Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 04/08/2021 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. వాసాలమర్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం.. అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న రైతువేదికలో 130 మందితో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. 

2. ఏ పంచాయతీకి ఎంత చెల్లించారో చెప్పండి: ఏపీ హైకోర్టు

రాష్ట్రంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని.. కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే రూ.413 కోట్లు చెల్లించామని.. నాలుగు వారాల్లో మరో రూ.1,117 కోట్లు చెల్లించనున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

3. కార్యకర్తల కుటుంబాలకు కేసీఆర్‌ పెద్దదిక్కు: కేటీఆర్‌

కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున చెక్కులను అందించిన కేటీఆర్‌ .. తన దృష్టికి తెచ్చిన సమస్యలను 15 రోజుల్లో  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

4. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దు: రేవంత్‌

పార్టీకి వ్యతిరేకంగా తనతో సహా ఎవరు పనిచేసినా చర్యలుంటాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దని హితవు పలికారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేస్తేనే గౌరవం పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 

5. సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించండి: తెలంగాణ హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ న్యాయస్థానం దృష్టికి వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది.

6. 29 మందితో బొమ్మై కొత్త టీమ్‌.. యడ్డీ తనయుడికి దక్కని చోటు!

కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్‌ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రెండు పర్యాయాలు దిల్లీ పర్యటనకు వెళ్లి భాజపా అధిష్ఠాన పెద్దలతో చర్చించి తర్జనభర్జనల అనంతరం బొమ్మై.. 29 మందితో కొత్త జట్టును ఎంపిక చేశారు. 

7. పెగాసస్‌పై చర్చ జరపాల్సిందే.. అమిత్‌ షా సమాధానం ఇవ్వాల్సిందే

దేశ భద్రతతో ముడిపడి ఉన్న పెగాసస్ హ్యాకింగ్‌పై పార్లమెంట్‌లో చర్చజరపాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తూ.. ఆ పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

రాజ్యసభలో ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్‌

8. ఆర్థిక కష్టాల్లో పాక్‌.. ప్రధాని నివాసం అద్దెకు!

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి దిగజారింది. సాంస్కృతిక, ఫ్యాషన్‌, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్‌ కేబినెట్‌ నిర్ణయించినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

9. కొనసాగిన లాభాల పరంపర.. జీవనకాల గరిష్ఠాలకు సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు బుధవారమూ కొనసాగింది. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 54 వేల మార్క్‌ను దాటింది. నిన్న 16 వేల మైలురాయిని దాటిన నిఫ్టీ నేడూ దూసుకెళ్లింది. రెండు సూచీలు ఈ రోజు తాజా జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి.

10. ఇక ‘పసిడి’ పట్టే.. భారత్‌కు రజతం ఖాయం చేసిన కుస్తీవీరుడు రవి

భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. భారత్‌కు కనీసం రజతం ఖాయం చేశాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న వేళ.. అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిలో స్వర్ణ పోరుకు అర్హత సాధించాడు. 7-9 తేడాతో కజక్‌స్థాన్‌ కుస్తీవీరుడు సనయెవ్‌ నురిస్లామ్‌ను ఓడించాడు.

IND vs ENG: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని