కాజీపేట కాజీపేట-బల్లార్ష మూడోలైను ప్రాజెక్టులను, ఇతర రెండోలైను ప్రాజెక్టుల పనుల వేగం పెంచుతున్నాం. 177 కిమీ మేర రెండోలైను, మూడోలైను ప్రాజెక్టుల్ని.. 94 కిమీ కొత్త లైను మార్గాలను మార్చిలోపు దశలవారీగా పూర్తిచేస్తాం. పిడుగురాళ్ల-రొంపిచర్ల, రొంపిచర్ల-శ్రావల్యపురం, మనోహరాబాద్‌-గజ్వేల్‌, అక్కన్నపేట-మెదక్‌ లైన్లు ఈ ఏడాదిలో పూర్తవుతాయి. 
? బాధ్యతలు చేపట్టిన మూడునెలల్లో మీ దృష్టికి వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారు? 
గుంటూరు-తెనాలి డబ్లింగ్‌, గుంతకల్లు-గుల్లపాళ్యం..ఒక్కో రైలు మార్గాన్ని ప్రాధాన్యక్రమంలో పూర్తిచేసుకుంటూ వెళుతున్నాం. రైళ్లు కావాలని ఎక్కువ డిమాండ్లు వస్తున్నాయి. రాయలసీమ నుంచి విజయవాడకు.. నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి నుంచి ముంబయి, తిరుపతికి రైళ్లు అడుగుతున్నారు. వారానికి ఒకట్రెండు రోజులు తిరిగేవాటిని ప్రతిరోజు నడపాలంటున్నారు. బిహార్‌లో పట్నాకు, దిల్లీ, ఈశాన్య రాష్ట్రాలవైపు డిమాండ్‌ బాగా ఉంది. ఈ ప్రతిపాదనలను రైల్వేబోర్డుకు పంపించాం. ఉన్న రైళ్ల రాకపోకలపై ప్రభావం పడకుండా, ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుంటాం. ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ విజయవాడకు చేరేందుకు 15 గంటల సమయం పడుతోంది. ఐదారునెలల్లోగా 13 గంటలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ బోగీల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాం. 
? రైల్వే జోన్‌ విభజన ఎంతవరకు వచ్చింది? 
ద.మ.రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు వాల్తేర్‌ డివిజన్‌లో కొంతభాగంతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ను కేంద్రం ప్రకటించింది. ప్రత్యేకంగా నియామకమైన ఓఎస్‌డీ ఈ ప్రక్రియ బాధ్యతలు చూస్తున్నారు. జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పడాలి. ఉద్యోగుల విభజన జరగాలి. కొత్తగా నియామకాలు జరగాలి. రెండేళ్లలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈలోగా ప్రస్తుత జోన్‌ పరిధిలో నిర్మాణపనులు, కార్యకలాపాలు మెరుగ్గా జరిగేలా చూస్తా. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక విభజన వేగవంతం అవుతుంది. 
? తెలంగాణలో కాజీపేట, ఏపీలో తిరుపతి కొత్త డివిజన్లను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళతారా? 
భారతీయ రైల్వే, జోన్లు రాష్ట్రాల సరిహద్దు ప్రాతిపదికన ఏర్పడలేదు. కన్యాకుమారిలో బయల్దేరిన రైలు జమ్మూ వరకు వెళుతుంది. చిన్న డివిజన్లు ఏర్పాటుచేస్తే ఆర్థికంగా మనుగడ సాధించలేవు. ప్రధాన కార్యాలయం, సిబ్బంది..ఇలా ఎన్నోకావాలి. పైగా డివిజన్లు, జోన్లు పెరిగేకొద్ది ఓ రైలు నడపాలంటే ఆ మార్గంలో అందరి ఆమోదం తీసుకోవాలి. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఇది సంక్లిష్టమైన అంశం. రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం ప్రధానంగా ఉండాలి. కొత్త డివిజన్లపై నిర్ణయం రైల్వే మంత్రిత్వశాఖ తీసుకుంటుంది. 

? రైళ్లకంటే బస్సులే వేగంగా వెళుతున్నాయని.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం వైపు శతాబ్ది, ట్రైన్‌-18 రైళ్లు కావాలంటున్న ప్రయాణికుల డిమాండ్‌పై ఏమంటారు? 
ఆరు గంటల ప్రయాణం మూడు గంటలకు తగ్గితే ప్రయోజనం. శతాబ్ది, ట్రైన్‌-18 వంటివాటితో 4, 5 గంటల్లో వెళ్లినా అంతగా ఉపయోగం ఉండదన్నది నా అభిప్రాయం. పైగా ఇలాంటి రైళ్లను ప్రవేశపెడితే ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్లను ఆపాల్సి ఉంటుంది. సగటు ప్రయాణికుడు సమయానికి గమ్యస్థానం చేరుకోవాలని, భరించేలా టికెట్ల ధరలు, మంచి సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. జనరల్‌ నుంచి సెకండ్‌ ఏసీ వరకు అన్నిరకాల బోగీలుండే రైళ్లను.. నిర్ణీత సమయంలో నడిపించడంపై దృష్టి పెడతాం. 
? గతంతో పోలిస్తే రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయి? 
నిర్మాణ పనులు, పెరిగిన రద్దీ, ట్రాక్‌ నిర్వహణ.. ఇలా అనేక కారణాలతో రైలు ప్రయాణం ఆలస్యమవుతోంది. 2018-19లో 85 శాతం రైళ్లు సమయానికి గమ్యస్థానం చేరుకున్నాయి. 2017-18లో 81 శాతంతో పోలిస్తే కొంత మెరుగుపడింది. 2019-20లో రైళ్ల సమయపాలనను 90 శాతానికి తీసుకెళతాం. 
? వేసవిలో ఏసీలు పనిచేయకపోవడం, టాయిలెట్లలో నీటి సమస్యలపై.. 
బోగీల సంఖ్యతో పాటు ఏసీ సమస్యలు పెరుగుతున్నది నిజమే. ప్రతి రైల్లో మెకానిక్‌లను అందుబాటులో ఉంచుతున్నాం. వాటి నిర్వహణ, సిబ్బందికి శిక్షణపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. ప్రయాణం మధ్యలో నీటిసమస్య వస్తోంది. కొన్ని స్టేషన్లలో వేగంగా నీళ్లు నింపే ఏర్పాట్లు చేస్తున్నాం. 24 బోగీలు ఉండే రైలుకు నీళ్లు నింపాలంటే 12 మంది సిబ్బంది ఉండాలి. 
? మూడొంతులకు పైగా డొక్కు బోగీలు ఉన్నాయి. సమస్య తీరేదెప్పుడు? 
ఆరువేల బోగీల్లో ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు 500 ఉన్నాయి. నాలుగైదేళ్లలో 80 శాతం పాతబోగీల్ని మార్చి ఎల్‌హెచ్‌బీలతో కొత్త రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తాం. 
? ఏపీ రాజధాని అమరావతి అనుసంధాన ప్రాజెక్టు ఎక్కడివరకు వచ్చింది? 
మూడు సెక్షన్లతో కేంద్రం ఈ ప్రాజెక్టు మంజూరుచేసింది. తొలుత రూ.2,680 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని ప్రధాన లైనులో కొంతమార్పు చేసి రూ.1732 కోట్లకు తగ్గించారు. నిధుల కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే విషయంలో రైల్వేబోర్డు నుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. 
? ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? 
1,200 కిమీ మార్గంలో టి-కాస్‌ (ట్రైన్‌ అవాయిడ్‌ కొలిజన్‌ సిస్టమ్‌) పరిజ్ఞానం అమలుచేయబోతున్నాం. ఒకే ట్రాక్‌పై- ఎదురెదురుగా రైళ్లు వచ్చినా, ముందు ఒక రైలు ఆగిపోయినా వెనుక నుంచి వచ్చే రైలు ఢీకొనకుండా ఆటోమెటిగ్గా బ్రేకులు పడేలా చేస్తుంది ఈ పరిజ్ఞానం. రూ.1,500 కోట్ల వ్యయంతో చేపడుతున్నాం. టెండర్లు పిలిచాం. 958 కిమీ మన్మాడ్‌-నాందేడ్‌-సికింద్రాబాద్‌-డోన్‌, గుంతకల్లు మార్గం.. 240 కిమీ బీదర్‌-పర్లి-పర్బనీలో అమలుచేస్తాం. 
? ప్రీమియం పార్కింగ్‌లో ఒకరోజు బండి పెడితే రూ.రెండొందలపైగా ఛార్జీ సమర్థనీయమేనా? 
రద్దీ అధికంగా ఉండే సికింద్రాబాద్‌ వంటి స్టేషన్లలో స్థలం కొరత ఉంది. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల్ని దించి వాహనాలు వెళ్లినట్లే ఇక్కడా ఉండాలన్నది విధానం.హైటెక్‌ సిటీ వంటి సబర్బన్‌ స్టేషన్లలో పార్కింగ్‌ఛార్జీలు తక్కువే.

ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు 
1,200 కిమీ మార్గంలో టి-కాస్‌ (ట్రైన్‌ అవాయిడ్‌ కొలిజన్‌ సిస్టమ్‌) పరిజ్ఞానం అమలుచేయబోతున్నాం. ఒకే ట్రాక్‌పై- ఎదురెదురుగా రైళ్లు వచ్చినా, ముందు ఒక రైలు ఆగిపోయినా వెనుక నుంచి వచ్చే రైలు ఢీకొనకుండా ఆటోమెటిగ్గా బ్రేకులు పడేలా చేస్తుంది ఈ పరిజ్ఞానం. రూ.1,500 కోట్ల వ్యయంతో చేపడుతున్నాం. టెండర్లు పిలిచాం. 958 కిమీ మన్మాడ్‌-నాందేడ్‌-సికింద్రాబాద్‌-డోన్‌, గుంతకల్లు మార్గం.. 240 కిమీ బీదర్‌-పర్లి-పర్బనీలో అమలుచేస్తాం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.