రోజూకూలీ: కుమార్తెను ఎలా కాపాడుకున్నాడంటే..

తాజా వార్తలు

Updated : 20/06/2020 18:08 IST

రోజూకూలీ: కుమార్తెను ఎలా కాపాడుకున్నాడంటే..

తిరువనంతపురం: మానవాళికి కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మహమ్మారి మూలంగా ఒకానొక సందర్భంలో యావత్‌ ప్రపంచం స్తంభించిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది చిరుద్యోగులు, వ్యాపారులు, వలసకూలీలు, పేద కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారిలో కేరళలోని తిరువనంతపురానికి చెందిన బైజూ ఒకరు. లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కోల్పోయిన ఈ రోజూకూలీకి మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తన ఎనిమిదేళ్ల చిన్నారి అబినా కాలేయ సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమె బతకాలంటే ఇంకొకరు తమ కాలేయాన్ని దానం చేయాలి. అలా ఎవరైనా ముందుకొచ్చినా ఆపరేషన్‌కు రూ.20లక్షలు అవసరమవుతాయి. అలాంటి స్థితిలో బైజు ఏం చేశాడు? తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు?

తిరువనంతపురంలోని నెయ్యటింకర ప్రాంతానికి చెందిన బైజూకు ఇద్దరు కుమార్తెలు. అద్నా(9), అబినా(8). లాక్‌డౌన్‌ వేళ అబినా అనారోగ్యంతో బాధపడగా ఓ ఆస్పత్రిలో చూపించారు. ఆ చిన్నారి కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతోందని, వైద్యానికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని, దానికి రూ.20లక్షలు అవసరమవుతాయని చెప్పారు. అదృష్టం కొద్దీ అతడి లివర్‌ తన కూతురికి మ్యాచ్‌ అవడంతో వైద్యులు ఆపరేషన్‌ ఖర్చులు చూసుకోమని చెప్పారు. దీంతో నిర్ఘాంతపోయిన బైజూ కనపడిన వారందర్నీ సాయం కోసం అర్థించాడు. అయినా ఫలితం లేకపోయింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది క్రౌడ్‌ ఫండింగ్‌ గురించి వివరించడంతో చివరికి తన కూతురి ప్రాణాలను దక్కించుకున్నాడు. 

‘వైద్యులు నా కూతురి పరిస్థితి చెప్పేసరికి చాలా భయపడ్డా. తర్వాత కనపడిన వారందర్నీ సాయం అడిగినా ఫలితం లేకపోయింది. నేను పూర్తిగా ఆశలు వదులుకున్నా. ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే ఆస్పత్రిలో ఏడుస్తుండగా సిబ్బంది ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ గురించి చెప్పారు. అదేంటో అప్పటివరకూ నాకు తెలీదు. దాంతో ‘మిలాప్‌ క్రౌడ్‌ ఫండింగ్‌’ వారిని సంప్రదించాను. ఆన్‌లైన్‌ ద్వారా వాళ్లు విరాళాలు సేకరించారు. పదిరోజుల్లోనే విశేషమైన స్పందన వచ్చింది. రూ.11,81,325 నగదు జమ అయింది’ అని బైజూ వివరించారు. 

అనంతరం రాష్ట్ర సామాజిక భద్రతా మిషన్‌ నుంచి మరో రూ.10లక్షలు సాయం అందాయని, దాంతో కొచీలోని ఆస్టర్‌ మెడిసిటీ ఆస్పత్రిలో మే తొలి వారంలో తన కూతురికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించామని బైజూ చెప్పారు. ఆ వైద్య బిల్లులోనూ ఆస్పత్రి యాజమాన్యం కొంచెం సహాయం చేసిందని తెలిపారు. తర్వాత తన కూతురు 21 రోజులు ఐసీయూలో ఉందని, అలాగే ఇంకో మూడు నెలలు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అనేక మంది సహాయం చేశారని, అందుకు వారికి రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి భారత్‌తో పాటు విదేశాల నుంచీ ఎంతో సాయం చేశారని మిలాప్‌లోని సీనియర్‌ అధికారి ముబీన్‌ మొహమద్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని