close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈనాడు తోడు.. సాకారమైన గూడు

శ్రీకాకుళం జిల్లాలో హుద్‌హుద్‌ బాధితులకు ‘ఈనాడు’ సహాయనిధి ఇళ్ల అప్పగింత

టెక్కలి, సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: హుద్‌హుద్‌ తుపానుతో నిలువ నీడ లేకుండా పోయిన బాధితులకు ‘ఈనాడు’ అండగా నిలిచింది. సంస్థతోపాటు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి అందించిన విరాళాలతో ‘ఈనాడు రిలీఫ్‌ ఫండ్‌ హుద్‌హుద్‌ తుపాను బాధితుల పునరావాస కాలనీ’ పేరుతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో 64 ఇళ్లను సకల సదుపాయాలతో నిర్మించింది. వాటిని జిల్లా కలెక్టరు జె.నివాస్‌ చేతుల మీదుగా గురువారం లబ్ధిదారులకు అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులను ఆదుకోవడంలో రామోజీ గ్రూప్‌ చూపే చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. నిర్మాణాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్కలి వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆహ్లాదకర వాతావరణంలో చక్కటి ఇళ్లు కట్టించి.. నిరుపేదల కల నెరవేర్చిన రామోజీరావు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు.

2014 అక్టోబరు 12న హుద్‌హుద్‌ పెను తుపాను విశాఖతోపాటు శ్రీకాకుళం జిల్లానూ అతలాకుతలం చేసింది. సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు, పేదల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో గూడు కోల్పోయిన బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ‘ఈనాడు’ సంకల్పించింది. ఈ మేరకు మండల పరిధిలోని పాత మేఘవరం, ఉమిలాడ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి 2016 మే 28న శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత భూసేకరణ, మౌలిక వసతుల కల్పన కోసం కొంత ఆలస్యమైంది. అనంతరం పాత మేఘవరంలో 36, ఉమిలాడలో 28 ఇళ్లను అన్ని హంగులతో, పూర్తి నాణ్యతతో ‘ఈనాడు’ నిర్మించింది. పక్కా రహదారులు, కాలువలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలు, తాళాలను కలెక్టరు గురువారం పంపిణీ చేశారు. ఇళ్లను చూసిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పక్కా గూడు నిర్మించి ఇచ్చిన ఈనాడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి ‘ఈనాడు’ శ్రీకాకుళం యూనిట్‌ ఇన్‌ఛార్జి డీవీ రమణ, సంతబొమ్మాళి తహసీల్దారు ఎస్‌.రాంబాబు, పలువురు మండలస్థాయి అధికారులు హాజరయ్యారు.

అప్పుడు విశాఖలో..
హుద్‌హుద్‌ విలయానికి సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ‘ఈనాడు’ రూ.3 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ప్రజల నుంచి విరాళాలు కోరగా పలువురు ముందుకొచ్చి రూ.3.16 కోట్ల సాయాన్ని అందించారు. మొత్తం రూ.6.16 కోట్ల సహాయనిధితో విశాఖపట్నం జిల్లా తంతడి- వాడపాలెం గ్రామంలో 80 గృహాలను నిర్మించి తుపాను బాధితులకు పంపిణీ చేసింది. తర్వాత శ్రీకాకుళం జిల్లా పాత మేఘవరం గ్రామంలో 36, ఉమ్మిలాడ గ్రామంలో 28 మొత్తం 64 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి వాటిని బాధితులకు అందజేసింది. 


జీవితాంతం రుణపడి ఉంటాం

సొంతిల్లు లేక.. హుద్‌హుద్‌ తుపానులో కుటుంబమంతా చిన్న పిల్లలతో ఎంతో ఇబ్బందిపడ్డాం. ‘ఈనాడు’ మా సొంతింటి కల నెరవేర్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చక్కని వాతావరణంలో మంచి కాలనీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు హాయిగా పక్కా ఇంటిలో కొత్త జీవితం ప్రారంభిస్తాం. ‘ఈనాడు’ సంస్థకు జీవితాంతం రుణపడి ఉంటాం.

- ఇప్పిలి చంద్రమ్మ, ఇంటి లబ్ధిదారు, మేఘవరం, సంతబొమ్మాళి మండలం 



నెరవేరిన సొంతింటి కల

తుపాను మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా మా కళ్ల ముందు మెదులుతున్నాయి. పూరిపాకలో బితుకుబితుకుమంటూ గడిపాం. ఇప్పుడు ‘ఈనాడు’ ఇల్లు మంజూరు చేసింది. నాలాంటి వాళ్లెందరికో సొంతింటి కల నెరవెర్చిన రామోజీ గ్రూప్‌ సంస్థలకు కృతజ్ఞతలు. కాలనీలో తాగునీరు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, దేవాలయం తదితర సదుపాయాలన్నీ సమకూరాయి.

- కొమర జ్యోతి, లబ్ధిదారు, ఉమిలాడ, సంతబొమ్మాళి మండలం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.