close
Updated : 18/09/2021 13:55 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

సింగిల్‌గా ఉంటే తప్పేంటి?!

తొలి ప్రేమ విఫలమైన రీనా కొన్నాళ్ల పాటు అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే వేరే జంటల్ని చూసినప్పుడల్లా ‘సింగిల్‌గా ఉండాల్సిన ఖర్మ నాకే ఎందుకో..?’ అంటూ మథన పడిపోతుంటుంది.

సమయానికి అనుకున్న పనులు జరిగిపోవాలనేది టీనా వ్యక్తిత్వం. అయితే పెళ్లి వయసొచ్చినా సంబంధాలు కుదరకపోయేసరికి తనలో ఏదో లోపముందని, అదే తను ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమంటూ బాధపడిపోతోంది.

నిజానికి సింగిల్‌గా ఉంటే స్వేచ్ఛగా, తమకు నచ్చినట్లుగా ఉండచ్చని కొందరు సంబరపడిపోతే.. మరికొందరు మాత్రం.. ఒంటరిగా ఉంటున్నామంటే ఏదో తప్పు చేసిన భావనతో, సమాజం తమ పట్ల చెడు దృష్టితో చూస్తుందన్న ప్రతికూల ఆలోచనల్ని మనసులో నింపుకుంటారు. దీనివల్ల మానసిక ఆందోళనలు తప్ప మరే ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. అయినా సింగిల్‌గా ఉంటే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కాస్త దీర్ఘంగా ఆలోచించాలే కానీ.. ఒంటరితనాన్నీ ఎంజాయ్‌ చేయచ్చంటున్నారు. మరి, ఇంతకీ సింగిల్‌గా ఉన్నానంటూ చాలామంది తెగ బాధపడిపోవడానికి గల కారణాలేంటి? వీటిని జయిస్తూనే ఒంటరితనాన్ని ఆస్వాదించే మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

సెటిలవ్వట్లేదనే కదా మీ బాధ!

జీవితంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అందుకు సమయం కలిసి రావాలి. కొంతమంది చిన్న వయసులోనే తాము అనుకున్న ఉద్యోగం సంపాదించి త్వరగా సెటిలైపోతే.. మరికొందరి విషయంలో ఇది కాస్త ఆలస్యమవ్వచ్చు. ఇలా రోజులు గడిచేకొద్దీ వీరిలో ఒక రకమైన అసహనం పెరిగిపోతుంటుంది. దీంతో తామేదో తప్పు చేసిన భావనతో బాధపడుతుంటారు. ఇంకొందరి విషయంలో అయితే వారి తల్లిదండ్రులు, స్నేహితులే ‘నీతోటి వాళ్లందరికీ ఉద్యోగమొచ్చింది.. నీకెప్పుడొస్తుంది?!’ అంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనసును మెలిపెట్టినా వీటిని తిప్పి కొట్టే ధైర్యాన్ని కూడగట్టుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోకుండా మీరు అనుకుంటున్న లక్ష్యంపై పూర్తి దృష్టి సారించాలి. ఫలితంగా వరించిన ఆ విజయమే మిమ్మల్ని విమర్శించిన వారి నోటికి తాళం వేస్తుంది.

అసూయపడుతున్నారా?!

కొంతమందికి అనుబంధాల్లో చేదు జ్ఞాపకాలు ఎదురవ్వచ్చు.. ఇద్దరూ విడిపోయి ఒంటరిగా ఉండడానికే నిర్ణయించుకోవచ్చు. ఇలాంటి వారిలో కొందరు.. సంతోషంగా ఉన్న జంటల్ని చూసి ఓర్వలేకపోతారు. ఇతరులు సంతోషంగా ఉన్నారని అసూయ పడుతుంటారు. ఇలాంటి ఫీలింగ్‌ మరొకరితో కలవనివ్వదు.. ఒంటరిగా ఉంటూ మనసులో బాధను ప్రేరేపిస్తుంది. మరి, నిజానికి ఇలా వేరొకరిపై ఈర్ష్య పడడం వల్ల బీటలు వారిన మీ అనుబంధం తిరిగి కలుస్తుందా? అంటే.. అది జరగని పని! ఇలా మీరు అసూయపడడం వల్ల అది మీకే నష్టం! కాబట్టి ముందు మనసులో ఉన్న ఇలాంటి ప్రతికూల భావనను తొలగించాలి. గత చేదు జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకొని.. అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడితే హ్యాపీగా, పాజిటివ్‌గా ముందుకెళ్లచ్చు.

స్నేహితులే దెప్పి పొడుస్తుంటే..!

స్నేహితులంటే సుఖాలనే కాదు.. కష్టాలనూ పంచుకునేవారు. అవసరంలో ఆదుకునే వారు. మీ సంతోషాన్ని కోరుకునే వారు. కానీ అందరూ ఇలా ఉండకపోవచ్చు. స్నేహితులే అయినా వారి బలహీనతల్ని, ప్రతికూల పరిస్థితుల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్లను దెప్పి పొడవడం, వాళ్ల గురించి తోటి స్నేహితుల దగ్గర నెగెటివ్‌గా చెప్పడం, పలు కారణాల వల్ల మీరు ఒంటరిగా ఉండాల్సి వస్తే.. దాని వెనకున్న కారణమేంటో కనుక్కోకుండా మిమ్మల్ని నిందించడం.. వంటివి చేస్తుంటారు. దీంతో అప్పటిదాకా స్నేహితులని నమ్మిన వారు ఒక్కసారిగా అలా చేసేసరికి స్నేహబంధం అంటేనే విసుగొచ్చేస్తుంటుంది.. ఇక ఎవరినీ కలవాలనిపించదు. ఇదిగో ఇలాంటి తొందరపాటు నిర్ణయమే తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎవరో ఒకరు చేసిన పొరపాటుకు ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ను దూరం పెట్టడం సరికాదంటున్నారు. ఈ క్రమంలో మిమ్మల్ని అవమానించి, ఇతరుల ముందు పలుచన చేసిన వారిని దూరం పెడుతూనే.. మంచి స్నేహితులతో స్నేహాన్ని కొనసాగించడం వల్ల పాత గాయాల్ని త్వరగా మాన్పుకోవచ్చు.

పెళ్లే జీవితం కాదు!

తల్లిదండ్రుల ఒత్తిడి వల్లో, వయసు మీరిపోతోందనో, సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు భరించలేకో.. ఇవన్నీ కాక ఫలానా వయసులో పెళ్లైతే ఇక జీవితంలో స్థిరపడ్డట్లే అన్న భావన మనసులో నాటుకుపోవడం వల్లో.. ఇలా మొత్తానికి కారణమేదైనా.. ఫలానా వయసులో పెళ్లి కాకపోతే ఇక జీవితంలో వెనకపడినట్లే అని భావిస్తుంటారు కొందరు. అంతేకాదు.. ఈ బాధను ఇతరులతో పంచుకోవడానికీ ఇష్టపడరు.

అయితే మారుతున్న కాలాన్ని బట్టి పెళ్లనేది ఫలానా వయసులోనే జరగాలన్న నియమమేమీ లేదని, అది జీవితంలో ఒక భాగమే కానీ.. అదే జీవితం కాదని అంటున్నారు నిపుణులు. ఎవరికో తలొగ్గి తొందరపడి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడిపోయే బదులు.. మనసుకు నచ్చిన వాడు దొరికినప్పుడే మనువాడితే అలాంటి బంధం కలకాలం పచ్చగా ఉంటుందంటున్నారు. ఇది నిజమే కదా మరి!

సమయం మనది కానప్పుడు తప్పదు!

పైన చెప్పిన కారణాల వల్ల ఒంటరితనంతో బాధపడిన వారు నూటికి పది మందో, ఇరవై మందో ఉంటారేమో! కానీ కరోనా కారణంగా ఎంతోమంది కొన్ని నెలల పాటు తమ కుటుంబ సభ్యులకు దూరంగా సింగిల్‌గా ఉండాల్సి వచ్చింది. చాలామందికి అదొక నరకంలా అనిపించిందనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితి వారిని మానసికంగా మరింతగా దిగజార్చిందని చెప్పచ్చు.

అయితే సమయం మనది కానప్పుడు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎవరికైనా తప్పవంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడే సంయమనం పాటించాలంటున్నారు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మనందరినీ ఒక్కటిగానే కలిపి ఉంచుతుందన్నది కాదనలేని వాస్తవం. కాబట్టి సింగిల్‌గా ఉన్నామని బాధపడిపోకుండా మీకు నచ్చిన వారితో వీడియో కాల్స్‌ మాట్లాడచ్చు.. వర్చువల్‌ గేమ్స్‌ ఆడుకోవచ్చు.. వర్చువల్‌గానే నచ్చిన ప్రదేశాలకూ వెళ్లచ్చు.. ఇలా ఆలోచిస్తే ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి బోలెడన్ని ఆప్షన్లున్నాయి.

ఇవి గుర్తుంచుకోండి!

ఒంటరి అని బాధపడుతూ కూర్చోకుండా.. కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని ఆ ఫీలింగ్‌ని జయించే ప్రయత్నం చేయమంటున్నారు నిపుణులు.

* స్వీయ ప్రేమ మన మనసులో ఉండే ప్రతికూలతలన్నీ దూరం చేస్తుంది. కాబట్టి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అన్న విషయం పక్కన పెట్టి ఏం చేస్తే మీరు సంతోషంగా ఉండగలుగుతారో ఆ అంశాలపై దృష్టి పెట్టడం ఉత్తమం.

* ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం వల్ల ఇతర ఆలోచనలు మనసులోకి రాకుండా జాగ్రత్తపడచ్చు. ఈ క్రమంలో మీకు నచ్చిన పనులు, భవిష్యత్‌ లక్ష్యాలు, ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టండి.

* ఇతరులతో పోల్చుకున్నప్పుడు అవతలి వారికి ఏం లేకపోయినా.. మనమే వాళ్ల కంటే వెనకబడిపోయామన్న భావన మన మనసును తొలిచేస్తుంది.. ఒంటరితనాన్ని దగ్గర చేసి, మానసిక ప్రశాంతతను దూరం చేసే ఇలాంటి పోలికలు అసలు వద్దే వద్దు.

* మనసులో బాధుంటే దాచుకోకుండా పంచుకోవాలంటారు.. అందుకే మీకు నచ్చిన వ్యక్తులతో మీ జీవితంలోని ప్రతికూల పరిస్థితుల్ని పంచుకోండి.. వారి సహకారంతో తప్పకుండా మీకో పరిష్కారం దొరుకుతుంది.. మీ బాధా తీరిపోతుంది.

కారణమేదైనా.. ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేదే! అలాగని ఆ సమయంలో ‘నా టైమ్‌ బాగోలేదు’ అంటూ బాధపడకుండా.. దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషించినప్పుడే జీవితంలో ముందుకెళ్లగలుగుతాం. కావాలంటే ఈ క్రమంలో మానసిక నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చు.

మరి, మీ జీవితంలో మీరెప్పుడైనా ఒంటరితనంతో బాధపడ్డారా? ఏదో పొరపాటు చేశాను కాబట్టే సింగిల్‌గా ఉన్నానని మథనపడ్డారా? అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు మీరేం చేశారు? ఎలాంటి చిట్కాలు పాటించారు? మాతో పంచుకోండి. ఒంటరితనంతో బాధపడే ఎంతోమందికి మీరిచ్చే చిట్కాలు గొప్ప ఉపశమనాన్ని అందించచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని