close
Updated : 17/09/2021 19:03 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

Couple Equality: అలా భార్య ఆశీర్వాదం తీసుకున్నారు!

(Photo: Instagram)

మన హిందూ సంప్రదాయపు పెళ్లిళ్లలో భార్యలు భర్తల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం పరిపాటే! అయితే భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు భర్త కూడా భార్య ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదంటున్నారు ఈ తరానికి చెందిన కొందరు భర్తలు. మాటల్లో చెప్పడం కాదు.. ఆచరించి చూపించారు కూడా! అలా ఓ భర్త తాను తాళికట్టి ఏలుకున్న అర్ధాంగి కాళ్లకు నమస్కరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ‘భార్యాభర్తల సమానత్వాన్ని చాటారు!’ అంటూ నెటిజన్లు ఈ క్యూట్‌ హజ్బెండ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదేవిధంగా పెళ్లిలో వివిధ రకాలుగా భార్యాభర్తల సమానత్వాన్ని చాటిన జంటలు గతంలోనూ కొందరున్నారు. అలాంటి స్వీట్‌ కపుల్‌ క్యూట్ గెశ్చర్స్ ఇవి!

అన్ని విషయాల్లోనూ భార్య భర్త కంటే రెండు మెట్లు కిందే ఉండాలి.. అన్న మూసధోరణి ఇప్పటికీ కనిపిస్తున్న తరుణంలో కూడా చదువు, సంపాదన విషయాల్లో ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు.. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో ఈ అంతరాలెందుకు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది పురుషులు.  అందుకు తార్కాణమే ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ మరాఠీ కపుల్!

ఒకరి ఆశీర్వాదం మరొకరు..!

భార్యాభర్తలిద్దరూ సమానమైనప్పుడు ఇద్దరూ ఒకరి ఆశీర్వాదం మరొకరు తీసుకోవడంలో తప్పు లేదంటోందీ జంట. పీయూష్ అనే సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ ఇటీవలే తన ప్రియురాలితో ఏడడుగులు వేశాడు. అయితే పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక.. భార్య తన పాదాలకు నమస్కరిస్తుంటే వారించిన పీయూష్ ఆపై తాను తన సతీమణి కాళ్లను స్పృశించడానికి ప్రయత్నించాడు. అయితే ఇది చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. ఓ అడుగు వెనక్కి జంప్‌ చేసింది. ఇలా వరుడు చేసిన పనికి వధువే కాదు.. అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోవడంతో పాటు ‘పది కాలాల పాటు ఇలాగే కలిసి మెలిసి ఉండండ’ని ఆశీర్వదించారు. ఇక ఈ తంతునంతా వీడియో రూపంలో బంధించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లంతా ఈ జంటను ఆశీర్వదిస్తూ.. వరుడు చేసిన పనికి హ్యాట్సాఫ్‌ చెప్పారు.. ‘భార్యాభర్తల సమానత్వాన్ని చాటారు!’ అంటూ పీయూష్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.


తను నా ఇంటి గృహలక్ష్మి!

పుట్టింటిని వదిలి మెట్టినింటికి వచ్చిన తన భార్యను సాక్షాత్తూ లక్ష్మీదేవితో పోల్చాడు మరో భర్త. తన వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఆమెకు జీవితంలోనే కాదు.. గౌరవమర్యాదల్లోనూ సగపాలు పంచుతానంటున్నాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లి తంతు పూర్తై.. భార్య తన ఆశీర్వాదం తీసుకున్నాక.. తాను కూడా తన భార్య కాళ్లకు నమస్కరించాడు. దాంతో వధువే కాదు.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనకున్న అంతరార్థం ఏంటని అడిగితే.. ‘ఆమె నాకు సంతానాన్ని ప్రసాదించి నా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చింది.. మా ఇంటికొచ్చిన గృహలక్ష్మి.. తన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పేం లేదు..’ అంటూ బదులిచ్చాడీ క్యూట్‌ హబ్బీ. ఇలా తన చేతలతోనే కాదు.. మాటలతోనూ భార్యపై తనకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నాడు.


భార్య పేరు చేర్చుకున్నాడు!

సాధారణంగా పెళ్లి తర్వాత భార్యలు తమ పేర్లకు చివర భర్తల పేర్లు చేర్చుకోవడం, ఇంటి పేరు మార్చుకోవడం మనకు తెలిసిందే! అయితే ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. భార్య పేరునే తన పేరు చివర చేర్చుకొని దంపతులిద్దరూ సమానమే అన్న మంచి విషయాన్ని చాటాడు అమెరికాకు చెందిన ఒలెగ్‌ బుల్లర్‌. మన దేశానికి చెందిన ప్రముఖ ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్‌ దీపా ఖోస్లాను వివాహం చేసుకున్న బుల్లర్‌.. పెళ్లి తర్వాత తన పేరును ఒలెగ్‌ బుల్లర్‌ ఖోస్లాగా మార్చుకున్నాడు.. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీనే! అంతేకాదు.. వివాహ సమయంలోనూ తన భార్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడీ హ్యాండ్‌సమ్‌ హబ్బీ. ఈ ఫొటో అప్పట్లో తెగ వైరలైంది. ఇదే ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న దీప.. ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది.

‘పెళ్లికి కొన్ని నెలల ముందు హిందూ వివాహ సంప్రదాయపు పద్ధతులు, వేడుకల గురించి అమ్మ నాతో చెప్పింది. ఈ క్రమంలోనే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుందని తెలుసుకున్నా. అయితే ‘ఇదే పద్ధతిని అబ్బాయిలెందుకు పాటించకూడదు? ఒకరి ఆశీర్వాదం మరొకరు ఎందుకు తీసుకోకూడదు?’ అని అమ్మనడిగా! అది విని తను ఆశ్చర్యపోయింది. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. పెళ్లి వేదికపై నేను, ఒలెగ్‌ ఒకరి కాళ్లకు మరొకరు నమస్కరించాం.. దాంపత్య బంధంలో పరస్పర గౌరవం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించాం.. ఇదొక్కటే కాదు.. మేమిద్దరం ఇంటి పేర్లను కూడా మార్చుకొని మరోసారి సమానత్వాన్ని చాటాం..’ అని చెప్పుకొచ్చింది దీప.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కేన్స్ చిత్రోత్సవం వేదికగా బ్రెస్ట్‌ఫీడింగ్‌ థీమ్‌ డ్రస్‌ ధరించి.. బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడంపై అందరిలో అవగాహన కల్పించింది. ఇలా మరోసారి వార్తల్లో నిలిచిందీ ఇన్‌స్టా బేబ్.


తాళి కట్టించుకున్నారు!

భార్య పాదాలకు నమస్కరించడం, భార్య పేరును తన పేరు చివర చేర్చుకోవడమే కాదు.. ఏకంగా భార్యతో తాళి కట్టించుకొని వినూత్నంగా సమానత్వాన్ని చాటారు మరికొందరు భర్తలు.

* శార్దూల్‌ కదమ్‌, తనూజా పాటిల్‌.. ముంబయికి చెందిన ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఈ వేడుకలో భార్యతో తాళి కట్టించుకొని అటు భార్యాభర్తల మధ్య సమానత్వాన్ని, ఇటు భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు శార్దూల్‌. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మంగళసూత్రాన్ని సైతం డిజైన్‌ చేయించుకున్నాడీ క్యూట్‌ హబ్బీ. పితృస్వామ్య వ్యవస్థను, ఈ క్రమంలో అందరి మనసుల్లో వేళ్లూనుకుపోయిన ఆలోచనల్ని మార్చడానికే ఇలా చేశానంటున్నాడీ ముంబయి మ్యాన్.

* కర్ణాటకకు చెందిన అమిత్‌-ప్రియ, ప్రభురాజ్‌-అంకితల పెళ్లి ఒకేసారి ఒకే వేదికపై జరిగింది. వీళ్లు కూడా తమ భార్యలతో తాళి కట్టించుకొని సమానత్వాన్ని చాటారు. అంతేకాదు.. తమ పెళ్లిలో కన్యాదానానికి కూడా చోటివ్వలేదు. ‘పెళ్లిళ్ల తీరు మారాలని, వరకట్న భూతం అందమొందాలన్న సందేశం ఇవ్వడానికే’ తామిలా చేశామంటున్నారీ ఇద్దరు యువకులు.

ఏదేమైనా భార్యాభర్తలిద్దరూ సమానమేనంటున్న ఈ భర్తల ఆలోచనా ధోరణిని పలువురు ప్రశంసిస్తున్నారు. మరి, దీనిపై మీ స్పందనేంటి? ఇలా చేయడం వల్ల నిజంగానే దాంపత్య బంధంలో సమానత్వం సిద్ధిస్తుందంటారా? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని