close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పల్లెపై కొవిడ్‌ పడగ

శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి
జిల్లాల్లో రోజుకు 1,700-2,000 వరకు పాజిటివ్‌లు
ఇటీవలి కేసుల్లో 86 శాతానికి పైగా గ్రామీణంలోనే
10 జిల్లాల్లో వైరస్‌ ఉద్ధృతి
కొన్ని గ్రామాల్లో 100 మందికి పైగా బాధితులు
ఈనాడు - హైదరాబాద్‌
ఈనాడు యంత్రాంగం సహకారంతో

జులై 1న జీహెచ్‌ఎంసీ కాకుండా జిల్లాల్లో కేసుల నమోదు 13.45 శాతం ఉండగా.. సెప్టెంబరు 14నాటికి 86.54 శాతానికి పెరిగింది. కేవలం రెండున్నర నెలల కాలంలోనే గ్రామీణ తెలంగాణలో 73.09 శాతానికి కేసులు పెరగడం.. కొవిడ్‌ ఉద్ధృతికి నిదర్శనం.

కరోనా మహమ్మారి పల్లెల వైపు కోరలు చాస్తోంది. వైరస్‌ వ్యాప్తి మొదలయ్యాక తొలి 4 నెలలు జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌) పరిధిలో ఉగ్రరూపం చూపగా.. జులై నుంచి జిల్లాల్లో విజృంభిస్తోంది. మొదట చిన్న నగరాలు, పట్టణాలకే కేసులు పరిమితమవగా.. ఇప్పుడు పల్లెల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. రెండున్నర నెలలుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కేసుల నమోదు క్రమేణా తగ్గుముఖం పట్టగా.. జిల్లాల్లో మాత్రం ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజుల కేసుల నమోదు సరళిని పరిశీలిస్తే రోజుకు సగటున 1,700-2,000 వరకూ పాజిటివ్‌లు జిల్లాల్లోనే నిర్ధారణ అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్‌ను ఈ దశలో గనుక అడ్డుకోకపోతే.. మున్ముందు పల్లెసీమల్లో కొవిడ్‌ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పాజిటివ్‌ బాధితుల్లో దాదాపు 77 శాతం మంది ఐసొలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ప్రభుత్వ ఐసొలేషన్‌లో ఉండేవారు 40 శాతానికి మించడంలేదు.  మిగిలినవారంతా ఇళ్లలోనే విడిగా ఉంటున్నారు. అయితే ఇంట్లో చికిత్స పొందుతున్నవారికి ప్రత్యేకంగా విడి బాత్‌రూమ్‌ ఉన్న గది ఉండాలి. కానీ పల్లెల్లో విడి గది ఉన్నా.. ప్రత్యేకంగా స్నానాల గది ఉండడమనేది తక్కువే. దీంతో ఒకే స్నానాల గది, మరుగుదొడ్డిని కుటుంబ సభ్యులందరూ వినియోగించుకోవడంతో.. అందరికీ వైరస్‌ సోకుతున్నట్లుగా వైద్యవర్గాలు గుర్తించాయి. అందుకే జిల్లాలు, డివిజన్‌ కేంద్రాల్లోనూ మొత్తం 125 కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటుచేసి, వాటిలో 8,867 పడకలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ వాటిలో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారిలోనూ కొందరు నిబంధనలను పాటించకుండా.. తమకు ఎటువంటి లక్షణాలు లేవనే కారణంతో.. యథేచ్ఛగా తిరగడం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.

గ్రామీణంలో వైరస్‌ ఉద్ధృతి ఇలా..
వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ పరిధిలో ఊళ్లకు ఊళ్లు కొవిడ్‌ బారిన పడి కుదేలవుతున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్‌లో ఏకంగా 90 మందికి వైరస్‌ సోకింది. లింగాలఘనపురం మండలం జీడికల్‌లో 52 కేసులు బయటపడ్డాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలో 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వంగపల్లిలో 121, కానిపర్తిలో 68, అంబాలలో 76, గూడూరులో 69 కేసులు వచ్చాయి. ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో 55, భీందేవరపల్లి మండలంలోని ముల్కనూరులో 200 వరకు కేసులు బయటపడ్డాయి. ఐనవోలు మండలం పంథినిలో 51 మందికి పాజిటివ్‌ వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో 73 కేసులు రాగా, వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో 50 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాలు కూడా కొవిడ్‌ బారినపడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్‌కే పురంలో 1,194 మంది జనాభాలో 103 మందికి కరోనా సోకింది.
  90 కుటుంబాల్లో 73 మందికి...
కరీంనగర్‌: ఈ జిల్లాలో పట్టుమని వంద ఇళ్లయినా లేని ఓ ఊరిపైనా కరోనా పంజా విసిరింది. దాదాపుగా ఇంటికొకరు అన్నట్లుగా మాయదారి వైరస్‌ వ్యాపించింది. జమ్మికుంట మండలంలోని గోవిందాపూర్‌ గ్రామంలో 90 కుటుంబాలుండగా.. ఇప్పటికే 73 మందికి పాజిటివ్‌ రావడంతో.. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావడం మానేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయినా కొత్త కేసులు బయటపడుతుండడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
మెదక్‌: అల్లాదుర్గం మండలం మాందాపూర్‌ గ్రామంలో 58, చిన్నశంకర్‌పేట మండలం జంగరాయిలో 33, హావేలీ ఘనపూర్‌ మండలం కూచన్‌పల్లిలో 25 కేసులు వచ్చాయి, చిలపచేడ్‌ మండలం చండూర్‌ గ్రామంలో 25 మందికి, రామాయంపేట మండల కేంద్రంలో 256 మందికి, నిజాంపేట మండల పరిధి కల్వకుంటలో 36, రాంపూర్‌లో 31 మందికి కొవిడ్‌ సోకింది.
  ఆ ఊళ్లో స్వీయ లాక్‌డౌన్‌
ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం బీరోలులో 65 పాజిటివ్‌ కేసులు రాగా, ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు స్వీయ లాక్‌డౌన్‌ విధించుకున్నారు. గ్రామంలోకి బయటివారు రాకుండా నిషేధించారు. కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపారాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ.. తిరిగి సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ మాత్రమే నిర్వహించుకోవాలని ఆంక్షలు విధించుకున్నారు. గ్రామాన్ని శానిటైజ్‌ చేశారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్నవారిని గుర్తిస్తున్నారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో ఇప్పటి వరకూ 58 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 20 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ కూడా కేసుల తీవ్రత దృష్ట్యా 13 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించుకున్నారు. కూసుమంచి మండలంలోని గోరీలపాడుతండా, చాప్లతండా, తుమ్మలతండా, ఒంటిగుడిసెతండా, శివారుతండాల్లో కలుపుకొని మొత్తం జనాభా 2,230 మందికాగా.. ఈనెల 13 వరకూ 74 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈనెల 14న 110 మందిని పరీక్షించగా, 10 మందిలో కరోనా నిర్ధారణ అయింది.
మహబూబ్‌నగర్‌: కోయిల్‌కొండ మండలం మోతీపూర్‌ తండాలో 63 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ గ్రామానికి పుణె నుంచి వచ్చిన ఇద్దరు యువకుల్లో తొలుత వైరస్‌ నిర్ధారణ కాగా, వారి నుంచి మిగిలినవారికి వ్యాప్తి చెందింది. భూత్‌పూర్‌ మండలం అమిస్తాపూర్‌ గ్రామంలో 57 మందికి వైరస్‌ సోకింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో 82 మంది కరోనా బారినపడ్డారు. ఇక్కడ పింఛను ఇచ్చే వ్యక్తి ద్వారా కొవిడ్‌ వ్యాపించినట్లు గుర్తించారు. నారాయణపేట జిల్లా జలాల్‌పూర్‌ గ్రామంలో 50 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న చాలామందికి వైరస్‌ సోకింది.
నిజామాబాద్‌: బోధన్‌ పురపాలిక పరిధిలోని చెక్కి క్యాంప్‌ ప్రాంతంలో 73 మందికి వైరస్‌ సోకింది. వీరిలో చాలామంది ఒక వివాహ వేడుకలో పాల్గొనడంతో వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు తేల్చారు. ముబారక్‌నగర్‌ గ్రామంలో 40, సారంగపూర్‌లో 50, బైరాపూర్‌, బోర్గామ్‌లో కలిపి 75, నవీపేటలో 85 కేసులు నమోదుకాగా, రెంజల్‌ మండలం కలియాపూర్‌లో 30 మందికి పైగా కరోనా బారినపడ్డారు. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామంలో సుమారు 30 మందికి కొవిడ్‌ సోకగా, రాంపూర్‌కలాన్‌, కుర్తి, చిన్నకొడపగల్‌, పెద్దకొడపగల్‌, కసలాబాద్‌, భీర్‌ఖూర్‌, బరంగ్‌ఏడిగి తదితర గ్రామాల్లోనూ ఒక్కోచోట సుమారు 25-30 కేసులు నమోదయ్యాయి.
  ఏ ఊరు చూసినా...
సిద్దిపేట: ఈ జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో ఇప్పటి వరకూ 40 కరోనా పాజిటివ్‌లు నమోదుకాగా, మిరుదొడ్డి మండలం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో 65 మందికి, అల్వాలలో 47 మందికి కరోనా సోకింది. నంగునూరు మండలం అంక్షాపూర్‌లో రెండు నెలల్లో 70 కేసులు నమోదవగా.. వారిలో ప్రస్తుతం 46 మంది కోలుకున్నారు. తొగుట మండలవ్యాప్తంగా 282 పాజిటివ్‌ కేసులు కాగా, ఒక్క లింగాపూర్‌ గ్రామంలోనే 55 మంది వైరస్‌ బారినపడ్డారు. కొండపాక మండల పరిధిలోని కుకునూరుపల్లి గ్రామంలో 62 పాజిటివ్‌లు, సిద్దిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్‌లో 64, సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రీచెప్యాల గ్రామంలో 33 కేసులు నిర్ధారించారు.

వేగంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాలు:
కరీంనగర్‌, ఖమ్మం, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్‌ నగర.


పల్లెకు ఎలా  సోకింది?

* పొలం పనులకు వెళ్తున్నవారు కరోనా నిబంధనలను పాటించడంలేదు. వీటిపై ఎక్కువమంది గ్రామీణులకు కనీస అవగాహన కూడా లేదు.
* వ్యాపారులు, వ్యవసాయదారులు, యువకులు.. వేర్వేరు పనుల కోసం, వైద్యసేవల కోసం సమీప పట్టణాలకు, నగరాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వీరు పట్టణాల్లో వైరస్‌ బారినపడి.. గ్రామాల్లో వ్యాప్తికి కారకులవుతున్నారు.
* వివాహాది శుభకార్యాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కలిసి మెలిసి తిరుగుతున్నారు.
* కొందరు ముఖానికి మాస్కు ధరిస్తున్నా సరైన విధానంలో పెట్టుకోవడం లేదు.
* ఎప్పటికప్పుడూ చేతులు శుభ్రం చేసుకోవడం గ్రామాల్లో సాధ్యం కావడంలేదు.
* వీటన్నింటి కారణంగా వైరస్‌ సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.