Flu Vaccine: ఫ్లూ వ్యాక్సిన్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

తాజా వార్తలు

Updated : 13/07/2021 06:10 IST

Flu Vaccine: ఫ్లూ వ్యాక్సిన్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: కొవిడ్‌ వల్ల కలిగే తీవ్ర ప్రభావాల నుంచి ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ ఉపశమనం కలిగిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా కొవిడ్‌ వల్ల ఐసీయూలో చేరాల్సిన అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తడం లేదని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75వేల మంది కొవిడ్‌ బాధితుల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. కొవిడ్‌ సోకిన వారిలో గుండెపోటు, సెప్సిస్‌, రక్తం గడ్డకట్టడం (డీప్‌ వెయిన్‌ థ్రోంబోసిస్‌-DVT) వంటి ప్రమాదకర ముప్పును ఫ్లూ వ్యాక్సిన్‌ తగ్గిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ చాలా దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఏవిధంగా దోహదపడుతున్నాయో తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇన్‌ఫ్లూయెంజాకు ఉపయోగించే వ్యాక్సిన్‌ ప్రయోజనాలపై అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయెల్‌, సింగపూర్‌ దేశాల్లో దాదాపు 75వేల మంది కరోనా రోగులపై అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం TriNetXలోని 7కోట్ల మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీటినుంచి 75వేల మంది కొవిడ్‌ బాధితుల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో సగం మంది ఇదివరకే ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు (రెండు వారాల నుంచి 6నెలల క్రితం) కాగా, మరో సగం మంది వ్యాక్సిన్‌ తీసుకోనివారు ఉన్నారు.

తీవ్ర ప్రభావాల నుంచి పూర్తి రక్షణ..

ఈ రెండు గ్రూపుల కొవిడ్‌ బాధితుల్లో కనిపించిన ప్రభావాలను పరిశోధకులు పోల్చి చూశారు. అనంతరం ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకోని వారు 20శాతం ఎక్కువగా ఐసీయూలో చేరాల్సి వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. అంతేకాకుండా 58శాతం గుండెపోటు, 45శాతం సెప్సిస్‌, 40శాతం బాధితులు DVTకి గురైనట్లు కనుగొన్నారు. అయితే, కరోనా నుంచి ఫ్లూ వ్యాక్సిన్‌ ఎలా రక్షణ కల్పిస్తుందో కచ్చితంగా తెలియదని నిపుణులు పేర్కొన్నారు. సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని ఫ్లూ వ్యాక్సిన్‌ బలోపేతం చేయడం వల్లే ఇది సాధ్యమవుతునట్లు ఇదివరకు జరిపిన అధ్యయనాల్లో తేలిన విషయాన్ని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్‌ వల్ల కలిగే చాలా ప్రభావాల నుంచి ఫ్లూ వ్యాక్సిన్‌ రక్షణ కల్పిస్తోందని స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకురాని వారికి ఫ్లూ వ్యాక్సిన్‌ ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వనరులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న తరుణంలో తాజా ఫలితాలు ఊరట కలిగించే విషయమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మైమీ మిల్లర్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ దేవిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఒకవేళ వీటిని నిపుణులు ధ్రువీకరిస్తే మాత్రం ప్రపంచంపై కొవిడ్‌ భారాన్ని తగ్గించడంలో ఈ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని