close
Updated : 12/06/2021 19:08 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఇప్పుడు నా బాబు గురించి తప్ప వేరే ధ్యాస లేదు!

‘మాతృత్వం’ అనేది మహిళలకు మాత్రమే దక్కిన గొప్ప వరం. అందుకే అమ్మగా ప్రమోషన్‌ పొందిన ప్రతి ఒక్కరూ ఆ మధురానుభూతిని మనసారా ఆస్వాదించాలనుకుంటారు. నిత్యం తన పండంటి బిడ్డ పక్కనే ఉండాలనుకుంటారు. వారి ఆలనాపాలనలోనే పూర్తిగా గడపాలనుకుంటారు. అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంటారు. మనసు పడి ఎంచుకున్న పనులను సైతం పక్కన పెట్టేస్తుంటారు. తాను కూడా అంతేనంటోంది ‘నువ్వు-నేను’ ఫేం అనితా హస్సానందాని. ఈ క్రమంలో తన ముద్దుల తనయుడి బాధ్యతల కోసం తనకిష్టమైన నటనకు తాత్కాలికంగా విరామం ప్రకటించానంటోంది.


టాలీవుడ్‌లో మంచి గుర్తింపు!
‘నువ్వు-నేను’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిత. పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించిన ఆమె.. ‘ఝలక్‌ దిక్‌ లాజా’, ‘కామెడీ సర్కస్‌’, ‘బిగ్‌బాస్‌’, ‘నచ్‌ బలియే’ వంటి టీవీ రియాలిటీ షోల్లో పాల్గొని సత్తా చాటింది. సినిమాల్లో నటిస్తున్నప్పుడే రోహిత్‌ రెడ్డి అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన అనిత... 2013లో అతనితో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ క్రమంలో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారీ లవ్లీ కపుల్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఆరవ్’ అనే కొడుక్కి జన్మనిచ్చిందీ అందాల జంట.


బాబు కోసమే ఈ విరామం!
బిడ్డ పుట్టినప్పటి నుంచి మాతృత్వపు మధురిమలను పూర్తిగా ఆస్వాదిస్తోంది అనిత. అయితే తన పూర్తి సమయాన్ని ఆరవ్ కోసమే కేటాయించాలనుకున్న ఆమె నటనకు తాత్కాలిక విరామం ప్రకటించింది. ‘ఇదేదో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. అమ్మగా మారిన తర్వాత బ్రేక్‌ తీసుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నా. ఆరవ్‌కి ఇప్పుడు నాలుగు నెలలు. ఈ సమయంలో వాడికి తల్లి తోడు ఎంతో అవసరం. ఆరవ్ ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. కొందరు అనుకుంటున్నట్లు నేను ఇండస్ట్రీని వదిలిపెట్టడానికి కరోనా ఏ మాత్రం కారణం కాదు. నిజాయతీగా చెప్పాలంటే ప్రస్తుతం నా బాబు భవిష్యత్‌ తప్ప వేరే ఆలోచన మదిలోకి రావడం లేదు. పునరాగమనంపై ఇప్పుడేమీ చెప్పలేను. అయితే తిరిగి ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే కచ్చితంగా అందరికీ చెప్పే వస్తాను’.

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం!
‘ప్రస్తుతం రోహిత్‌ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఆరవ్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. నేను నటన నుంచి విరామం తీసుకున్నా గతంలో కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇందులో భాగంగా ఇంటి నుంచే షూటింగులకు హాజరవుతున్నాను. షూట్‌ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా. రోజూ ఒక వ్యక్తే ఇంటికి వస్తున్నారు. నా సీన్స్‌ అన్నీ షూట్‌ చేసి తీసుకుని వెళుతున్నారు. షూట్‌కు ముందే ఆ వ్యక్తికి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నాం. నెగెటివ్‌ వచ్చిన తర్వాతే ఇంట్లోకి అనుమతిస్తున్నాం’ అని చెప్పుకొచ్చిందీ బుల్లితెర బ్యూటీ. 


సో.. బిడ్డ పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకోవడం అనేది ఎవరి విషయంలో అయినా జరిగేదే. కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అందులోనూ అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ తాత్కాలికంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చినా కూడా పెద్దగా వర్రీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే నెలల వయసులో స్వయంగా చిన్నారుల బాగోగులు చూసుకోవడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో  ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే సరే. లేదంటే - ప్రసూతి సెలవు తర్వాత కూడా కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాల్సి వస్తే దాని గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆర్ధికంగా ఉద్యోగం చేయకపోయినా ఫరవాలేదనుకుంటే అవకాశం ఉన్నవాళ్లు చిన్నారుల ఆలనాపాలనలో ఆనందంగా గడపడంలో తప్పేమీ లేదంటున్నారు నిపుణులు. 
మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలేమిటో పంచుకోండి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని