Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 25/07/2021 17:10 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరిచి ఏం సాధిస్తారు?: రఘురామ

దేశంలో అందరూ ఒకరకంగా ఆలోచిస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో విధంగా ఆలోచిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో ఎలాగైనా పరీక్షలు పెట్టి తిరుతామని మొండిపట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తే.. సుప్రీంకోర్టు జోక్యంతో పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ఆగస్టు 16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు మరో విషమ పరీక్షను ఎదుర్కోబోతున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.

2. అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు: జీవీఎల్‌

ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీలో అప్పులకోసమే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎస్‌డీసీ)ఏర్పాటు చేసినట్టుందని.. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందన్నారు.

3. అసలు గిగాఫ్యాక్టరీ అంటే ఏంటి?.. వీటి వల్ల మనకెంత లాభం?

ఇపుడు ప్రపంచ దేశాల మౌలిక వసతుల ప్రణాళికల్లో వినిపిస్తున్న పదం ‘గిగాఫ్యాక్టరీ’. తాజాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏకంగా పర్యావరణ హిత ఇంధనం కోసం 4 గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రవాణాను పూర్తిగా మార్చేసే సత్తా ఉన్న ఈ గిగాఫ్యాక్టరీల గురించి తెలుసుకుందామా? 2013కు ముందు వినని పదం ఇది. ఎప్పుడైతే టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తన ప్రతిపాదిత లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంటుకు ‘గిగాఫ్యాక్టరీ’ అని పేరుపెట్టారో.. అప్పటి నుంచి ఈ పదం ప్రాచర్యంలోకి వచ్చింది.

4. వర్క్‌ఫ్రమ్‌ వెడ్డింగ్‌.. పెళ్లిపీటలపై ల్యాప్‌టాప్‌తో వరుడు

కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తుండడం మనం చూస్తున్నాం. మరో గత్యంతరం లేక అలా చేయక తప్పని పరిస్థితి. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి వేడుకలోనూ ఆఫీస్‌ పని చేస్తూ, వర్క్‌ఫ్రమ్‌ వెడ్డింగ్  విధానానికి తెరలేపాడు. ఇదేంటి అనుకుంటున్నారా? మహరాష్ట్రలోని ఓ పెళ్లి మండపంలో పక్కనే వధువు కూర్చున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వరుడు ల్యాప్‌టాప్‌ ముందు పెట్టుకుని తన పనిలో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

5ఆ గుడి తలుపులు ఏడాదిలో 5 గంటలే తెరుచుకుంటాయ్‌!

భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. దేవుడు వెలిసిన విధానంతో కావొచ్చు.. ఆలయ అద్భుత నిర్మాణంతో కావొచ్చు.. పుణ్యక్షేత్రాలుగా వేటి ప్రత్యేకత వాటిదే. కొన్ని ఆలయాల్లోకి ఏడాది పొడవునా భక్తులకు అనుమతిస్తే.. శబరిమల, ఛార్‌ధామ్‌ వంటి పుణ్యక్షేత్రాలకు ఏడాదిలో నెల, రెండు నెలల చొప్పున భగవంతుడి దర్శనం భాగ్యం కల్పిస్తారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దేవాలయంలో మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే గుడి తలుపులు తెరుచుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదా! మరి ఆ ఆలయం సంగతులేంటో తెలుసుకుందామా..!

6. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి దిల్లీకి చెందిన 9 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం సంభవించినట్లుగా ఒక్కసారిగా కొండ పైనుంచి బండరాళ్లు వేగంగా కిందకు దూసుకొచ్చాయి.  రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది.

7. Amit Shah: సరిహద్దు వివాదాలపై కీలక చర్చ

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు, కొవిడ్‌ కేసుల నియంత్రణ అంశాలపై కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం షిల్లాంగ్‌లో సమావేశమయ్యారు. అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు హాజరయ్యారు.

8. విక్టరీ పంచ్‌తో ఒలింపిక్స్‌లో విజయాన్ని కాంక్షిద్దాం!

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మన్‌ కీ బాత్‌ని ఆరంభించారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రారంభోత్సవాల్లో భారత్‌ బృందం చేసిన మార్చింగ్‌ యావత్తు దేశాన్ని పులకరింపజేసిందన్నారు. ఒలింపిక్స్‌లో ఆడుతున్న ప్రతిఒక్కరూ విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. 

9. Rajkundra: రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వారు సీబీఐని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

10. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరిన మేరీకోమ్‌
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ తొలి రౌండ్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ప్రీ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన మహిళల ఫ్లైవెయిట్‌(48-51) విభాగం 32వ రౌండ్‌లో డొమినికన్‌ బాక్సర్‌ హెర్నాండెజ్‌ గార్షియాపై 4-1 తేడాతో గెలుపొందింది. దాంతో మేరీ 16వ రౌండ్‌కు చేరింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బాక్సింగ్‌ దిగ్గజం తన నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని